Friday, May 21, 2010

ఏప్రిల్‌ బల్లే.. బల్లే ... విమాన సంస్థలకు గిరాకీ

పెరిగిన ప్రయాణీకులు
వేసవి రద్దీ ప్రధాన కారణం
ప్రిల్‌ నెల.. దేశీయ విమాన సంస్థలకు బాగా కలిసొచ్చింది. ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరిగింది. చాలాకాలం తర్వాత విమానాల్లో సీట్లన్నీ ప్రయాణీకులతో కళకళలాడాయి. వేసవి సెలవుల్లో కాస్త కూల్‌కూల్‌గా.. శీతల ప్రదేశాలను చుట్టి వచ్చేద్దామని భావించే వారి సంఖ్య పెరగడం కూడా విమాన సంస్థలకు కాసిన్ని కాసులు తెచ్చిపెట్టింది.

గత నెల 41.88 లక్షల మంది ప్రయాణికులను విమాన సంస్థలు వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. మార్చిలో వీరి సంఖ్య 39.03 లక్షలే. కిందటేడాది ఏప్రిల్‌ నెలతో పోల్చుకుంటే ప్రయాణీకుల సంఖ్య ఏకంగా 26 శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ దాకా మొత్తం నాలుగు నెలల కాలంలో 1.63 కోట్ల మంది విమానాల్లో ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే కాలంలో వీరి సంఖ్య 1.33 కోట్లే. ఎందుకింత గిరాకీ అంటే..: కిందటేడాది ఏప్రిల్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర 90 డాలర్లు పైనే ఉంది. ఇప్పుడు 75-80 డాలర్ల మధ్యలో ఉంది. దీంతో విమాన సంస్థల పెట్టుబడి వ్యయం కాస్త అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా అవి ఛార్జీల పెంపుపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రయాణీకుల సంఖ్య పెరగడానికి ఇదో కారణం.

* మార్చి, ఏప్రిల్‌లు వేసవి విహారాలకు అనువైన నెలలు. ఈ నెలల్లో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
* ఆదాయ స్థాయి పెరిగే మధ్య తరగతి వర్గాలూ విమాన ప్రయాణంపై మొగ్గు చూపడం మరో కారణం.
* విమాన ఛార్జీలు గత ఏడాదితో పోలిస్తే ఓ మోస్తరుగా ఉండటం కూడా గిరాకీ పెరగడానికి ఇంకో కారణం.