Tuesday, May 11, 2010

ఏడాది నిర్లక్ష్యం మూల్యం చెల్లించిన ఐఎఫ్‌బీ

లోపభూయిష్టమైన మైక్రోవేవ్‌ ఓవెన్‌ను విక్రయించి, అందులో సమస్య వస్తే సకాలంలో పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించి, ఆఖరుకు బాధితుడికి కొత్త ఓవెన్‌ను ఇవ్వడమే కాకుండా పరిహారాన్ని కూడా చెల్లించవలసి వచ్చిన ఉదంతం ఇది..
నంతపురం జిల్లా గుంతకల్లు నివాసి ఎం.వేణుగోపాల్‌ 2008 మే 7న అనంతపురంలోని డిజిటల్‌ షాపీలో రూ.7,990 ఖర్చుపెట్టి ఐఎఫ్‌బీ మైక్రోవేవ్‌ ఓవెన్‌ (మోడల్‌ నం. 20ఎస్‌సీ2) కొనుగోలు చేశారు. ఓవెన్‌లో ఏదైనా సమస్య వస్తే 24 గంటల లోపల హాజరై దానిని సరిదిద్దుతామని షాపువారు చెప్పారు. మూడు నెలలకే అది చెడిపోయి ంది. సెప్టెంబరు 2న వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. ఆయనకు షాపువారు ఐఎఫ్‌బీ కంపెనీ కాంట్రాక్టు టెక్నీషియన్‌ భరణి కుమార్‌ మొబైల్‌ నంబర్‌ను ఇవ్వడంతో పాటు, ఐఎఫ్‌బీ లోకల్‌ టెక్నీషియన్‌ దేవా గురించి కూడా తెలిపారు. పలుమార్లు ఫోన్‌ చేశాక బాషా అనే అతను వచ్చి ఓవెన్‌ను తెరిచి చూసి సర్క్యూట్‌ బోర్డులో లోపం ఉందని, తాను మళ్లీ వచ్చేటపుడు వేరేది తెస్తానన్నాడు. మూడు నెలలు గడిచినా తిరిగిరాలేదు. 2009 జనవరి 3న ఫిర్యాదుదారు వెళ్లి అడగగా బాషా కంపెనీని విడిచిపెట్టి పోయాడని చెప్పారు. భరణి కుమార్‌కు, దేవాకు ఫోన్‌లు చేయగా అదే ఏడాది జనవరి 7న దేవా వచ్చి కొత్త సర్క్యూట్‌ బోర్డును బిగించాడు. కానీ ఓవెన్‌ పనిచేయలేదు. కొద్ది రోజుల్లో భరణి కుమార్‌ను పంపిస్తానంటూ దేవా వెనుదిరిగాడు. భరణి కుమార్‌ తాను హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లానని, కొత్త సర్క్యూట్‌ బోర్డు హైదరాబాద్‌ నుంచి రాలేదని చెప్పాడు. ఫిర్యాదుదారు రాష్ట్ర సర్వీస్‌ విభాగం ఇన్‌ఛార్జి రామకృష్ణను సంప్రదించినా, ఫలితం లేకపోయింది. మరోవైపు ఉచిత సర్వీసు గడువు 2009 మే 7తో ముగిసింది. ఐఎఫ్‌బీ, డిజిటల్‌ షాపీల నిర్లక్ష్య ధోరణిపై ఫిర్యాదుదారు జిల్లా వినియోగదారు వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించారు. ఓవెన్‌ను కొత్తది ఇవ్వాలని, లేదా దాని ధరను 12 % వడ్డీ సహా చెల్లించాలని, దాంతో పాటు అసౌకర్యం, మానసిక వేదన కలిగించినందుకు రూ.10,000 , ఖర్చుల కింద మరో రూ.1,000 ఇవ్వాలని కేసు పెట్టారు.

ఫిర్యాదుదారు వినియోగదారు ఫిర్యాదుల కేంద్రంలో ఫిర్యాదును నమోదు చేయలేదని, బాషా అనే టెక్నీషియన్‌ ఓవెన్‌ను సేవా కేంద్రానికి తీసుకువెళ్తానంటే ఫిర్యాదుదారు అంగీకారం తెలుపలేదని, సీనియర్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ను పంపినా లాభం లేకపోయిందని ఐఎఫ్‌బీ పేర్కొంది. ఫిర్యాదుదారు మొండి వైఖరి వల్లనే వారంటీ కాలం తీరిపోయిందంది. మరో 6 నెలలు వారంటీ పొడిగిస్తూ కోర్టుకు వెలుపల రాజీ కోసం ప్రతిపాదిస్తే, ఫిర్యాదుదారు మొదట అంగీకరించి తరువాత మాట మార్చారంది. చివరికి ఫిర్యాదుదారు మనసు మార్చుకొని కొత్త మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఇస్తే కేసు ఉపసంహరించుకొంటానన్నారని తెలిపింది. కొత్త ఓవెన్‌ను ఇచ్చినా కేసును వెనుకకు తీసుకొనేందుకు రూ.5,000 ఇవ్వాలని ఆయన షరతు పెట్టారంది.

ఇరు పక్షాల వాదనలను విన్న ఫోరమ్‌.. సరికొత్త ఓవెన్‌ను ఇస్తామని ఐఎఫ్‌బీకి చెందిన ప్రసన్న కుమార్‌యే ప్రతిపాదించినట్లు కనుగొంది. కొత్త ఓవెన్‌ ఇవ్వడానికి ఏడాది పట్టడంతో ఫిర్యాదుదారుకు అసౌకర్యం కలిగిందంది. ఆయనకు ఫిర్యాదు తేదీ నుంచి 12% వడ్డీతో రూ.2,000 పరిహారంగా, మరో రూ.1,000 ఖర్చుల కింద చెల్లించాలని గత ఫిబ్రవరి 3న ఆదేశించింది. మొత్తం రూ.3,216కు చెక్కును ఐఎఫ్‌బీ తనకు పంపించినట్లు ఎం.వేణుగోపాల్‌ తెలిపారు.