Saturday, May 29, 2010

వీరి ఎత్తుగడలు ఏమిటో..!

అన్నదమ్ముల సయోధ్యతో కొత్త సమీకరణాలు
ఆర్‌ఐఎల్‌ ముంగిట బోలెడు విస్తరణావకాశాలు
అడాగ్‌కు విలీనాలు చక్కటి వూతం?
న్నదమ్ములు ముకేశ్‌, అనిల్‌ అంబానీల ఆధ్వర్యంలోని పారిశ్రామిక గ్రూపులు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), రిలయన్స్‌- అనిల్‌ ధీరుభాయ్‌ అంబానీ గ్రూపు (ఆర్‌-అడాగ్‌).. ఒకటి నడుపుతున్న వ్యాపార కార్యకలాపాలకు మరొకటి పోటీపడకూడదన్న ఒప్పందాన్ని (నాన్‌-కంపీట్‌ అగ్రిమెంట్‌) రద్దు చేసుకోవడంతో ఇకపై ఇవి తమకు నచ్చిన వ్యాపారాలకు విస్తరించే వీలు చిక్కుతుంది. దేశంలోనే అత్యంత అధిక మార్కెట్‌ విలువ ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ పరిణామం దరిమిలా ఎలాంటి అవకాశాలను పరిశీలించవచ్చనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఆర్‌-అడాగ్‌ ఇకమీద ఎటువంటి ప్రణాళికను అనుసరిస్తుందనేది కూడా పరిశీలించదగ్గదే. మార్కెట్‌ వర్గాలు, విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ రెండు గ్రూపుల ఎదుట ఉన్న అవకాశాలలో కొన్ని ఇవి:

* ఆర్‌ఐఎల్‌ ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆర్థిక సేవల వ్యాపారంతో పాటు టెలికమ్యూనికేషన్‌ల వ్యాపారంపై కూడా దృష్టిని సారించవచ్చు. ఇప్పటికే ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అనే వ్యాపార విభాగానికి, ఆర్థిక సేవలకు విడదీయలేని ముడి పడిపోయి ఉంది. రిటైల్‌ ఖాతాదారు సంస్థలకు వినియోగదారు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీలతో ఆర్‌ఐఎల్‌ ఏర్పాట్లు చేసుకొంది. అదీ కాక ఆర్థిక సేవల రంగం జోరు మీద ఉన్నదని ముకేశ్‌ భావిస్తున్నారని వినవస్తోంది. నిజానికి రిలయన్స్‌ గ్రూపు విభజన కన్నా ముందే రిలయన్స్‌ కేపిటల్‌ లిమిటెడ్‌ను ప్రారంభించడం, విభజనలో భాగంగా ఆ సంస్థ అనిల్‌కు దక్కడం తెలిసిందే. బ్యాంకింగ్‌ రంగంలో కొత్త గా లైసెన్సుల జారీని ఆర్‌బీఐ పరిశీలిస్తుందని కేంద్రం ఈ సంవత్సర బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఈ నేపథ్యం ఆర్‌ఐఎల్‌ ఒకవేళ బ్యాంకింగ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకొంటే గనక అందుకు వాతావరణం అనువుగానే ఉందని సూచిస్తున్నట్లే!

