Friday, May 21, 2010

'రిలయన్స్‌' గ్యాస్‌ చర్చలు షురూ!

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌(ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌)ల మధ్య గ్యాస్‌ సరఫరా ఒప్పందం విషయమై మంగళవారం చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముకేశ్‌, అనిల్‌ అంబానీ సోదరుల మధ్య నడుస్తున్న గ్యాస్‌ వివాదంపై ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి ఈ చర్చలు మొదలయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఆర్‌ఐఎల్‌, అడాగ్‌కు చెందిన ఇద్దరు పైస్థాయి అధికార్లు మంగళవారం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టార'ని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా అటు ముకేశ్‌ వర్గం నుంచి కానీ, ఇటు అనిల్‌ వర్గం నుంచి కానీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. 2005లో కుదిరిన ప్రైవేటు కుటుంబ ఒప్పందం ప్రకారం ఆర్‌ఐఎల్‌ నుంచి చౌక గ్యాస్‌ సరఫరా చేయాలంటూ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ పెట్టుకున్న పిటిషన్‌కు మే 7న సుప్రీం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఆరు వారాల్లో ఒక ఒప్పందానికి రావాలని సోదరులకు ఆ సమయంలోనే సూచించింది.