Friday, May 21, 2010

షాపింగ్‌కెళ్తే జేబుకు చిల్లే!

ఆరు నెలల్లో ధరలు పెరగవచ్చు..
ఆ దిశగా కంపెనీల యోచన: ఫిక్కీ నివేదిక
న్యూఢిల్లీ: ఇప్పటికే ధరాభారంతో చితికిపోతున్న సామాన్య ప్రజానీకానికి ఓ చేదు కబురు.. రానున్న రోజుల్లో సరుకులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లే వినియోగదారుల జేబులకు మరింత లోతైన చిల్లులు పడవచ్చన్నది ఫిక్కీ అంచనాగా ఉంది. ముడి సరుకుల ధరలు పెరిగి ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడవుతుండటంతో లాభాలు తగ్గుతున్నాయని లబోదిబోమంటున్న కంపెనీలు వచ్చే 6 నెలల్లో ధరల పెంపు దిశగా యోచిస్తున్నాయని ఫిక్కీ 2009-10 సంవత్సర ఆఖరి త్రైమాసిక వ్యాపార విశ్వాస సర్వే (బీసీఎస్‌)లో తెలిపింది. గిరాకీ కొంత మేరకు కుచించుకు పోయినా ఆ మూల్యాన్ని భరించైనా కంపెనీలు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి (ధరల పెంపు) సుముఖంగా ఉన్నాయని కూడా నివేదిక లో ఫిక్కీ పేర్కొంది. ఆదివారమిక్కడ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 325 కంపెనీల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా సర్వే నివేదిక రూపొందింంది. ఫిక్కీ సర్వేతో అభిప్రాయాలు పంచుకున్న సంస్థల్లో ఇంచుమించు 37 శాతం కంపెనీలు.. 'మానవ వనరుల వ్యయం, ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో ఉత్పత్తి వ్యయం బాగా పెరిగి వ్యయపరమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. వీటికి కళ్లెం వేసేందుకు రానున్న రోజుల్లో సరుకుల ధరలు పెంచనున్న'ట్లు తేల్చిచెప్పాయి. గతేడాది ఇదే కాలంలో నిర్వహించిన సర్వేలో కేవలం 18 శాతం కంపెనీలు మాత్రమే ధరలు పెంచనున్నట్లు తెలుపడం గమనార్హం. తీవ్రతరమవుతున్న రుణ సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ఐరోపా యూనియన్‌ చేపట్టనున్న చర్యలు రానున్న నెలల్లో భారతీయ ఎగుమతిదార్లను ప్రభావితం చేయొచ్చంది.

ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలి: బసు
సరకుల ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని ఎగదోయగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు అన్నారు. ఆయన ఒక వార్తాసంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అంతర్జాతీయంగా ఇనుము, ముడి చమురు వంటి సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనమేం చేయాలి? సరుకుల ధరలు పెరుగుతూపోతున్న విషయాన్ని ప్రజలకు ప్రభుత్వం తెలియజేయాలి. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న ధరభారాన్ని ఎదుర్కొనేందుకు వారిని సంసిద్ధులను చేయాలి. అంతే తప్ప మరో మార్గమేదీ లేదు.. ఈ ధరాఘాతం నుంచి కేవలం అట్టడుగు వర్గాలను బయటపడేసేందుకు చర్యలు చేపడితే సరిపోతుంది. కానీ సర్కారు ఓ తప్పిదం చేస్తోంది. అదేమిటంటే ధరలు పెరిగినప్పుడల్లా వినియోగదారులందరికీ తక్కువ ధరలకు సరుకులను అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తుండటమే' అని వివరించారు. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం సమీప భవిష్యత్తులో తగ్గవచ్చని, కానీ ప్రపంచ సరకుల ధరలు మొత్తంమీద ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచవచ్చని బసు అభిప్రాయపడ్డారు.