Tuesday, May 11, 2010

జీవితాన్ని మార్చిన టేబుల్‌ టెన్నిస్‌

నా ప్రస్థానం
పాఠశాల రోజుల్లో సంజయ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌. జాతీయ స్థాయిలోనూ 1978-86 వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారు. వేగంగా దూసుకువచ్చే బంతి మార్గాన్ని అంచనా వేసి, అంతే చురుగ్గా తిప్పికొట్టే నేర్పు జీవితంలో ఆయనకు ఎంతో ఉపకరించింది. అందరి జీవితాల్లానే మోడీ జీవనయానంలోనూ గడ్డు పరిస్థితులున్నాయి. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాక ఆరేళ్లు భారీ యంత్ర పరికరాల పరిశ్రమలో కుస్తీపట్టారు. అప్పుడు పని నుంచి విశ్రాంతి తీసుకుని, ఎంబీఏ చదివారు. అనంతరం ఎన్‌ఐఐటీలో వినియోగదారు సంబంధ వ్యవహారాలు చూసినప్పుడు, ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా అర్థమైందంటారు మోడి. 'డాట్‌కామ్‌' బూమ్‌ సమయంలో తాను చేరిన కంపెనీ త్వరగా మునిగిపోవడంతో సంజయ్‌మోడీకి కొంతకాలం గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. సరిగ్గా అప్పుడే జాబ్‌ పోర్టల్‌ 'మాన్‌స్టర్‌' మనదేశంలోకి ప్రవేశించింది. ముంబయిలో సంస్థ వ్యవహారాలు చూసుకునే బాధ్యతను చేపట్టాక వెనక్కు తిరిగి చూసుకునే అవసమరమే రాలేదంటారు మోడి. రెండు దశాబ్దాల నిర్విరామ కృషితో ఉన్నతస్థాయికి ఎదిగిన మోడీలో క్రీడాకారుడు మాయమైపోలేదు. మానసికోల్లాసం కోసం మళ్లీ తన రాకెట్‌ చేపట్టారు ఆయన.

అందరూ ఖర్చు తగ్గించుకుంటే..
ఆర్థిక సంక్షోభం నడుమ ఖర్చు తగ్గించుకోడానికి దాదాపు అన్ని కంపెనీలు ప్రయత్నించాయి. కానీ వ్యాపారం పెంచుకోడానికి అదే సరైన సమయంగా ఎంచుకున్నారు మోడి. గ్రామీణుల ఉపాధి కోసం 'మాన్‌స్టర్‌ ఇండియాస్‌ రూరల్‌ జాబ్‌ పోర్టల్‌'ను ఆరంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని 300 గ్రామాలకు చేరువ చేశారు. 3 నెలల్లో 300 ఉద్యోగావకాశాలు నమోదవ్వగా, 100 మంది ఇప్పటికే నియామకాలు పొందారు కూడా. 3,000 గ్రామాలకు తన పోర్టల్‌ను విస్తరించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.

తొలి ప్రేయసి
తనతో వివాహం కాకముందు సంజయ్‌ తొలి ప్రేయసి టేబుల్‌ టెన్నిస్సే (టీటీ) అంటారు ఆయన శ్రీమతి దీప్‌శిఖ.. ఆమె కూడా టీటీలో సంజయ్‌కు సహాధ్యాయి. వారాంతంలో భార్యాభర్తలిద్దరూ గుర్‌గావ్‌లోని యునిటెక్‌ క్లబ్‌లో సరదాగా రాకెట్‌తో పోరాడుతుంటారు. 14 ఏళ్ల కుమార్తె ద్రిష్టి చదువుపైనే శ్రద్ధ చూపుతుండగా, తొమ్మిదేళ్ల శ్వేతాంక్‌ మాత్రం రాకెట్‌ చేతబూని తండ్రికి వారసుడిగా ఎదుగుతున్నాడు. సరిగ్గా 9 ఏళ్ల ప్రాయంలోనే సంజయ్‌ కూడా తల్లి ప్రోత్సాహంతో టీటీ రాకెట్‌ను అందిపుచ్చుకోవడం యాదృచ్ఛికమే.

ఓడిపోతామనే భావనే వద్దు
'క్రీడాకారుడికి ఉండేది దృఢ చిత్తం. ఆటలో దిగామంటే గెలుపే ధ్యేయంగా సాగుతారు. ఓడిపోతామనే భయమే దరి చేరదు. ఈ తత్వమే కార్యసాధనలోనూ ముందుకు నడిపిస్తుంది. శారీరకంగా అలసిపోయినా, పని చేసేందుకు కావాల్సిన శక్తి నిస్తుంది' అంటారు మోడి.

'టేబుల్‌ టెన్నిస్‌ నాకు వ్యక్తిత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని అందించింది.. ఆటలో ఎదుర్కొనే ప్రతి బంతీ కొత్తగానే ఉంటుంది. ఈ ధోరణే నా జీవితానికీ ఉపయోగపడింది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన నన్ను వీడలేదు. ఇప్పటి ఉన్నత స్థితికి ఇవే బీజాలు వేశాయి'
-మాన్‌స్టర్‌ జాబ్‌ పోర్టల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మోడి