Saturday, May 29, 2010

అరచేతిలో అనుబంధం

సామాజిక సంబంధాలకు వూతం
'టీవీ'క్షణానికి మొబైల్‌ మంత్రం
3జీతో అంతా స'చిత్రం'
ఆర్థిక వ్యవస్థకూ ఆలంబన
రూ.67,719 కోట్లు.. ఇది తక్కువ మొత్తమేమీ కాదు.. 3జీ వేలంలో టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించబోయే మొత్తమిది. 3జీపై ఎందుకింత ఆసక్తి..? 3జీ కోసం కంపెనీలు ఎందుకంతగా ఎగబడ్డాయి...? మొబైల్‌ వినియోగదార్లకు మరిన్ని అద్భుతమైన సేవలు అందుబాటులోకి వస్తాయా..? సేవలు ఇప్పటికన్నా చౌకగా మారతాయా..? అన్నవి ప్రధాన ప్రశ్నలు. ఈనేపథ్యంలో 3జీ సేవలపై సమగ్ర సమాచారాన్ని తెలిపే 'ఈనాడు బిజినెస్‌' ప్రత్యేక కథనం.
మొబైల్‌ రంగంలో ఇప్పుడిప్పుడే మొదలైన 3జీ విశ్వరూపం చూపించనుంది. సామాజిక సంబంధాల నుంచి టీవీల వీక్షణం దాకా.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నుంచి సినిమాల డౌన్‌లోడ్‌దాకా అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా విజృంభించనుంది. సమాచార వ్యవస్థను సమూలంగా మార్చేయగల ఈ 3జీ వచ్చే త్వరలోనే మన దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ సేవలను ఇక నుంచీ ప్రైవేటు రంగంలోని సెల్‌ కంపెనీలూ అందించనున్నాయి. దీంతో మొబైల్‌ విప్లవం కొత్త పుంతలు తొక్కనుంది.

3జీతో..
* ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్‌ ఫోన్ల పనివేగంకన్నా మరింత వేగం సొంతమవుతుంది.
* ఇంటర్నెట్‌ను మన అరచేతిలోని మొబైల్‌లోకి తీసుకొస్తుంది. అదీ అత్యంత వేగంతో..
* ఇపుడున్న డిజిటల్‌ నెట్‌వర్కుల కన్నా 3జీ వ్యవస్థలో సమాచారం దాదాపు 40 రెట్ల అధిక వేగంతో బదిలీ అవుతుంది.

* సెకనుకు కనీసం 3 మెగాబైట్ల సమాచారాన్ని సరఫరా చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే 3 నిమిషాల ఎంపీ3 పాటను కేవలం 15 సెకన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం వాడుతున్న 2జీలో అయితే 8-9 నిమిషాల సమయం పడుతోంది.

* అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్‌ సంఘం(ఐటీయూ) అధ్యయనం ప్రకారం మొబైల్‌ వ్యాప్తి 1 శాతం పెరిగితే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) దాదాపు 5 శాతం వృద్ధి చెందుతుంది.

* ఈ లెక్కన మొబైల్‌, ఇంటర్నెట్ల సమాహారమైన 3జీ సేవలు అందుబాటులోకి వస్తే మన దేశం మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది
* తగ్గుతోంది.. ఉద్యోగాలు పెరుగుతాయ్‌
* 3జీ స్పెక్ట్రమ్‌ వేలం కారణంగా ప్రభుత్వానికి లభించిన అదనపు ఆదాయం ద్రవ్యలోటును తగ్గించేందుకు సహకరిస్తుంది.

