Monday, May 31, 2010

కాకినాడ రిఫైనరీ కథ కంచికి

హైదరాబాద్‌: ఏళ్ళు గడుస్తున్నా.. రాష్ట్రం లో జిఎమ్‌ఆర్‌ రిఫైనరీ పనులు కార్యరూపం దాల్చడంలేదు. దాదాపుగా గత రెండేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ జిఎమ్‌ ఆర్‌ రిఫైనరీ పలనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ వస్తున్నది. కొంత కాలం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ధరలు క్షీణించడం, అనంతరం ఆర్థిక మాంద్యం సాకుగా చూపి దీర్ఘకాలంగా రిఫైనరీ నాటకాన్ని జిఎమ్‌ఆర్‌ ముందు కు నడిపిస్తూ వచ్చింది. మరోవైపు అధికారులు కూడా జిఎమ్‌ ఆర్‌ రిఫైనరీ ఏర్పాటుపై తమకేమీ తెలియదని, వారినే అడ గండని పరిశ్రమల అధికారులు సమాధానం చెప్పకుండా జారుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

దీంతో జిఎమ్‌ఆర్‌ రిఫైనరీ కథ కంచికి చేరినట్లుగానే కనబడుతున్నది.ఈ భూములు ప్రత్యామ్నాయ పనులకు వినియోగించు కోవడానికి జిఎమ్‌ఆర్‌, కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం సన్నా హాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో కాకినాడ సెజ్‌లో ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసి రిఫైనరీ ఏర్పాటుకు ముందు కు వచ్చినప్పటికీ.. అప్పటి సర్కార్‌ పెద్దలు వ్యవహరించిన తీరుతో విస్తుపోయిన ఒఎన్‌జిసి కెఎస్‌ఇజెడ్‌ నుంచి అయిష్టంగానే తప్పుకుంది. మొత్తంగా కాకినాడ సెజ్‌ నుంచి ఒఎన్‌జిసిని వెళ్ళగొట్టడంలో మన పాలకులు విజయం సాధించినా.. రాష్ట్రానికి అత్యంత ప్రయోజనాలు కల్పించే రిఫైనరీ కల మాత్రం నెరవేరలేదు. గతంలో ఒఎన్‌జిసికి కేటాయించిన 2,500 ఎకరాల భూములు రాష్ట్రానికి చెందిన జిఎమ్‌ఆర్‌గ్రూప్‌కు అందచేసినప్పటికీ.. సదరు సంస్థ ఇప్ప టికీ రిఫైనరీ పనులు చేపట్టలేదు. ప్రభుత్వరంగసంస్థ ఒఎన్‌ జిసిని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టి.. తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర పెద్దలు జిఎమ్‌ఆర్‌కు కెఎస్‌ఇజెడ్‌లో భూములు అప్పగించారు.

ప్రధానంగా కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం వ్యవహరించిన తీరు...సర్కార్‌ పెద్దలు ఒఎన్‌జిసితో తమ ఆటలుసాగవని, తమ గారాలపట్టి జిఎమ్‌ఆర్‌కు తెరమీదకు తీసుకు రావడం తెలిసిన విషయమే. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యార ల్‌ ధరలు దూసుకుపోతున్నప్పటికీ... జిఎమ్‌ఆర్‌ కాకినాడ సెజ్‌ పరిధిలో రిఫైనరీ పనులు చేపట్టకపోవడం విశేషం. కాకినాడ రిఫైనరీ పనులను ఒఎన్‌జిసి రూ. 30 వేల కోట్లతో ఏటా 20 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో తన ప్రతి పాదనలు ప్రభుత్వానికి సమర్పించింది.

అనంతరం ఒఎన్‌ జిసి భూములు నిబంధనలకు విరుద్ధంగా జిఎమ్‌ఆర్‌కు కాకి నాడ సెజ్‌ యాజమాన్యం కేటాయించినప్పటికీ... రిఫైనరీ పనులు చేపట్టకపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావి స్తున్నది. కెఎస్‌ఇజెడ్‌ యాజమాన్యం ఒఎన్‌జిసి, ఇతర కంపె నీల పేరుతో స్థానికంగా రైతులు నుంచి వేల ఎకరాల భూములు నిబంధనలకు విరుద్ధంగా సేకరించినప్పటికీ.. ఆ మేరకు కంపెనీలు ఉత్పత్తి పనులు చేపట్టకోపోవడం విశే షం. సెజ్‌ భూములు సేకరణ సందర్భంగా లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల నుంచి కారుచౌకగా భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఏపిఐఐసి ద్వారా చేపట్టింది.

ప్రభుత్వం అధికారికంగా 12 వేల ఎకరాలకుపైగా కాకి నాడ సెజ్‌ పరిధిలో భూసేకరణ చేపట్టగా.. ప్రైవేట్‌గా సదరు సెజ్‌ యాజమాన్యం రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం ప్రక్రి యకు అప్పటి సర్కార్‌ పెద్దల అండదండలు ఉండడంతో సెజ్‌ యాజమాన్యం అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిం దనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. జిఎమ్‌ఆర్‌కు సెజ్‌ భూముల ధర నిర్ణయం సందర్భంలోనూ కెఎస్‌ఇజెడ్‌ యాజ మాన్యంతో వాడివేడి చర్చలే జరిగాయని తెలిసింది. ప్రభుత్వ పెద్దలు స్వప్రయోజనాలతో రాష్ట్ర సంక్షేమాన్ని తాకట్టుపెట్టి..ఒఎన్‌జిసిని మెడపట్టి మరీ రాష్ట్రం నుంచి తరి మేయడం సదరు సంస్థ అధికారులు ఇప్పటికీ జీర్ణించుకో లేకపోతున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు స్థానికంగా మరో ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ కంపెనీ కోల్పోయామని పోతున్నారు.

ఈ మొత్తం కథ అప్పటి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసినా.. సర్కార్‌ పెద్దల ప్రయో జనాలు కాకినాడ సెజ్‌తో ముడిపడి ఉండడంతో నోరు మెదపలేని పరిస్థితి ఎదుర్కొన్నట్లు మాజీ ఎంఎల్‌ఏ ఒకరు వాపోయారు. కెఎస్‌ఇజెడ్‌ ప్రైవేట్‌ సెజ్‌కావడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని, అదే విధంగా రాష్ట్రంలోని నెల్లూ రు, చిత్తూరు జిల్లాలోని ప్రైవేట్‌ సెజ్‌లోనూ దాదాపు ఇదే పరి స్థితి నెలకొందని పలువురు అంటున్నారు. ప్రజల నుంచి కారుచౌకగా భూములు పొంది... అటు పరిశ్రమలు, ఇటు ఉపాధి అవకాశాలు కల్పించకుండాపోవడంతో అధికారుల కు తాజా పరిస్థితులు మింగుడుపడడంలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రవొదిలి.. ప్రైవేట్‌ సెజ్‌ అక్రమా లపై కొరఢా ఝులిపించి.. సెజ్‌ల నుంచి భూములు వెనక్కి తీసుకుని, బాధిత రైతులకు తిరిగి ఇవ్వాలనే డిమాండ్‌ గట్టి గా వినిపిస్తున్నది.