Tuesday, May 11, 2010

గెలిచిందెవరు..?: అన్నా.. తమ్ముడా..?

కేజీ బేసిన్ గ్యాస్‌లో వాటాల కోసం నాలుగేళ్లుగా సాగుతున్న రిలయన్స్ వారసత్వ పోరు సుప్రీం తీర్పుతో చల్లబడింది. జాతి సంపదపై సర్వాధికారం ప్రభుత్వానిదేనని, ప్రైవేటు ఒప్పందాలు ఏమాత్రం చెల్లబోవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పు రిలయన్స్ సోదరద్వయంలో ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం...? అన్న ముఖేష్ అంబానీనే విజయం వరించిందని మెజార్టీ వర్గాలు ఘోషిస్తున్నాయి.

అదే సమయంలో అనిల్ అంబానీ గ్రూప్ కూడా అంతే ధీమాగా ఉంది. ఆయన ధీమాకు కొందరు అనలిస్టుల అండకూడా దొరికింది. ఆర్ఐఎల్ నుంచి గ్యాస్ అందనిపక్షంలో ఆర్ఎన్ఆర్ఎల్ విలువ చిత్తు కాగితంతో సమానమని కొందరు లెక్కలుగడితే.. ఆర్ఎన్ఆర్ఎల్‌కు అసలు విలువ ఇప్పుడే వచ్చిందని మరికొందరు ఎనలిస్టుల అభిప్రాయం. అనిల్ అంబానీ సోమవారం నాడు షేర్‌హోల్డర్లకు ప్రత్యేకంగా లేఖలు పంపారు.

తీర్పు అనుకూలంగా ఉండటంతో సంబరాలు చేసుకోవచ్చని బాహాటంగా చెబుతున్నారు. రిలయన్స్ పవర్ సిఇఒ జెపి చలసాని సైతం ఓ పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతిమ విజయం తమదేనని తేల్చిచెప్పారు. అయితే.. ఇవన్నీ వాటాదారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికేనని, అనిల్ అంబానీ ఆందోళన చెందుతున్నారనడానికి అడాగ్ కంపెనీలు బోర్డు సమావేశాలు వాయిదా వేయడమే నిదర్శనమని మరికొందరు అంటున్నారు.

సోమవారం నాడు ఆర్ఎన్ఆర్ఎల్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బోర్డు సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా.. అసలు సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలం? కేజి బేసిన్‌పై ప్రత్యక్ష హక్కులు కలిగిన ఆర్ఐఎల్‌కా.. లేదా ఆస్తిపంపకాల్లో భాగంగా కుటుంబ ఒప్పందం కుదుర్చుకున్న ఆర్ఎన్ఆర్ఎల్‌కా.. ? రెండు వర్గాల వాదనలను పరిశీలిద్దాం.

ఆర్ఐఎల్ ఆనాడే చెప్పింది..
తమ వాదనలే సుప్రీం తీర్పులో నెగ్గాయనీ ఆర్ఐఎల్ సిఇఒ పిఎంఎస్ ప్రసాద్ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వ్యాఖ్యానించారు. అతి తక్కువ ధరకు దీర్ఘకాలం పాటు గ్యాస్ సరఫరా చేయాలని ఆర్ఎన్ఆర్ఎల్ వాదించింది. ఇది సాధ్యం కాదని, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు వెల్లడించింది...

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు.. అదికూడా ప్రభుత్వం కేటాయిస్తేనే గ్యాస్‌ను సరఫరా చేయాల్సివుంటుందనేది తీర్పు సారాంశమని ప్రసాద్ విశదీకరించారు. ఈ లెక్కన ఆర్ఐఎల్ గెలిచినట్లే కదా అనేది ఆయన వాదన. ప్రసాద్ వాదన నిజమైతే రిలయన్స్ గ్యాస్‌పైనే ఆధారపడిన ఆర్ఎన్ఆర్ఎల్ షెల్ కంపెనీగా మిగిలిపోకతప్పని స్థితి.

అంతిమ విజయం అడాగ్‌దే..
నిజానికి ఈ తీర్పుతోనే ఆర్ఎన్ఆర్ఎల్ స్థానం మరింత బలపడిందని రిలయన్స్ పవర్ సిఇఒ జెపి చలసాని అంటున్నారు. ఆర్ఎన్ఆర్ఎల్‌తో మరోసారి చర్చలు జరిపి, ఆమోదయోగ్యమైన ఒప్పందంతో తమ ముందుకు రమ్మని సుప్రీంకోర్టు ఆర్ఐఎల్‌కు విస్పష్టంగా చెప్పిందని ఆయన అంటున్నారు.

గ్యాస్ సప్లయ్ విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదనీ, కాకుంటే ఈ తతంగమంతా జాతి ప్రయోజనాలు, ప్రభుత్వ చట్టాలకు లోబడి జరగాలని మాత్రమే కోర్టు పేర్కొందని చలసాని వాదన. అంబానీ సోదరుల మధ్య కుదిరిన ప్రైవేటు ఒప్పందానికి ఇప్పటివరకూ చట్టబద్ధత లేదని, సుప్రీం తొలిసారిగా ఈ ఒప్పందానికి విలువ ఇచ్చింద నే విషయాన్ని ఈ సందర్భంగా మరచిపోరాదని ఆయన అంటున్నారు.

రిలయన్స్ పవర్ దాద్రి ప్రాజెక్టుకు కేజీ గ్యాస్ అందకపోయినా, ఈ ప్రాజెక్టు గ్యాస్ బెల్ట్‌లో ఉన్నకారణంగా గ్యాస్ లభించే ప్రత్యామ్నాయ మార్గాలు అనేకమని చలసాని స్పష్టం చేశారు. కుటుంబ ఒప్పందానికి చట్టబద్ధత వచ్చిన పక్షంలో గ్యాస్ రూపంలో గాకపోయినా.. ఏదో ఒక రూపంలో ఆర్ఎన్ఆర్ఎల్ వాటాదారులకు లాభాలు రావడం ఖాయమని ఆయన తెలిపారు.

పాత ప్రశ్నల పరిష్కారం.
కేజీ గ్యాస్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలను సుప్రీం తీర్పు పరిష్కరించింది. దేశ సంపదపై ప్రైవేటు ఒప్పందాలు చెల్లవంటూ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. తద్వారా కార్పొరేట్ రంగానికి ఉన్న హక్కులను, హద్దులను స్పష్టం చేసింది.

ఇవన్నీ ఇంధన భద్రతను పరిపుష్టం చేసే అంశాలేననడంలో సందేహం లేదు. అత్యున్నత న్యాయస్థానం అక్కడితో ఆగిపోలేదు. రిలయన్స్ వారసుల మధ్య కుదిరిన కుటుంబ ఒప్పందాన్ని ప్రస్తావించింది. కొత్తగా మరో రూపంలో అంగీకారంతో ముందుకు రమ్మని ఇరు వర్గాలను ఆదేశించింది.

ఈ తీర్పు ముఖేష్ అంబానీకి అనుకూలంగా ఉన్నట్లు కనపడుతున్నా నిజానికి అనిల్ అంబానీకే లాభాలుంటాయని, అయితే గ్యాస్ రూపంలో గాకుండా మరో రూపంలో ప్రయోజనాలు అందవచ్చని మెజారిటీ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అనలిస్టులు మాత్రం అనిల్ శిబిరంలో కనిపిస్తున్న ఉత్సాహం వ్యూహాత్మకమేననీ, ఇన్వెస్టర్లు, వాటాదారుల్లో విశ్వాసం సడలకుండా చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానిస్తున్నారు.