Tuesday, May 11, 2010

గ్రీస్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ

లండన్ : గ్రీస్‌ను దివాలా దశ నుంచి కాపాడడానికి యూరో జోన్ నాయకులు లక్ష కోట్ల డాలర్ల (45 లక్షల కోట్ల రూపాయలు) ప్యాకేజీ అందించడానికి అంగీకరించారు. గ్రీస్ ఎదుర్కొంటున్న రుణ సంక్షో భం యూరో జోన్‌లోని ఇతర దేశాలకు కూడా విస్తరించడాన్ని నివారించేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం 11 గంటల పాటు నిర్విరామంగా చర్చలు జరిపిన 16 యూరో జోన్ దేశాల ఆర్థిక మంత్రులు, ఐఎంఎఫ్ అధికారులు మూడు సంవత్సరాల కాలపరిమితి గల ఈ ప్యాకేజిని సోమవారం ఉదయం ప్రకటించారు.

ఈ ప్రణాళిక ప్రకారం గ్రీస్‌కు యూరోపియన్ కమిషన్ 7,500 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందచేస్తుంది. యూరోపియన్ యూనియన్‌లోని 16 దేశాలు ద్వైపాక్షిక సర్దుబాట్ల కింద మరో 57 వేల కోట్ల డాలర్లు అందచేస్తాయి. 32,500 కోట్ల డాలర్లు ఐఎంఎఫ్ రుణంగా అందచేస్తుంది.

దీని వల్ల గ్రీక్ ఆర్థిక వ్యవస్థలో పోటీ సామర్థ్యం పెరిగి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు మరింత దృఢంగా మారుతుందని భావిస్తున్నట్టు యూరో జోన్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. యూరో జోన్‌లో స్థిరత్వం తీసుకువచ్చేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) చేపట్టే చర్యలకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని వారు స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీ ఊహించిన దాని కన్నా మెరుగ్గా ఉండడంతో ఆసియా మార్కెట్లు సోమవారం ఉరకలు వేశాయని విశ్లేషకులంటున్నారు.