Friday, May 21, 2010

ఇదో 'సువర్ణా'వకాశం..!

నేడే అక్షయ తృతీయ..
రాష్ట్రంలో 5,000 కిలోల విక్రయం!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
క్షయ తృతీయకు బులియన్‌ మార్కెట్‌ సర్వసన్నద్ధం అయింది. వైశాఖ మాసంలో అమావాస్య దాటిన మూడో రోజున వచ్చే ఈ పసిడి పండుగకు ఈసారి బంగారం అమ్మకాలు 15-20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. స్వర్ణం ధర రికార్డు గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారు చాలా తక్కువ పరిమాణంలో కొనుగోలుకు పరిమితం కావచ్చునని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 10 గ్రాములు కొనుగోలు చేయాలనుకునేవారు 5 గ్రాములతోనే సరిపెట్టుకోవచ్చు, లేదా బంగారానికి బదులు వెండిని కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నాయి. ఉన్నత స్థాయి వర్గాల్లో 100 గ్రాములు కొనుగోలు చేసేవారు 90 గ్రాములతో సరిపెట్టుకోవచ్చనేది బులియన్‌ వర్తకుల అంచనాగా ఉంది. అయితే.. అక్షర తృతీయ సెంటిమెంట్‌ మాత్రం బాగా వ్యాపించింది. కొనుగోలుదార్ల సంఖ్య పెరగగలదని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పసిడి వ్యాపారి ఒకరు ఆశాభావం వ్యక్తంచేశారు. 'శుక్రవారం అమావాస్య. కొనుగోళ్లు కొద్దిగా మందకొడిగా ఉన్నాయి. శని, ఆది వారాలు షాపింగ్‌కు వెసులుబాటు కాబట్టి అమ్మకాలు పుంజుకోవచ్చు' అని ఆయన చెప్పారు.

సాధారణ రోజుల్లో పెద్ద షాపుల్లో పుత్తడి విక్రయాలు కేజీ వరకు ఉంటాయి. అక్షయ తృతీయ రోజు ఇది 5 కేజీల వరకు పెరుగుతుంది. ఈ సారి 3.5-4 కిలోల వరకు విక్రయించే ఆస్కారం ఉంది. చిన్న షాపులు అర కిలో వరకు అమ్మకాలు జరపవచ్చు. మొత్తంమీద రాష్ట్రంలో అక్షయ తృతీయ అమ్మకాలు 5,000 కిలోల వరకు ఉండవచ్చని అంచనా. ఇందులో 2,000 కిలోలు ఒక్క హైదరాబాద్‌లోనే విక్రయం కావచ్చు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రభావం కొంత ఉండవచ్చు.

వజ్రాల పొడి నగలకు గిరాకీ: అధిక ధర ఉండే వజ్రాలు పొదిగిన నగలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కానందున వజ్రాలు సాన పట్టేటప్పుడు మిగిలిన పొడితో చేసిన నగలకు గిరాకీ పెరుగుతోంది. ఈసారి అక్షయ తృతీయకు ఈ నగలకు గిరాకీ ఎక్కువ ఉండనుందని చందన బ్రదర్స్‌ ఎండీ జె.రామారావు తెలిపారు. వజ్రాల హారం ఖరీదు దాదాపు రూ.25 లక్షలు ఉంటుంది. అదే కట్‌ డైమండ్‌తో (వజ్రాల పొడి) చేసినది రూ.2-3 లక్షలకే లభిస్తుందని చెప్పారు. కట్‌ డైమండ్‌ నగలతో పాటు 'వెడ్డింగ్‌ సెట్ల'కూ గిరాకీ ఉండనుంది.

ఆఫర్ల వరద
* ప్రభుత్వ రంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టీసీ 0.5, 1, 2, 5, 8 ,10, 20, 50, 100 గ్రాముల బంగారం నాణేలను; 10, 20, 50, 100, 500, 1000 గ్రాముల వెండి నాణేలను విక్రయించనుంది.

* ఖజానా జువెలరీ అతి తక్కువ వేల్యూ యాడిషన్‌ (మజూరీ, ప్లస్‌ తరుగు) తన ప్రత్యేకతగా చెప్తోంది.

* వజ్రాభరణాలపై 15% వరకూ తగ్గింపును; సాధారణ బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీల్లో 80 శాతం వరకూ తగ్గింపును తనిష్క్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ గత నెల 30 నుంచి అమల్లో ఉంది.

* మలబార్‌ గోల్డ్‌ ప్రతి 20 గ్రా. బంగారు ఆభరణాల కొనుగోలు/బుకింగ్‌లపై బంగారు నాణెం ఉచితంగా ఇస్తానంటోంది.

