Thursday, May 13, 2010

బీసీలకు కార్పొరేట్‌ విద్యపై పిల్లిమొగ్గ


బీసీలకు కార్పొరేట్‌ విద్యపై పిల్లిమొగ్గ
పథకం రద్దు చేస్తూ ఉత్తర్వులు
ఆ తర్వాత సవరణ
నేడు తుది నిర్ణయం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బీసీ విద్యార్థులను కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాల్లో చదివించే పథకాన్ని కొనసాగించే విషయంలో సర్కారు నిర్ణయం గందరగోళానికి దారితీసింది. 2010-11 విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆదేశాలిచ్చిన కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది. బీసీ సంక్షేమశాఖ మొదట జారీచేసిన జీవో 162లో 15 పేరాలున్నాయి. అందులో 13వ పేరాలో '2010-11 నుంచి ఈ పథకం అమలుచేయడం లేదు' అని పేర్కొంది. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో ఈ జీవోకు సవరణ చేసింది. 13వ పేరాలో ఉన్న ఆ వాక్యాన్ని తొలగించారు. సవరించిన జీవోలో 14 పేరాలు మాత్రమే ఉన్నాయి. పథకాన్ని నిలిపివేస్తున్నట్లు బయటకు పొక్కడంతో రాజకీయపక్షాలు, ప్రజా, బీసీ సంఘాలనుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యమంత్రి రోశయ్య బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారుల్ని పిలిపించి మాట్లాడారు. జీవోను సవరించాలని ఆదేశించారు. ఈ విషయంపై ప్రభుత్వం గురువారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. బీసీ, సాంఘిక, గిరిజన, ఉన్నతవిద్యాశాఖ మంత్రులు, ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పథకాన్ని కొనసాగించాలా? వద్దా? కొనసాగిస్తే.. ఎలా కొనసాగించాలి? అనే అంశాలను చర్చించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం తుదినిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.

అమలుపై వూగిసలాట
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదోతరగతిలో 450కిపైగా మార్కులొచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాల్లో ప్రవేశం కల్పించే పథకం 2008-09 నుంచి అమలవుతోంది. తొలిసారి ఈ పథకం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇటీవల ద్వితీయ సంవత్సరం పూర్తి చేశారు. వీరి ఫీజులకు రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2009-10లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన వారి ఫీజులకు రూ.40కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది. వారు ఇప్పుడు ద్వితీయ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున అదనంగా నిధులివ్వాలి. బకాయిలు విడుదల, అదనపు బడ్జెట్‌ తదితర అంశాలపై గందరగోళం నెలకొనడంతో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ముగింపు దశలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సమావేశం ఏర్పాటుచేసి చర్చించారు. పథకాన్ని కొనసాగించాలా లేదా అనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుతం కొనసాగించాలని, ప్ర.భుత్వ గురుకుల జూనియర్‌ కళాశాలల్ని బలోపేతం చేసిన అనంతరం ఎత్తివేయాలని సూచన వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. బుధవారం అకస్మాత్తుగా బీసీ విద్యార్థులకు పథకం నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసి వెంటనే సవరించింది.

కొనసాగించాలి: బీసీ సంఘాలు
కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే పథకాన్ని కొనసాగించాలని పలు బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. దీన్ని ఖర్చు కోణంలో చూడటం న్యాయం కాదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పథకం కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ మహాజన సమితి కన్వీనర్‌ ఉ.సాంబశివరావు మరో ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రయోజనకరమైన పథకాన్ని ఎత్తివేసి బీసీ విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించవద్దని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.