Wednesday, May 12, 2010

తగ్గనున్న అక్షయ తృతీయ కొనుగోళ్లు


అనిశ్చిత పరిస్థితులే కారణం
తగ్గనున్న అక్షయ తృతీయ కొనుగోళ్లు
ముంబయి: ఆర్థిక అనిశ్చిత పరిస్థుతలు కొనసాగుతాయన్న భయాల నేపథ్యంలో బంగారం ధర మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డాలరు బలపడుతున్నా కూడా పైడి ధరలు పైకెగసే అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఎందుకటే ఆర్థిక అనిశ్చితుల సమయంలో సాధారణంగా ఎవరైనా సురక్షిత పెట్టుబడుల కోసం బంగారం వైపే దృష్టి మళ్లిస్తారనిఏంజెల్‌ కమోడిటీస్‌ విశ్లేషకులు రీనా వాలియా పీటీఐకిక్కడ తెలిపారు. పదిగ్రాముల బంగారం ధర జనవరిలో రూ.15,950గా ఉండగా.. ప్రస్తుతం రూ.17,800-17,950 మధ్య కదలాడుతోంది. అంటే 12.82 శాతం మేర పెరిగిందన్నమాట.

సహాయ ప్యాకేజీ ప్రకటించినా ..
ఐరోపా దేశాలు 1 లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటన చేసిన నేపత్యంలో బంగారం కాస్త విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. అంతకు ముందు వారం మొత్తం పెరుగుతూ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సహాయ ప్యాకేజీ నేపథ్యంలోనూ పసిడి ధర పెరిగే ధోరణి కొనసాగుతుందని వాలియా అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికాలో ఏర్పడిన మాంద్యంతో పోలిస్తే యూరో ప్రాంతంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఆమె అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో కేవలం కంపెనీలు, బ్యాంకులు మాత్రమే కుదేలవగా.. ఇక్కడ అందుకు భిన్నంగా ఏకంగా దేశాలే అప్పులు ఊబిలో కూరుకుపోయాయని ఆమె వివరిస్తున్నారు. కాబట్టి రికవరీకి చాలా సమయం పడుతుందని అదే సమయంలో డాలరు కూడా బలపడగలదని వాలియా అంచనా వేస్తున్నారు. డాలరు బలపడినా కూడా కనకానికి డిమాండు తగ్గదని.. యూరోజోన్‌ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అది మరింత పెరుగుతూ ఉంటుందన్నది ఆమె అంచనా.

అక్షయ తృతీయపైనా ప్రభావం
పెరిగిన పైడి ధరలతో అక్షయ తృతీయ(ఆదివారం) కళ తప్పే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గ్రీసు ప్యాకేజీ ప్రభావంతో సోమవారం బంగారం ధర తగ్గినా మళ్లీ మంగళవారం పెరిగి రూ.17,970కి చేరింది. గతేడాది అక్షయ తృతీయ రోజున పది గ్రాముల బంగారం రూ.14,800గా మాత్రమే ఉండడం గమనార్హం. ఒక వేళ గతేడాదిలాగే ఆభరణాలను కొనుగోలు చేయడానికి వినియోగదార్లు ఆసక్తి చూపినా కూడా బంగారం ధరలు పెరగడానికే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అయితే గతేడాది డిసెంబరులో పలికిన రూ.18,300 రికార్డు స్థాయి ధర కంటే ఇపుడు తక్కువగానే ఉండడం గమనార్హం. అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదార్లు బంగారంపై విశ్వాసం పెంచుకుంటారని.. కాబట్టి ధరలు మరింత ఎగుస్తాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ కూడా అంటోంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి అక్షయతృతీయ రోజున విలువ పరంగా కొనుగోళ్లు పెరగొచ్చని... పరిమాణం మాత్రం తక్కువగా ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

రూ.475 పెరిగింది
మంగళవారం స్థానిక మార్కెట్లో బంగారం మళ్లీ పైకెగసింది. అంతక్రితం రోజున లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ నేపథ్యంలో భారీ విక్రయ ఒత్తిళ్లతో పతనమైన ధర తిరిగి పుంజుకుంది. కొనుగోలుదార్లు సాధారణ ధోరణికి వచ్చేశారని.. వెండి ధర కూడా పెరిగిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నారు. ఆభరణాల బంగారం(99.5 స్వచ్ఛత) రూ.475 పెరిగి రూ.17,970గా పలికింది. అంతక్రితం రోజున రూ.17,495గా ఉంది. స్వచ్ఛమైన బంగారం(99.9) సైతం రూ.480 ఎగసి రూ.18,060కు చేరింది. కిలో వెండి రూ.235 దూసుకెళ్లి రూ.29,275 వద్ద ముగిసింది.