* ఎంబీఎస్‌ జువెలర్స్‌ రూ.25,000 పైన కొనుగోలు చేసిన వారికి కూపన్‌లు ఇచ్చి ఈ నెల 17న లక్కీ డ్రాను నిర్వహించి 4 షెవర్లే బీట్‌ కార్లను గెల్చుకొనే అవకాశం కల్పించనుంది.

* 'సర్‌ప్రైజ్‌ డిస్కౌంట్‌' ఉంటుందంటూ శ్రీ కృష్ణ జువెలర్స్‌ వూరిస్తోంది.

* కేఆర్‌ శాల విశిష్ట డిజైనర్‌ కలెక్షన్‌ 'జడాయు జువెలరీ'పై 21 శాతం తగ్గింపును త్రిభువన్‌దాస్‌ భీమ్‌జీ జవేరీ ప్రకటించింది. ఆఫర్‌ ఈ నెల 18 వరకు కొనసాగనుంది.

* ఓరా అక్షయ తృతీయ ప్రి-బుకింగ్‌ ఆఫర్‌గా బంగారు కడ్డీలు, నాణేల తయారీ ఛార్జిల మీద నేరుగా 50% తగ్గింపును ప్రకటించింది.
* ఎల్‌జీ మొబైల్‌ కొనండి.. బంగారు నాణెం తీసుకెళ్లండి అంటూ యూనివర్‌సెల్‌ ఆఫర్‌ ఇస్తోంది.
* గృహావసరాల సంస్థ హోమ్‌టౌన్‌లో ఆదివారం రూ.15,000 ఆపై కొనుగోళ్లపై బంగారు నాణేలను ఉచితంగా ఇవ్వనుంది.

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నేడు ప్రత్యేక ట్రేడింగ్‌
ముంబయి: ఈసారి ఆదివారం అక్షయ తృతీయ రావడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక బంగారం ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌)ల ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నేడు ప్రత్యేక విండో తెరచి ఉంచనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ ఈ లావాదేవీలు జరుగుతాయి. బ్రోకర్లు, ఫండ్‌ మేనేజర్ల అభిప్రాయం ప్రకారం గత రెండు మూడేళ్లలో జీఈటీఎఫ్‌లకు గిరాకీ పెరుగుతోంది. ఒక జీఈటీఎఫ్‌ గ్రాము బంగారంతో సమానం అనేది తెలిసిందే.

దేశ వ్యాప్తంగా స్వర్ణం విక్రయాలు కిందటేడాదితో పోలిస్తే ఈసారి 15 శాతం పెరగవచ్చని అఖిల భారత రత్నాభరణాల వర్తక సమాఖ్య (జీజేఎఫ్‌) అభిప్రాయపడింది. గత 18 నెలల్లో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెంది తేలికపాటి నగల తయారీ కొత్త పుంతలు తొక్కుతోందని, దీనివల్ల తక్కువ ధరలకే ఆభరణాలు సొంతం చేసుకొనే సదవకాశం వినియోగదార్లకు అందుబాటులోకి వస్తోందని జీజేఎఫ్‌ ఛైర్మన్‌ వినోద్‌ హయగ్రీవ్‌ విశ్లేషణ.

వెండి విక్రయంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శ్రద్ధ
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున మొత్తం 150 కిలోల వెండి కడ్డీలను విక్రయించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 21 నగరాల్లో బ్యాంకుకు ఉన్న 80-85 శాఖల్లో ఈ విక్రయాలు జరుగుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 50 గ్రాముల కడ్డీల రూపంలో ఇవి లభ్యమవుతాయని వివరించింది.

వినియోగదారులూ.. ఇలా చేయండి
ప్రముఖ సంస్థలు 10 గ్రాముల పైడి కొనుగోలుపై రూ.1,200-1,500 వరకు తగ్గింపును ఇస్తున్నాయి. అయితే ఈ తగ్గింపు 24 క్యారెట్ల బంగారం ధర పైనా లేక 22 క్యారెట్ల పసిడి ధర పైనా అనేది వినియోగదారులు పరిశీలించాలి. నగలు 22 క్యారెట్ల బంగారంతో చేస్తారు. చెన్నై మార్కెట్‌ ధరపై తగ్గింపు ఇస్తే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ సంస్థ చందన బ్రదర్స్‌ అక్షయ తృతీయ సందర్భంగా రాళ్లు పొదిగిన నగల విక్రయాల్లో రాళ్ల ధరపై 30 శాతం రాయితీ ఇస్తోంది. వజ్రాలపై 10% , బ్రాండెడ్‌ వజ్రాలపై 15% తగ్గింపు ఇస్తున్నట్లు చందన బ్రదర్స్‌ ఎండీ రామారావు తెలిపారు. నగల తయారీ మజూరీని మినహాయించినట్లు చెప్పారు.