* బడ్జెట్‌లో ద్రవ్యలోటును జీడీపీలో 5.5 శాతంగా అంచనా వేశారు. ఇది కాస్తా తాజా పరిణామంతో 5 శాతానికి పరిమితం కావొచ్చు.
* రెవెన్యూ లోటు కూడా 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గొచ్చు.
* ఈ సేవలు అందుబాటులోకి వస్తే రానున్న మూడేళ్లలో కొత్తగా సుమారు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

* 3జీ స్పెక్ట్రమ్‌ దక్కించుకున్న సంస్థలు సేవలు మొదలు పెట్టేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుపై సుంకాలు, 3జీ హ్యాండ్‌సెట్లు, ప్రకటలనపై పన్నులు.. తదితరాల ద్వారా ప్రభుత్వానికి మరో రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

* తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌లు స్పెక్ట్రమ్‌ ఫీజు నుంచి మినహాయింపును కోరబోమని తెలపడంతో ప్రభుత్వానికి మరో రూ.16,500 కోట్లు రానున్నాయి. ఇందులో రూ.6,500 కోట్లు ఎమ్‌టీఎన్‌ఎల్‌ చెల్లించనుండగా.. మిగతాది బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వస్తుంది.

కార్పొరేట్‌లకు లాభమే
* కంప్యూటరు, మోడెం, ల్యాన్‌ వంటి నెట్‌వర్కింగ్‌ సదుపాయాలు లేకపోయినా నేరుగా చేతిలోని మొబైల్‌ నుంచే ఇంటర్నెట్‌కు అనుసంధానం కావచ్చు. ఫలితంగా విద్యుత్‌ ఆదాతో పాటు ఐటీ మౌలిక వసతుల ఏర్పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

* కార్పొరేట్‌ల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు మొబైల్‌లోనే లేఖలు, ఆర్డర్లను టైప్‌చేసి ఉన్నచోట నుంచే మెయిల్‌, ఫ్యాక్స్‌ చేసేందుకు వీలుంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ టారిఫ్‌ ఇలా!
రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 3జీ సర్వీసులు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సిమ్‌ కార్డులు రూపొందించారు. వీటి సామర్థ్యం 256 కిలోబైట్లు. కొత్త కనెక్షన్‌ కింద ఈ 3జీ సిమ్‌ కార్డును రూ.59గా నిర్ణయించారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పొందుతున్న వినియోగదారులుM3G120 అని టైప్‌ చేసి 53733 నంబరుకు ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపాలి. వెంటనే ఆ కనెక్షన్‌ 3జీ కిందకు మారిపోతుంది. రూ.120 చెల్లించి రీఛార్జి చేసుకుంటే 180 రోజుల కాలపరిమితి లభిస్తుంది. రూ.20 టాక్‌టైమ్‌ పొందవచ్చు.
వీడియో కాల్‌
ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద కొత్త వినియోగదారులకు నిమిషానికి లోకల్‌ కాల్‌కు 30 పైసలు, ఎస్‌టీడీ కాల్‌కు 50 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఇప్పటికే 2జీ వినియోగిస్తూ.. 3జీకి మారిన వారికి లోకల్‌ కాల్‌ టారిఫ్‌ 70 పైసలు, ఎస్‌టీడీ అయితే రూపాయి ఉంటుంది.

డేటా వినియోగం: 3జీలో డేటా వినియోగానికి 10 కేబీలకు పైసా చొప్పున వసూలు చేస్తారు.

