
తొలిసారి హైదరాబాద్‌లో
14న లాంఛనంగా ప్రారంభం
పాత, హైబ్రిడ్ కార్లు ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ - న్యూస్‌టుడే
ఎప్పుడు: నేటినుంచి 16 వరకు
ఎక్కడ: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రం.
ప్రత్యేకత: దేశంలోనే తొలి ప్రాంతీయ వాహన ప్రదర్శన ఇది.
ఎవరి ఆధ్వర్యంలో: భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ).
ప్రారంభం: 14న లాంఛనంగా ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా.
ఆకర్షణ, దర్పం ఉట్టిపడే కార్లు. రేసింగ్ బైక్‌లు, భావితరపు హైబ్రిడ్ వాహనాలు..
హైదరాబాద్‌లో జరగబోయే వాహన ప్రదర్శన ప్రత్యేకతలివి. మరోపక్క కొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఆయా కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. భారత వాహన విడి భాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ), భారత వాహన సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) కూడా పాలుపంచుకునే ఈ ప్రదర్శనలో 13న వికలాంగుల సందర్శనార్థం వాహనాలు కొలువు తీరతాయి. ఆ మర్నాటినుంచి సందర్శకులను అనుమతిస్తారు.
ఢిల్లీ వదిలి..: ఇప్పటిదాకా రెండోళ్లకోసారి ఢిల్లీలోనే నిర్వాహకులు వాహన ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. తొలిసారి ప్రాంతీయ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టి ఇందుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు. భవిష్యత్తులో దశల వారీగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాహన ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వాహన పరిశ్రమలోని భాగస్వాములకు రాష్ట్రంలో వాహన పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, కల్పిస్తున్న సదుపాయాలను కంపెనీలకు, విడి భాగాల తయారీదారులకు రాష్ట్ర రవాణా శాఖ ఈ సందర్భంగా వివరించనుంది.
దిగ్గజాల బల ప్రదర్శన
* టాటా మోటార్స్, టయోటా, జనరల్ మోటార్స్, ఫియట్, స్కోడా, మహీంద్రా&మహీంద్రా, హోండా కార్స్, టీవీఎస్ మోటార్స్, హోండా మోటార్‌సైకిల్స్, యమహా తదితర కంపెనీలన్నీ ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. వీటిలో కొన్ని దక్షిణాది మార్కెట్‌కు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నాయి.
* ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాన్సెప్ట్ వాహనం ఎటియోస్‌ను టయోటా ప్రత్యేకంగా ప్రదర్శించనుంది. అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టయోటా కార్లు, భవిష్యత్తు హైబ్రిడ్ వాహనాలు, బహుళ ప్రయోజన వాహనాలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
* హోండా మోటార్స్ కొత్త బైక్‌ను దక్షిణాది విపణిలోకి ప్రవేశపెట్టనుంది.
* వాహన కంపెనీలతోపాటు ఆడియో, వీడియో, జీపీఎస్ నావిగేషన్, భద్రత వ్యవస్థలను తయారు చేసే సంస్థలు, టైర్లు, విడి భాగాల కంపెనీలు పాలుపంచుకుంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శిస్తాయి.
విద్యార్థులకు పోటీ
* ప్యాసింజర్ కార్లు, అత్యంత ఖరీదైన కార్లు, బహుళ ప్రయోజన వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటు పాత కార్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ.
* హోండా మోటార్‌సైకిల్స్ సేఫ్టీ రైడ్
* మహీంద్రా&మహీంద్రా 4X4 ట్రాక్
* విద్యార్థులకు జనరల్ మోటార్స్ చిత్ర లేఖన పోటీ