Saturday, May 8, 2010

మూగబోతున్న మగ్గాలు

నాలుగు నెలలుగా వేతనాల్లేవు
దయనీయ స్థితిలో నేతన్నలు
చేతులెత్తేసిన ఆప్కో
సీఎస్‌ ఆదేశాలు బేఖాతరు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రేయింబవళ్లు శ్రమించి విద్యార్థుల కోసం దుస్తులు, దుప్పట్లు తయారు చేసే చేనేత కార్మికులకు మళ్లీ కష్టకాలం వచ్చింది. వారి కష్టానికి ప్రతిఫలం చెల్లించాల్సిన రాష్ట్ర చేనేత సహకార సంస్థ(ఆప్కో) 4 నెలలుగా వేతనాలివ్వడం లేదు. సంక్షేమ శాఖల నుంచి తమకు బకాయిలందనందున తామేమీ చేయలేమంటూ ఆ సంస్థ చేతులెత్తేయడంతో కార్మికులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని సీఎస్‌ ఆదేశించినా అవి అమలుకాలేదు.

సంక్షేమ గురుకులాలు, పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు దుస్తులు, దుప్పట్ల తయారీ బాధ్యతలను సంబంధిత శాఖలు ఆప్కోకు అప్పగిస్తున్నాయి. ఆ సంస్థ చేనేత సంఘాల పరిధిలోని కార్మికుల ద్వారా దుస్తులను తయారు చేయిస్తున్నాయి. ఆప్కో నుంచి నూలు అందిన వెంటనే కార్మికులు అహర్నిశలు శ్రమించి వాటిని సిద్ధం చేస్తున్నారు. కార్మికులకు నెలనెలా వేతనాలను ఆప్కో సంఘాల ద్వారా చెల్లించాలి. కొన్నేళ్లుగా ఇది జరగడం లేదు. రెండు నుంచి మూడు నెలల వరకు బకాయిలుంటున్నాయి. ఈసారి గత జనవరి నుంచి వేతనాల చెల్లింపుల్లేవు. రెక్కాడితే డొక్కాడని కార్మికులు నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం సంఘం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంఘాల అధ్యక్షులు ఆప్కో ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరిగి వట్టిచేతులతో వెనుదిరుగుతున్నారు.

బకాయిల భారమే కారణం..
ఆర్థిక సంక్షోభం వల్లనే కార్మికుల వేతనాలను చెల్లించలేకపోతున్నామని ఆప్కో అధికారులు చెబుతున్నారు. సంక్షేమ శాఖలు దుస్తుల తయారీకి అవసరమైన నిధుల్లో 50 శాతాన్ని ముందస్తుగా, మిగిలిన 50 శాతాన్ని సరుకంతా అందిన తర్వాత చెల్లించాలి. ఏ ఒక్క ప్రభుత్వ శాఖ దీన్ని పాటించడం లేదు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకుల సంస్థలు రూ.75 కోట్ల మేరకు బకాయిలను ఆప్కోకి చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న ఆప్కో వస్త్రాల తయారీకి అవసరమైన నూలు కొనుగోలు, ఇతర వనరులపై ముందుగానే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. 11 శాతం వడ్డీకి అప్పు తెచ్చి నూలు, డిజైన్లు కొనుగోలు చేసి చేనేత సంఘాల ద్వారా కార్మికులకు సరఫరా చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి నిధులు వస్తేగానీ అప్పులు తీర్చి, కార్మికులకు వేతనాల విడుదల చేసి, మళ్లీ పని కల్పించే వీలు లేదని అధికారులు చెబుతున్నారు.

చేనేత కార్మికుల కష్టాలను, తమ ఇబ్బందులను ఇటీవల ఆప్కో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన గత నెలలో సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంటనే ఆప్కోకి రూ.20 కోట్లను విడుదల చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క శాఖ దాన్ని అమలు చేయకపోవడం గమనార్హం.