Thursday, May 13, 2010

పారిశ్రామికం.. సిక్సర్‌

వరుసగా ఆరో నెలా దూసుకెళ్లింది
మార్చిలో వృద్ధి రేటు 13.5%
మొత్తం ఆర్థిక సంవత్సరంలో 10.4%
జీడీపీ వృద్ధి 7.2% పైగా నమోదవ్వొచ్చు: ఆర్థిక వేత్తలు
న్యూఢిల్లీ: పారిశ్రామికం రాణించింది. వరుసగా ఆరో నెలా వృద్ధి బాటలోనే పయనించింది. రెండంకెల పెరుగుదలను కొనసాగించింది. మార్చిలో 13.5 శాతం మేర దూసుకెళ్లింది.అయితే ఇవి అంచనాల కంటే తక్కువ కావడం గమనార్హం.

మొత్తం మీద 2009-10 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికాభివృద్ధి 10.4 శాతంగా నమోదైంది. ప్రభుత్వం బుధవారమిక్కడ పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి గణాంకాలు అంతక్రితం ఫిబ్రవరి(15.1 శాతం); జనవరి(16 శాతం)లో నమోదైన వృద్ధి కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అంతే కాదు క్రిసిల్‌ ప్రధాన ఆర్థిక వేత్త డి.కె. జోషి అంతక్రితం మార్చిలో 15% వృద్ధి నమోదవుతుందని అంచనా వేయగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 15.5 శాతాన్ని అంచనా వేసింది. వీటికంటే తక్కువగా 10.4 శాతంగా నమోదైంది. వచ్చే కొద్ది నెలల్లో ఉద్దీపనల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ఐఐపీ తగ్గొచ్చని ఆర్థిక వేత్తలు అంటున్నారు. అయితే వరుసగా ఆరు నెలలూ రెండంకెల వృద్ధి కొనసాగడం వల్ల 2009-10లో ఆర్థిక వృద్ధి 7.2 శాతం కంటే ఎక్కువగా నమోదవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

మార్చిలో ఏ రంగం ఎంత పెరిగిందంటే..
* ఆధార సంవత్సరం తక్కువగా ఉండడం వల్ల.. తయారీ రంగం 14.3 శాతం మేర పెరగడం వల్ల మార్చిలో రెండంకెల వృద్ధి సాధ్యమైంది.

* తవ్వక రంగం 11%; విద్యుత్‌ 7.7% మేర ఎగశాయి.

* మాంద్యం సమయంలో బాగా దెబ్బతిన్న మన్నికైన వినియోగదారు వస్తువులు మార్చిలో 32 శాతం దూసుకెళ్లగా.. యంత్ర పరికరాల ఉత్పత్తి 27.4 శాతం పుంజుకుంది.

* 17 పారిశ్రామిక విభాగాల్లో 14 సానుకూల వృద్ధిని సాధించాయి.

పూర్తి సంవత్సరానికి..
* తయారీ రంగం 10.9 శాతం వృద్ధి సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 2.8%గా మాత్రమే ఉంది.

* ఇక తవ్వక రంగం 2.6 శాతం నుంచి 9.7 శాతానికి; విద్యుదుత్పత్తి 2.8 శాతం నుంచి 6 శాతానికి పెరిగాయి.
.

రెండంకెల వృద్ధికి ఢోకా లేదు: మాంటెక్‌
మార్చిలో ఐఐపీ గణాంకాలు తగ్గినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల పారిశ్రామిక వృద్ధికి ఢోకా ఉండదని ప్రణాళిక సంఘం, ప్రభుత్వం భావిస్తున్నాయి. '2010-11లోనూ మేం అదే(రెండంకెల వృద్ధి) ఆశిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరాన్నీ రెండంకెల వృద్ధితోనే ముగించా'మని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ ఆహ్లూవాలియా అంటున్నారు. మార్చి గణాంకాల క్షీణతపై వాణిజ్య, పరిశ్రమ మంత్రి ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ 'పారిశ్రామిక ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంది. క్షీణించిన రంగాలపై దృష్టి సారించి అలా ఎందుకు జరిగిందో.. జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాల్సిఉంద'ని అన్నారు.