Tuesday, May 11, 2010

లాభాల వరదతో హోరెత్తిన సెన్సెక్స్‌


లాభాల వరదతో హోరెత్తిన సెన్సెక్స్‌
కారణం గ్రీసు ప్యాకేజీ ఆమోదం
లాభం 561 పాయింట్లు
ఈ ఏడాది అతిపెద్ద ర్యాలీ ఇదే
వారం రోజులుగా కట్టిపడేసిన నష్టాల తాడును 'బుల్‌' తెంచేసుకుంది. సోమవారం ఉదయం నుంచీ మొదలెట్టిన ఆ పరుగును సాయంత్రం దాకా కొనసాగించింది. ఆ ఉరుకులు పరుగుల్లో ఎక్కడా అలసట కనిపించలేదు. అంతకంతకూ వేగం పెరుగుతూనే ఉంది. 200 పాయింట్లు.. 300 పాయింట్లు.. అలా అలా లాభాలను లాక్కుంటూ వెళ్లి మార్కెట్‌ ముగిసే సరికి 561 పాయింట్ల మూటను తెచ్చిపడేసింది. 10 నెలల గరిష్ఠ స్థాయి వద్ద భీకర రంకె వేసింది. మదుపర్ల సంపదను ఒక్క రోజులోనే అదనంగా రూ. 1.73 లక్షల కోట్లకుపైగా పెంచింది. ఇందుకు గ్రీసుకు 1 లక్ష కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీ ప్రకటన గ్లూకోజులా పనిచేయగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సుప్రీం సానుకూల తీర్పు మరికొంత ఊతాన్ని ఇచ్చింది. మొత్తం మీద 'మండే' మదుపర్లకు మాత్రం చాలా చల్లగా అనిపించింది.
అంతటా అనుకూలమే
ప్రారంభ గంట నుంచీ సెన్సెక్స్‌ లాభాల్లో పయనించడానికి వెనుక కారణం అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీనే. గ్రీసు సహాయ ప్యాకేజీ ఏకంగా 2007-09లో అమెరికా ప్రకటించిన సహాయ ప్యాకేజీ పరిణామంలోఉండడంతో ప్రపంచ మార్కెట్లన్నీ ఊరడిల్లినట్లే కనిపించాయి. అంతక్రితం వారంలో పొందిన నష్టాలను తుడిచివేస్తూ ఎగశాయి. ఐరోపా మార్కెట్లలో ఎఫ్‌టీఎస్‌ఈ 5%, డాక్స్‌ 4.5%, సీఏసీ-40 8.6% (భారత్‌ మార్కెట్లు ముగిసే సమయానికి)మేర దూసుకెళ్లాయి. ఇక డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ 3.5%, నాస్‌డాక్‌ ఫ్యూచర్స్‌ 2.66 శాతం మేర పరుగులు తీశాయి. అంతక్రితం ఆసియా మార్కెట్లూ ఇదే బాటలో పయనించాయి. హాంగ్‌సెంగ్‌ 2.5%; నిక్కీ, స్ట్రెయిట్‌ టైమ్స్‌ , కోస్పి, తైవాన్‌లు 1.3-2% లాభపడ్డాయి. ఇవన్నీ మన మార్కెట్లపైనా ప్రభావం చూపాయి. అందుకే ఈ లాభాల పంట.
ఇలా సాగాయ్‌
అంతర్జాతీయంగా సానుకూల పవనాలు కనిపించడంతో సెన్సెక్స్‌ 17,000 పాయింట్లను; నిఫ్టీ 5100 స్థాయిని (ఒక దశలో 5200నూ దాటింది) విజయవంతంగా దాటగలిగాయి. ఎఫ్‌ఐఐలు భారీ కొనుగోళ్లకు దిగడంతో ఇది సాధ్యమైంది. సెన్సెక్స్‌ కేవలం 30.38 పాయింట్ల లాభంతో 16,799.49 వద్ద ప్రారంభమైంది. అదే కనిష్ఠ స్థాయి. అటు తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మధ్యాహ్నం తర్వాత ఐరోపా మార్కెట్ల చేయూతతో బ్లూచిప్‌ కంపెనీలు భారీ లాభాలను అందుకోవడంతో గరిష్ఠంగా 587.53 పాయింట్లతో 17,356.64కూ దూసుకెళ్లింది. చివరకు 17,330.55 వద్ద స్థిరపడింది. 5026.60 వద్ద ప్రారంభమైన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీకి అదే కనిష్ఠస్థాయి. ఆ తర్వాత 5,203.30 వద్దకూ చేరినా చివరకు 175.55 పాయింట్ల లాభంతో 5193.60 వద్ద ముగిసింది.

ఇవీ విశేషాలు
* ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ర్యాలీ. గతేడాది జులై 17 తర్వాత ఒక రోజులో పొందిన భారీ లాభం(561 పాయింట్లు) కూడా ఇదే.
* ఆసియా మార్కెట్లు ప్రారంభమయ్యే ముందు గ్రీసు ప్యాకేజీ ప్రకటించడం కూడా కలిసివచ్చింది. ఆసియా మార్కెట్ల మాదిరే ఇతర మార్కెట్లూ స్పందించాయి.
* ఫార్మా తప్ప అన్ని సూచీలు లాభాలందుకున్నాయి. స్థిరాస్తి(6.17%), లోహ(6.06%) సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, వాహన, విద్యుత్‌, చమురు-సహజవాయువు, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీలు 1.11-3.95% మేర ముందుకెళ్లాయి.
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4.48% లాభంతో రెండు వారాల గరిష్ఠం రూ.1,080.20కు చేరింది. ఇక ఇన్ఫోసిస్‌ రూ.41.35 కూడగట్టుకుని రూ.2661 వద్ద స్థిరపడింది. ఈ రెండింటికీ కలిసి సూచీలో 23 శాతం వాటా ఉంది.
* సెన్సెక్స్‌-30లో అన్నీ లాభాలనందుకున్నా సిప్లా(6.42%), హీరోహోండా(0.21%)లు మాత్రం నష్టపోయాయి.
* 2306 స్క్రిప్‌లు లాభాలు పొందగా.. 679 స్క్రిప్‌లు మాత్రం నష్టాల పాలయ్యాయి.
* మార్కెట్‌ టర్నోవరు రూ.4,308.72 కోట్లుగా నమోదయ్యాయి.

రూ.460 తగ్గిన బంగారం
ముంబయి: గ్రీసు ప్యాకేజీ పుణ్యమాని బంగారం ధరలు కిందకు దిగివచ్చాయి. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బేరిష్‌ నుంచి బులిష్‌గా మారడంతో మదుపర్లు బంగారం నుంచి మార్కెట్‌ వైపు దృష్టి సారించారు. దీంతో పసిడి మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పది గ్రాముల ప్రామాణిక బంగారం(99.5 స్వచ్ఛత) స్థానిక మార్కెట్లో రూ.460 మేర తగ్గింది. రూ.17,495గా పలికింది. శుక్రవారం ముగింపు రూ.17,955గా ఉంది. ఇక స్వచ్ఛమైన(99.9) బంగారం రూ.455 కుంగి రూ.17,580కు చేరింది. ఇతర మార్కెట్లలో పైడి ధరవరలు 'వసుంధర' పేజీలో చూడొచ్చు. పారిశ్రామిక వినియోగదార్ల నుంచి డిమాండు తగ్గడంతో కిలో వెండి ధర సైతం రూ.190 పడిపోయి రూ.29,040గా పలికింది.