స్పెక్ట్రమ్‌ అంటే
ది రేడియో తరంగాల పౌనఃపున్యాల శ్రేణి. వివరంగా చెప్పుకోవాలంటే మనిషి గొంతు తరంగాల కనీస పౌనఃపున్యం 200 హెర్ట్జ్‌. గరిష్ఠం 3,000 హెర్ట్జ్‌. వీటి తేడా 2800 హెర్ట్జ్‌. దీనినే స్పెక్ట్రమ్‌ అంటారు. ఇక 3జీ సేవలకు కావలసిన స్పెక్ట్రమ్‌ 15-20 మెగా హెర్ట్జ్‌లుగా ఉంటుంది. అదే 2జీ సేవలకైతే 30-200 కిలోహెర్ట్జ్‌గా ఉంటుంది. అంటే 3జీకి భారీ స్పెక్ట్రమ్‌ అవసరమన్నమాట.
2జీకి, 3జీకి తేడా..
2జీ అంటే రెండో తరపు టెలికాం టెక్నాలజీ. తొలి తరంలో అనలాగ్‌ సంకేతాలను.. రెండో తరం(2జీ)లో డిజిటల్‌ సాంకేతికతనూ ఉపయోగిస్తారు. ఇక 3జీలో అయితే మరిన్ని ప్రమాణాలతో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని వాడతారు. 3జీతో ఒకేసారి శబ్ద సమాచారం (టెలిఫోన్‌ కాల్‌)తో పాటు ఇతర (సమాచారం డౌన్‌లోడింగ్‌, ఇమెయిల్‌ పంపడం; సందేశాలను ఇచ్చిపుచ్చుకోవడం వంటి) సమాచారాన్నీ పంపుకొనే వీలుంటుంది.
ఛార్జీలు చౌక!
3జీ వస్తే ఛార్జీలు మరింత తక్కువ కావొచ్చు. ఎందుకంటే ఏ ఒక్క ఆపరేటరుకూ దేశవ్యాప్తంగా సేవలందించడానికి బిడ్‌ దక్కలేదు. కాబట్టి టెలికాం కంపెనీల మధ్య రోమింగ్‌ ఒప్పందాలు ఎక్కువగా జరగడం సహజం. తద్వారా ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సీడీఎమ్‌ఏ, 3జీ స్పెక్ట్రమ్‌ కలిగి ఉన్న టాటా టెలీసర్వీసెస్‌ వంటి కంపెనీలు రెండు సాంకేతిక పరిజ్ఞానాలనూ కలిపి దేశవ్యాప్త సేవలనందించడానికి ప్రయత్నించొచ్చు. వీటివల్ల సేవల ధరలు కిందికి దిగిరావచ్చు. మిగతా ఆపరేటర్లు సైతం పోటీ కారణంగానైనా చౌక ధరల మంత్రాన్ని పఠించొచ్చు.
రూ.4000కే 3జీ ఫోన్‌
3జీ సేవలు ఇంకా ప్రారంభం కాకమునుపే మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీ కంపెనీలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ.4000 స్థాయిలో 3జీ ఫోన్లను విక్రయించేందుకు ఈ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. వచ్చే 6 నెలల్లో 7 కొత్త మోడళ్లను తెచ్చేందుకు శామ్‌సంగ్‌ యత్నిస్తోంది. మిగతా కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చు. ఆయా కంపెనీలు టీవీ సీరియళ్లు, వినోద క్లిప్పింగ్‌లను అందించడానికీ యత్నాలు జరుగుతున్నాయి. వివిధ బ్రాండెడ్‌ సంస్థల 3జీ ఫోన్లు ఎంతకి దొరుకుతున్నాయంటే...

* నోకియా: రూ.4,119(మోడల్‌ 2730) ఆపైన
* సోనీ ఎరిక్‌సన్‌: రూ.6000, ఆపైన
* బ్లాక్‌బెర్రీ: రూ.17,000, ఆపైన
*యాపిల్‌ ఐఫోన్‌: రూ.30,000, ఆ పైన

3జీ... కొన్ని విశేషాలు
* 3జీ సేవలు తొలుత ప్రారంభించిన దేశం జపాన్‌.
* ఇపుడు 132 దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి
* ప్రపంచంలోని 470 కోట్ల మంది మొబైల్‌ వాడకం దార్లలో 13 శాతం మంది అంటే 62 కోట్ల మందే 3జీ సేవలు వినియోగించుకుంటున్నారు. దీనికి కారణం అధిక ధరలే.
* 2013 నాటికి 3జీ వినియోగదార్ల సంఖ్య 57 కోట్లకు చేరనుంది. ఇందులో 6 శాతం మంది భారత్‌లోనే ఉండనున్నారు.
వినోదమే వినోదం
* 3జీ నేరుగా అందుబాటులోకి వస్తే ఇద్దరు వ్యక్తులు నేరుగా ఫోన్‌లో ఒకరిని ఒకరు తెరపై చూసుకుంటూ సంభాషించుకోవచ్చు. తద్వారా ఆప్తులు దూరంగా ఉన్నారన్నలోటు కొంత వరకు తీరుతుంది.

