Thursday, May 13, 2010

ఈబీసీ ఉపకార వేతనాలు హుళక్కి?

బడ్జెట్లో నిధుల కేటాయింపే లేదు
'సంతృప్త స్థాయి' ఆశ చూపి అసలుకే ఎసరు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈబీసీ) విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళ హారతి పాడుతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పథకానికి తాజా బడ్జెట్లో పైసా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ తక్కువ సంఖ్యలోనే ఈబీసీ ఉపకార వేతనాలు అందిస్తోంది. విశ్వవిద్యాలయ కళాశాలల హాస్టళ్లలో ఉండే ఈబీసీ విద్యార్థులందరికీ మెస్‌ ఛార్జీల రూపంలో ఉపకార వేతనాలు అందుతున్నాయి. ఇతర కళాశాలల్లో ఉండే లక్షలమంది ఈబీసీ విద్యార్థుల్లో కొద్దిమందికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇస్తున్నారు.

ఎన్నికల ముందు 2008 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ విద్యార్థులందరికీ సంతృప్త స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.30 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అగ్ర వర్ణాల పేదలు సంతోషించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం మరో భారీ వాగ్దానం చేసింది. ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలే కాకుండా కళాశాలల్లో బోధనా ఫీజులు కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఇది కూడా సంతృప్త స్థాయి వాగ్దానమే. ఆ మేరకు 2009-10 బడ్జెట్లో బోధనా ఫీజులకు రూ.350 కోట్లు, ఉపకార వేతనాలకు ఒక్క కోటి రూపాయలు కేటాయించింది. ఈ వాగ్దానం అధికార పక్షానికి ఓట్లవర్షం కురిపించింది.

బోధనా ఫీజుల వాగ్దాన భంగం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉపకార వేతనాల విషయానికి వద్దాం. సంతృప్తస్థాయి వరకు ఉపకార వేతనాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాన్ని నమ్మి గత ఏడాది 2.8 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కేటాయించింది ఒక్కకోటి. నిర్వహణ బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ నెత్తినపెట్టారు. దాదాపు 104 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు. నిధులు ఇవ్వండి మొర్రో అని మొత్తుకున్నా చివర వరకు స్పందించని ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు ఆ కోటి మాత్రమే మంజూరు చేసింది. అందులో నిజానికి విడుదల చేసింది కేవలం రూ.22 లక్షలు మాత్రమే. ఆ మొత్తం కేవలం 450 మందికి సరిపోతుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకూ గత ఏడాది ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజా బడ్జెట్‌ నుంచి ఈ పాత బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే పద్ధతిలో తమకూ ఆలస్యంగానైనా ఉపకార వేతనం వస్తుందని ఈబీసీ విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజా బడ్జెట్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాలకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం బోధనా ఫీజులకేననీ, ఉపకార వేతనాలకు పైసా కూడా కేటాయించలేదని తాజాగా బీసీ సంక్షేమ అధికారులకు బడ్జెట్‌ పుస్తకం లోతుల్లోకి వెళ్లాక తెలిసింది. అసలు ఈబీసీ ఉపకార వేతనాల పద్దునే ఎత్తేశారని గ్రహించి పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించారు.

గత ఏడాది ఈబీసీ దరఖాస్తులకు సంబంధించి అర్హులందరికీ ఉపకార వేతనాలు ఇవ్వాలంటే మరో రూ.103.54 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది అవసరాలు రూ.124.51 కోట్లు కలిపితే మొత్తం రూ.228.05 కోట్లు అవసరమని తేల్చారు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని నిధులు కేటాయిస్తే తప్ప ఈబీసీ ఉపకార వేతనం అందే అవకాశం లేదు. ఉపకార వేతనాలపై అధికారుల స్థాయిలో 14న, ముఖ్యమంత్రి స్థాయిలో 17న సమావేశం జరగనుంది. ఆ సమావేశాల్లో తీసుకోబోయే నిర్ణయాలు విద్యార్థిలోకం భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.