* టెలికమ్యూనికేషన్‌ల రంగం జోష్‌ ఉన్న మరో వ్యాపారంగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన 3జీ రేడియో తరంగాల వేలంపాట నుంచి ప్రభుత్వం రూ.35,000 కోట్ల ఆదాయం రావచ్చని ఆశించగా రూ.67,700 కోట్ల పైచిలుకు ఆదాయం లభించడం ఇందుకు ఒక ఉదాహరణ. టెలికం రంగంలో పోటీ పెచ్చుపెరిగిపోతోంది. ఇదివరకు రిలయన్స్‌ ఇన్ఫోకామ్‌ అనే కంపెనీ రిలయన్స్‌ గ్రూపులో ఉన్నా, అది ప్రస్తుతం అడాగ్‌ కంపెనీగా నడుస్తోంది. అయితే ఆర్‌ఐఎల్‌కు ఈసరికే తాను తన సొంత అవసరాల కోసం నిర్మించుకొన్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థను కొద్ది మార్పు చేర్పులతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగదారులకు అందించడానికి ఉపయోగించుకొనే సౌలభ్యం ఉండటం ఈ గ్రూపునకు సానుకూలంగా మారగల మరొక అంశం. అదీ గాక, ఇప్పటికే ఈ రంగంలో కాలూనిన మరొక కంపెనీని దేనినైనా కొనుగోలు చేయడం ఆర్‌ఐఎల్‌కు శక్తికి మించిన పని ఏమీ కాదు కూడా. వేరే కంపెనీని కొనుగోలు చేయాలనే ఆలోచనే ఆర్‌ఐఎల్‌ చేసే పక్షంలో.. అడాగ్‌ కంపెనీ ఆర్‌కామ్‌ను పూర్తిగానో, లేక పాక్షిక వాటా (స్టేక్‌)నో కొనుగోలు చేసే యోచన కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు. అందుకు ఆర్‌కామ్‌ అధినేత (అనిల్‌) అంగీకరిస్తారా అంగీకరించరా అనేది వేరే విషయం. మునుపు దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌ కంపెనీని అనిల్‌ కొనుగోలు చేయాలనుకున్నపుడు నాన్‌-కంపీట్‌ అగ్రిమెంట్‌లో భాగమైన తొలి తిరస్కరణ హక్కును గురించి ముకేశ్‌ ప్రస్తావించడంతో ఆర్‌కామ్‌-ఎంటీఎన్‌ ఒప్పందం అప్పట్లో విఫలం అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ పారిశ్రామిక గ్రూపుల వ్యూహాలలో ప్రాధాన్యాలు మారనూవచ్చు, మారకనూపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. అలా జరగబోదని తోసిపుచ్చడానికి లేదని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. అయితే టెలికం రంగంలో సేవల రేట్ల (వాయిస్‌ టారిఫ్స్‌) స్పర్థ నానాటికీ పెరిగిపోతుండడం, లాభ శాతం క్షీణిస్తుండటం, భారీ పెట్టుబడులు.. ఇవి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. కాబట్టి బహుశా ఆర్‌ఐఎల్‌ తొందరపాటుతో కాకుండా అన్నీ ఆలోచించి ఆచి తూచి ఒక నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నారు.

* ఆర్‌ఐఎల్‌తో పోలిస్తే.. ఆర్‌-అడాగ్‌ శిబిరంలో పెద్ద సంచలనాలకు ఆస్కారం లేదని, ఏదైనా భారీ విలీనం లేదా కొనుగోలు తటస్థిస్తే తప్ప ఈ గ్రూపు కార్యకలాపాలు యథాపూర్వంగా కొనసాగుతాయని పరిశీలకులు చెప్తున్నారు. ఆర్‌ఐఎల్‌కు ఉన్నంత నగదు నిల్వలు ఆర్‌-అడాగ్‌కు లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణం కావచ్చని వారు గుర్తు చేస్తున్నారు.

కేజీ గ్యాస్‌తో దేశానికి రూ.4,000 కోట్లు ఆదా
వాటాదార్ల వార్షిక నివేదికలో ముకేశ్‌ వెల్లడి
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి(కేజీ) గ్యాస్‌ వల్ల ఎరువుల సబ్సిడీలో రూ.4,000 కోట్ల మేర దేశం ఆదా చేయగలిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. 'ప్రారంభమైన ఏడాది లోపే మేం 512 బిలియన్ల ఘనపు అడుగుల సహజవాయువును దేశానికి సరఫరా చేశామ'ని వాటాదార్లను ఉద్దేశిస్తూ 2009-10 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించిన రిలయన్స్‌ ప్రస్తుతం రోజుకు 63-64 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల ఉత్పత్తిని సాధిస్తోంది. ఇది మొత్తం దేశవ్యాప్త గ్యాస్‌ ఉత్పత్తిలో 40 శాతానికి సమానం. '365 రోజులూ ఎలాంటి అవరోధాలూ లేకుండా జరిగిన కార్యకలాపాల వల్ల ఉత్పత్తి స్థాయి ప్రస్తుతం 60 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ సహజవాయువు; రోజుకు 35,000 బారెళ్లకు పైగా ముడి చమురుకు చేరుకుంద'ని ముకేశ్‌ ఆ నివేదికలో పేర్కొన్నారు. పెరిగిన సహజవాయువు లభ్యత కారణంగా ఎరువులను అధిక పరిణామంలోనూ, చౌకగానూ ఉత్పత్తి చేయడానికి వీలైంది. దీంతో దేశం సబ్సిడీల రూపంలో రూ.4,000 కోట్ల దాకా ఆదా చేయగలిగిందని ఆయన వివరించారు.