కాసుల పంట
ముగిసిన 3జీ స్పెక్ట్రమ్ వేలం
ప్రభుత్వానికి రూ.67,719 కోట్ల ఆదాయం న్యూఢిల్లీ: 3జీ స్పెక్ట్రమ్ వేలం ప్రభుత్వానికి కాసుల పంట పండించనుంది. దేశంలోని 22 సర్కిళ్లలో ఈ సేవలు అందించేందుకు, కేంద్రం వేలం నిర్వహించింది. 34 రోజుల పాటు 183 రౌండ్లుగా జరిగిన వేలం ప్రక్రియ బుధవారంతో ముగిసింది. దేశంలోని అగ్రశ్రేణి టెలికం కంపెనీలు రూ.67,719 కోట్ల విలువైన బిడ్లు సమర్పించాయి. 3జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.35,000 కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం అంచనా వేయగా, దాదాపు అంతకు రెట్టింపు మొత్తం ఆదాయం లభించనుంది. అత్యధిక ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ స్పీడ్‌తో పాటు టెలివిజన్ కార్యక్రమాల వీక్షణం, మ్యూజిక్ డౌన్‌లోడింగ్ వంటి సేవలను 3జీ మొబైల్ వినియోగదారులు పొందనున్నారు. లైసెన్స్ పొందిన టెలికం కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఈ సేవలు అందించనున్నాయి.
కంపెనీలకు ఇలా..: భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఎస్సార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, టాటా టెలీ సర్వీసెస్, ఎయిర్‌సెల్, ఎటిసలాట్, ఎస్ టెల్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 13 సర్కిళ్లలో సేవలందించేందుకు రూ.12,290 కోట్లు చెల్లించనుంది. వొడాఫోన్ 9 సర్కిళ్లకు రూ.11,617 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 13 సర్కిళ్లకు రూ.8,583 కోట్లు, టాటా 8 సర్కిళ్లకు రూ.5,864 కోట్లు, ఎయిర్‌సెల్ 8 సర్కిళ్లకు రూ.6,498 కోట్లు, ఐడియా 11 సర్కిళ్లకు రూ.5,765 కోట్ల బిడ్లు సమర్పించాయి. ఎస్ టెల్ 3 సర్కిళ్లను దక్కించుకోగా, ఎటిసలాట్, వీడియోకాన్ ఒక్కటీ పొందలేకపోయాయి. దేశం మొత్తం 3జీ సేవలు అందించేందుకు రిజర్వ్ ధర రూ.3,500 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించగా, రూ.16,751 కోట్లు లభించింది. ఇప్పటికే 3జీ సేవలు అందిస్తున్న ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కూడా గెలుపొందిన వారు వేసిన బిడ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బీడబ్ల్యుఏ) వేలాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. కాగా వేలంపై రూ.35,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేయగా, అంతకు రెట్టింపు లభించనుండటంపై టెలికం మంత్రి ఎ.రాజా హర్షం ప్రకటించారు.