70 శాతం రక్షణ సామగ్రి విదేశాల నుంచే
ఇప్పుడిప్పుడే మారుతున్న పరిస్థితి
ప్రైవేటు, విదేశీ కంపెనీలకు ఆహ్వానం
పరిశోధన, అభివృద్ధికి తరలివస్తున్న విదేశీ పెట్టుబడులు స్వాతంత్య్రం వచ్చి షష్ఠిపూర్తి చేసుకున్నా రక్షణ రంగంలో మాత్రం మనది వెనక సీటే. వేల కోట్ల రూపాయలు వెచ్చించి రక్షణ సామగ్రిని కొంటున్నాం. ఇప్పటికీ 70 శాతం సామగ్రి అవసరాలకు మనం విదేశాలపైనే ఆధారపడుతున్నాం. అంటే బడ్జెట్లో రక్షణకు వంద రూపాయలు కేటాయిస్తే 70 రూపాయలు విదేశాలకే వెళ్లిపోతోంది. ఈ రాతను తిరగరాసి 70 శాతం సామగ్రిని స్వదేశంలోనే తయారు చేసుకునే లక్ష్యంతో ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాలనే ప్రతిపాదనతో మరిన్ని మంచి రోజులు రానున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
2009-10 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా.. రూ.1,42,000 కోట్లు. విశేషమేమిటంటే.. ఇందులో 40 శాతం సొమ్ములు కేవలం గతంలో కొనుగోలు చేసిన సామగ్రి తుప్పు వదిలించేందుకే (నవీకరణ కోసం) సరిపోతుంది. రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు 2002లో ప్రభుత్వం రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్ధతి (డీపీపీ)ని ప్రవేశపెట్టింది. తాజాగా కిందటేడాది అందులో సవరణలు చేసింది. భారత రక్షణ పరిశ్రమలో ఇది ఒక విప్లవానికి నాంది పలికింది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న భారత పరిశ్రమలకు 'కొనండి.. (భారత్‌ను) తయారు చేయండి' కింద సాంకేతిక అంశాల కొనుగోలుకు అనుమతులు ఇచ్చింది. నవంబరు 1, 2009 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పద్ధతి ద్వారా సాంకేతికత మన దేశంలోకి తరలి వస్తుందన్నది భారత రక్షణ శాఖ అభిప్రాయం. మరోపక్క బహుళ జాతి, విదేశీ రక్షణ కాంట్రాక్టర్ల సహకారానికి భారత్ తలుపులు తెరచింది. అయితే వీరు 30 శాతం కాంట్రాక్టులను స్థానిక పరిశ్రమలతో కలిసి చేయాల్సి ఉంటుంది. తాజా నిబంధనలతో టాటా పవర్, ఎల్&టీ, మహీంద్రా&మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. ప్రైవేటు రంగానికి వూతం
రక్షణ రంగంలో ప్రైవేటు రంగానికి 2001లో తలుపులు తెరచిన తర్వాత ఆ రంగంపై ప్రైవేటు కంపెనీలు అమితాసక్తిని ప్రదర్శించాయి. నూటికి నూరు శాతం భాగస్వామ్యంతో 26% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. మొదట్లో భారీ నిధుల దృష్ట్యా, రక్షణ అవసరాలు ఎప్పటికప్పుడు మారుతుండడంతో కంపెనీలు వెనుకంజ వేశాయి. అయితే గత 4-5 ఏళ్లలో అటు విదేశీ సంస్థలతోనూ, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలతోనూ భాగస్వామ్యం కుదుర్చుకోగలిగాయి. భారీ స్థాయి కంపెనీలు అటు పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ)లోనూ; ఇటు మౌలిక వసతుల అభివృద్ధిలోనూ కాలు పెడుతున్నాయి. ఇప్పటిదాకా దాదాపు రూ.8000 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులపై సంతకాలు జరిగాయని స్వయానా రక్షణ మంత్రి ఆంటోనీ వెల్లడించడం గమనార్హం. ఇపుడిక 74 శాతం ఎఫ్‌డీఐ పరిమితికి పచ్చజెండా ఊపితే ప్రైవేటు కంపెనీలకు ఆకాశమే హద్దుగా నిలవగలదు.
