Monday, May 31, 2010

ఏటీఎం నుంచి ఇక రోజుకు లక్ష!

న్యూఢిల్లీ: ఖాతాదారుల సౌలభ్యం కోసం ఏటీఎంల ద్రవ్య పరిమితులను మరింతగా పెంచనున్నారు. ఇక నుంచి ఏటీఎంల నుంచి రోజుకు లక్ష రూపాయలు తీసుకునే వీలు ఉంటుంది. దీంతో పాటు రూ. 1.25 లక్షల వరకూ డెబిట్‌కార్డు ద్వారా ఖరీదు చేసుకోవచ్చు. రోజుకు రూ.3 లక్షలను ఒక్క ఫోన్‌ కాల్‌ సహాయంతో వేరే ఖాతాకు బదిలీ కూడా చేయవచ్చు. చాలా బ్యాంకుల ఏటీఎంల నుంచి ప్రస్తుతం రూ.50 వేలకు మించి తీసుకోవడానికి వీలు లేదు. పెద్ద మొత్తాల్లో ద్రవ్య వినిమయం కోసం ఖాతాదారులు... ముఖ్యంగా బ్యాంకు పనివేళ్లల్లో అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. ఈ శ్రమను తగ్గించేందుకు వీలుగా ఏటీఎంల ద్రవ్య వినిమయ పరిమితిని పెంచాలని బ్యాంకులు భావిస్తున్నాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ కొత్త పరిమితులను అమల్లోకి తెస్తున్నది. మిగిలిన బ్యాంకులు కూడా హెచ్‌డీఎఫ్‌సీ బాటలో పయనిస్తాయని భావిస్తున్నారు. ఈజీషాప్‌ రెగ్యులర్‌, ఇంటర్నేషనల్‌/మ్యాస్ట్రో/ఎన్‌ఆర్‌ఓ డెబిట్‌ కార్డులకు ఇప్పటి వరకూ ఉన్న రూ.15 వేలు, రూ.25 వేల పరిమితిని రూ.25 వేలు, రూ.40 వేలుగా మార్చారు. బ్యాంకుల మధ్య ఉన్న పోటీ కారణంగా... అన్ని బ్యాంకులూ ఏటీఎం పరిమితులను పెంచుతాయని ఓ బ్యాంకర్‌ తెలిపారు. కిడ్స్‌ అడ్వాంటేజ్‌ డెబిట్‌ కార్డ్‌దారులు రోజుకు ఏటీఎం నుంచి 2,500 తీసుకోవచ్చు. లేదా కార్డు ద్వారా ఖరీదు చేయవచ్చు. ఇంతకు ముందు ఈ పరిమితి రూ.1500, రూ.1000గా ఉండేది. మహిళల డెబిట్‌కార్డు పరిమితిని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.