* ఆడియో, గ్రాఫిక్స్‌, సమాచారంతో పాటు ఫోన్‌లో వీడియోలను చిత్రీకరించి వెనువెంటనే మన ఆప్తులకు, బంధుమిత్రులకు వాటిని పంపించుకోవచ్చు.

* టీవీ కార్యక్రమాలను నేరుగా మొబైల్‌ తెరపైనే వీక్షించవచ్చు. దీని వల్ల ఇష్టమైన టీవీ కార్యక్రమాలను చూడలేకపోయామన్న బాధే ఉండదు. ఎక్కడున్నా ఆ సమయానికి ఫోన్‌లోనే చూడొచ్చు.

* నచ్చిన వీడియో దృశ్యాలను నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని చూడవచ్చు.
* కొత్త సినిమా పాటలను, దృశ్యాలను అడిగి వీక్షించే(ఆన్‌ డిమాండు) వీలుంటుంది.
* కంప్యూటరు, ల్యాప్‌టాప్‌ లేకుండానే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక నెట్‌వర్క్‌లతో వేగంగా అనుసంధానం కావొచ్చు.

రైతన్నల సేవలోనూ
* గ్రామీణ ప్రాంత ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* వరదలు, అకాల వర్షాల వంటి సమాచారాన్ని మరింత వేగంగా అందించి వారిని అప్రమత్తం చేసేందుకు ఉపకరిస్తుంది.
* పొలాల్లో చీడల గురించి నేరుగా దృశ్యరూపంలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమస్యలను వివరించవచ్చు.
* అధికారుల నుంచి సస్యరక్షణతో పాటు లాభసాటి మార్కెటింగ్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
వైద్య సేవలకూ..
* పల్లెల నుంచే ప్రజలు తమ ఈసీజీ, ఎక్స్‌రేల నివేదికలను పట్టణాల్లోని వైద్యులకు చూపించి వైద్య సలహాలు పొందవచ్చు.
* టెలీ మెడిసిన్‌ వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
* గర్భిణీలు, క్షయ, ఎయిడ్స్‌ రోగులు రోగ తీవ్రతను బట్టి పాటించాల్సిన సూచనలను దృశ్యరూపంలో అందించవచ్చు.
బ్యాంకింగ్‌, ట్రాఫిక్‌..
* 3జీ రక్షణాత్మక మొబైల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
* బ్యాంకులు అందుబాటులో లేని పల్లెల్లోని ప్రజలు నేరుగా మొబైల్‌ ద్వారా బ్యాంకింగ్‌ వ్యవహారాలు జరపవచ్చు.
* పట్టణాల్లో ట్రాఫిక్‌ జామ్‌ల గురించిన సమాచారాన్ని, ప్రత్యామ్నాయ మార్గాలను 3జీ ఆపరేటర్‌ వినియోగదార్లుకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌, జీపీఎస్‌ మ్యాప్‌ క్లిప్‌ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.
తగ్గనున్న దుబారా
* సరికొత్త టెలికాం పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే ప్రజా పంపిణీ, ప్రభుత్వ పథకాల్లో దుబారాకు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
* మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల తీరుతెన్నుల గురించి సామాన్య ప్రజలకు వీడియో క్లిప్పింగుల రూపంలో అర్థమయ్యేలా చెప్పేందుకు వీలవుతుంది.