* బ్రిటన్‌కు చెందిన బీఏఈ సిస్టమ్స్‌తో కలిసి డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ ఇండియా అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రధాన రక్షణ రంగ సరఫరాదారుగా మారాలని భావిస్తోంది.
* వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి రక్షణ రంగ అవసరాలను తీర్చగలిగే విధంగా నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎల్&టీ రూ.1840 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
* టాటా గ్రూపునకు చెందిన రక్షణ యూనిట్ సికోర్‌స్కీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్ప్‌తో సంయుక్త సంస్థను ఏర్పాటు చేసింది. 2012 కల్లా ఉత్పత్తి ప్రారంభిస్తారు.
కేటాయింపులు తక్కువే అమెరికా మిలటరీ 2007లో 547 బిలియన్ డాలర్ల మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించగా.. బ్రిటన్ 60 బిలియన్ డాలర్లు వెచ్చించి రెండో స్థానంలో ఉంది. 24 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో భారత్ ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామగ్రి కొనుగోలుకు రూ.47,976 కోట్లు ఉన్నాయి(పట్టిక చూడండి). |
రక్షణ రంగంలో 74% ఎఫ్‌డీఐ! న్యూఢిల్లీ: రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) వాటాను ప్రస్తుతమున్న 26 శాతం పరిమితిని నుంచి 74 శాతానికి పెంచాలని ప్రభుత్వం సోమవారమిక్కడ ప్రతిపాదించింది. పాతకాలం నాటి రక్షణ రంగ సామగ్రిని అతి త్వరగా అభివృద్ధి చేయాల్సి ఉందంటూ ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ పేర్కొంది. దీంతో రక్షణ రంగంలోని దిగ్గజ కంపెనీలకు భారత్‌లో తయారీ కేంద్రాలను పెట్టే దిశగా సంకేతాలు ఇచ్చినట్లయింది. సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపుకు, దాదాపు 800 కోట్ల డాలర్ల(రూ.36,000 కోట్లు) దిగుమతులను తగ్గించుకోవడానికీ తాజా ప్రతిపాదన ఉపయోగపడుతుందని భావిస్తోంది. 'కేవలం 15 శాతం భారత రక్షణ సామాగ్రి మాత్రమే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయని దాదాపు సగం ఇప్పటి అవసరాలకు ఏమాత్రం పనికిరావని.. కాబట్టి వెంటనే రక్షణ దళాల కార్యకలాప సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉంద'ని తెలిపింది. కాగా, ఎఫ్‌డీఐలో పెంపు అంటే భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్న కంపెనీల నుంచి కచ్చితంగా సామగ్రి కొంటామని అర్థం కాదని పారిశ్రామిక విధానాల, ప్రోత్సాహకాల విభాగం(డీఐపీపీ) వ్యాఖ్యానించింది. 'కొనుగోలుపై ఎలాంటి హామీ ఉండదు.. ఆయా కంపెనీలు సాంకేతికంగా అర్హత పొంది.. ఆర్థిక బిడ్‌లలో పోటీ పడాల్సి ఉంటుంద'ని డీఐపీపీ ఒక చర్చాపత్రంలో పేర్కొంది. జులై 31 వరకూ ఈ విషయంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇతర శాఖలతో చర్చిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా 'మేం ప్రస్తుతం ఇతర శాఖలతో చర్చలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఒక నిర్ణయానికొస్తామ'ని డీఐపీపీ కార్యదర్శి ఆర్.పి. సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉన్న 26 శాతం ఎఫ్‌డీఐ పరిమితి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించడంలో విఫలమైందని డీఐపీపీ ఆ చర్చా పత్రంలో పేర్కొంది. |
సైన్యానికి కావలసిన సామగ్రి155 ఎమ్‌ఎమ్ గన్స్, టీసీఎస్బీఎమ్ఎస్డ్రై, వెట్ బ్రిడ్జ్‌లు, ఫ్యూజులుబై మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్స్పెషలిస్ట్ వాహనాలుఎయిర్ విజన్ గన్మిసైల్ వ్యవస్థనైట్ విజన్ పరికరాలు