Friday, May 21, 2010

అదో పెద్ద వ్యాపారావకాశం

ఇన్వర్టర్లు, స్టెబిలైజర్ల తయారీ లాభసాటి
అందుకే ఈ మార్కెట్లోకి ప్రవేశించాం

'న్యూస్‌టుడే' తో వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు శంతను దాస్‌ గుప్తా
లక్ట్రానిక్‌ గృహోపకరణాల తయారీ కంపెనీ వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా 'పవర్‌ మేనేజ్‌మెంట్‌' ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇన్వర్టర్లు, ఇన్వర్టర్‌ బ్యాటరీలు, స్టెబిలైజర్లు... ఇంకా ఇదే విభాగంలో పలు నూతన ఉత్పత్తులను అందించనుంది. ఈ సంస్థ గత ఏడాది మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. పైగా నూతన ఉత్పత్తులు పెద్దఎత్తున అందిస్తున్నందున ఇకపై మెరుగైన వృద్ధిని సాధించగలమని కంపెనీ ఉపాధ్యక్షుడు (కార్పొరేట్‌ వ్యవహారాలు) శంతను దాస్‌ గుప్తా చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన 'న్యూస్‌టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు..
- న్యూస్‌టుడే, హైదరాబాద్‌
? గత ఆర్థిక సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి. మున్ముందు వృద్ధి రేటుపై మీ అంచనా...?
గత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.2219 కోట్ల టర్నోవర్‌ను మా సంస్థ నమోదు చేసింది (పన్ను తర్వాతి లాభం 105 శాతం పెరిగి రూ. 145 కోట్లు అయింది. ఈపీఎస్‌ రూ.10.03). కొత్తగా పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఏసీల మార్కెట్లో ఈ ఏడాది జనవరిలో 30కి పైగా ఉత్పత్తులను విడుదల చేసి క్రియాశీలకంగా మారాం. మాకు కొట్టిన పిండి అయిన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల విభాగంలో నూతన ప్రణాళికలు అమలు చేస్తున్నాం. అందువల్ల భవిష్యత్తుపై ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఈ ఏడాది టర్నోవర్‌లో కనీసం 25 శాతం వృద్ధి ఉంటుంది.

? పవర్‌ మేనేజ్‌మెంట్‌, కన్జర్వేషన్‌ విభాగంలో కంపెనీ వ్యూహం...
ఇది ఎక్కువ భాగం అవ్యవస్థీకృత రంగం. చిన్న లేదా స్థానిక కంపెనీల వాటా అధికం. పోటీ కూడా అధికమే. అయినప్పటికీ పెద్ద మార్కెట్‌, వేగవంతమైన వృద్ధి, లాభసాటి అవకాశాలు ఉండటంతో ఈ విభాగం ఆకర్షణీయంగా మారింది. దీంతో ముందుగా ఇన్వర్టర్లను విడుదల చేశాం. ఇన్వర్టర్‌ బ్యాటరీలు, స్టెబిలైజర్లు, ఇంకా ఇతర వస్తువులు మున్ముందు ప్రవేశపెడతాం.

? ఈ విభాగంలో మార్కెట్‌ పరిమాణం ఎంత... మీరెంత అమ్మకాలు, మార్కెట్‌ వాటాను సాధించాలని భావిస్తున్నారు?
ఈ విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 కోట్ల అమ్మకాలను నమోదు చేశాం. వచ్చే నాలుగేళ్లలో రూ. 400 కోట్ల మేరకు అమ్మకాలు సాధించగలం. ఇన్వర్టర్లకు మనదేశంలో రూ.2,000 కోట్ల వార్షిక మార్కెట్‌ ఉంది. అదే విధంగా ఇన్వర్టర్‌ బ్యాటరీల మార్కెట్‌ పరిణామం రూ.6,000 కోట్లు. స్టెబిలైజర్ల మార్కెట్‌ రూ.1200 కోట్లు. ఏసీలు అమ్మకాలు ఇటీవల కాలంలో అధికమైన విషయం గమనించే ఉంటారు. ఏసీలతో పాటు స్టెబిలైజర్ల విక్రయాలు పెరుగుతున్నాయి.

? వర్ల్‌పూల్‌ ప్రధాన బలం రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లే. అటువంటప్పుడు వేరే విభాగంపై దృష్టి సారించడం....
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల వాటా కంపెనీ అమ్మకాల్లో 80 శాతం ఉంటుంది. ఈ వస్తువుల విభాగంలో ఇంకా విస్తరించవచ్చు. ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్లు ఒక అవకాశం. అదేవిధంగా మూడు డోర్ల రిఫ్రిజిరేటర్లు కొద్దికాలం క్రితం మార్కెట్లో ప్రవేశపెడితే మంచి స్పందన వచ్చింది. మైక్రోవేవ్‌ ఒవెన్ల అమ్మకాలు పెంచుకుంటున్నాం. ఏ విభాగంలోనూ వెనక్కి తగ్గకుండా మాకు ప్రణాళికలు ఉన్నాయి.

? కొత్త ఉత్పత్తుల కోసం ఏమేరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది...
పెద్దగా ఉండదు. ఎందుకంటే వస్తువుల డిజైన్‌ మాత్రమే మేం చేసి, తయారీని అవుట్‌సోర్స్‌ చేస్తున్నాం. అందువల్ల తయారీపై పెట్టుబడి అవసరం ఉండదు. కాకపోతే మార్కెటింగ్‌, పంపిణీ, విక్రయ కార్యకలాపాలపై పెట్టుబడులు అవసరం అవుతాయి. అవి కొద్ది మొత్తాల్లోనే ఉంటాయి.

? మున్ముందు ఎటువంటి ఉత్పత్తులు వర్ల్‌పూల్‌ నుంచి ఆశించవచ్చు?
ప్రత్యామ్నాయ విద్యుత్తు విభాగంలో కొత్త ఉత్పత్తులు ఉంటాయి. ఎల్‌ఈడీ ల్యాంపులు, హీటర్లు, బ్యాటరీ ఛార్జర్లు వంటివి...