వడగాల్పులతో భయం భయం

ఆరు వారాల వయసులోనే కోతకు వచ్చే బ్రాయిలర్ కోళ్లు చాలా సున్నితమైనవి. ఉష్ణోగ్రత ఏమాత్రం పెరిగినా ఇవి కళ్లు తేలేస్తాయి. ఒక కిలో బరువు తూగేలా కోడి పెరగాలంటే 1.8 నుంచి 1.9 కిలోల వరకు మేతను తీసుకోవాల్సి ఉంటుంది. మేత తీసుకుని, దానిని అరిగించుకునే క్రమంలో కోడి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో బయట ఉండే వేడిమికి కోడి వేడి జత చేరితే మరణాలు మరింత పెరుగుతాయి. దీంతో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఫారాల్లో కేవలం ద్రవాహారాన్నే కోడికి ఇస్తారు. తీసుకున్న కొద్దిపాటి ఘనాహారం కాస్తా శరీర నిర్వహణకే తప్పిస్తే బరువు పెరుగుదలకు ఉపయోగపడదు. ఆరు వారాల్లో రెండు కిలోల బరువు రావాల్సిన కోడి 1.6 కిలోల నుంచి 1.7 కిలోలకు మించడం కష్టమవుతోంది. దీంతో మార్కెట్లో లభ్యత తగ్గి ధర క్రమంగా పెరుగుతోంది. నాలుగు రోజులుగా కాస్త తగ్గినట్లు కనిపించినా ఇది మళ్లీ పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్రంలో దాదాపు 6 కోట్ల వరకు బ్రాయిలర్ కోళ్లు ఉన్నాయని అంచనా. ప్రతి ఆరు వారాలకు వీటిని మాంసంగా వినియోగిస్తుంటారు. నెలకు సగటున కోటి కోళ్లను ఆహారంగా తీసుకుంటున్నట్లు లెక్క. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ధర నెల్లూరులో పలుకుతోంది. అక్కడ లైవ్ ధర కిలో రూ.78కి చేరింది. చిత్తూరులో రూ.72, ఒంగోలులో 71, హైదరాబాద్/కరీంనగర్/కర్నూలు నగరాల్లో రూ.67, విజయవాడలో రూ.65 చొప్పున ఉంది. సాధారణంగా మే, జూన్ లలో ఈ పరిస్థితి తలెత్తి ధర పెరుగుతుందనీ, అయితే ఈసారి మాత్రం దీనివల్ల రైతుకు ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదని బ్రోమార్క్ విశాఖ అధ్యక్షుడు శేషగిరిరావు 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఒక్కో కోడిపిల్లను మామూలుగానైతే రూ.13-16 మధ్య కొనేవారమనీ, ఇపుడున్న బ్యాచ్‌లను మాత్రం రూ.32 వంతున కొనాల్సి రావడం దీనికి కారణమని విశ్లేషించారు. ఎగుమతులు లేకపోవడం వల్ల సోయా టన్ను రూ.19,000కు లభ్యమవుతోందనీ, మొక్కజొన్న క్వింటాల్ రూ.900 లోపు ఉండడం కొంత ఊరట కలిగిస్తోందని చెప్పారు.
మరోపక్క గుడ్డు ధర ఎగబాకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే గుడ్డుపై 25 పైసలు చొప్పున పెరిగింది. ఎండల కారణంగా ఉత్పత్తి రమారమి 5 శాతం వరకు పడిపోవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. విశాఖలో టోకుగా గుడ్డు ధర రూ.2.45 పైసలకు చేరింది. మిగిలిన చోట ఇంకా ఎక్కువ ఉంది. మొక్కజొన్న స్థానికంగా కూడా లభ్యమవుతుండడం వల్ల దాణా ధరలు కాస్త నియంత్రణలో ఉన్నాయనీ, పాత నష్టాలను పూడ్చుకునేందుకు ప్రస్తుతం కొంత ఆశాజనక పరిస్థితి కనిపిస్తోందని జాతీయ గుడ్ల సమన్వయ సంఘం (నెక్) జాతీయ కార్యవర్గ సభ్యుడు భరణికాన రామారావు చెప్పారు.