Tuesday, May 11, 2010

బ్యాంకు రుణాల మోళి... నిగ్గుతేల్చనున్న సిబిఐ

ఎగవేత కంపెనీలపై దర్యాప్తు
బ్యాంకుల గుండెల్లో గుడులు

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేస్తున్న కార్పొరేట్ కంపెనీల పని పట్టేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నడుం బిగించింది. రుణాల 'వన్ టైమ్ సెటిల్మెంట్'ల వ్యవహరంలో పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని పసిగట్టిన సిబిఐ ఉన్నతాధికారులు, ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇందులో భాగంగా బ్యాంకు అధికారులతో లాలూచీ పడి రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్న పారిశ్రామిక, వాణిజ్య సంస్థలపై సిబిఐ విచారణను ప్రారంభించింది. కాగా ఇటువంటి చర్యల కారణంగా బ్యాంకులు మొండి బకాయిల సెటిల్ మెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బ్యాంకింగ్ రంగంలోని కొందరు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రుణాల రద్దు వ్యవహారంలో కొందరు బ్యాంకు అధికారులు కంపెనీలతో కుమ్మక్కయినట్లు తమ దృష్టికి వచ్చిందని సిబిఐ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి.

బ్యాంకర్లతో భేటీ
రుణాల రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కోరిన సిబిఐ, వచ్చే వారం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్‌లు, మేనేజింగ్ డైరెక్టర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబిఎ), దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా 10 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన అధిపతులు పాల్గొననున్నారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన రుణాలలో వసూలు కాని బకాయిలు, నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ)గా మారినవి ఎన్ని, వాటి వివరాలు తమకు అందించాల్సిందిగా సిబిఐ బ్యాంకులను కోరింది.

మొండి బకాయిలు 27 వేల కోట్లు
గత సంవత్సరం డిసెంబర్ మాసాంతంనాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఇచ్చిన రుణాల్లో ఎన్‌పిఎలు 2.36 శాతంగా ఉన్నాయి. గత మార్చినాటికి పిఎస్‌యు బ్యాం కుల ఎన్‌పిఎలో 2.09 శాతం. ప్రభుత్వరంగ బ్యాంకులు గత డిసెంబర్‌నాటికి పారిశ్రామిక సంస్థలకు ఇచ్చిన రుణ మొత్తం 11,34,667 కోట్ల రూపాయలు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు 26,778 కోట్ల రూపాయలు.

కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలను పూర్తిస్థాయిలో రాబట్టకుండానే లోపాయికారి వ్యవహారాలు నడిపి వాటిని తక్కువ మొత్తాలకు రద్దు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖంలో ఉందన్న కారణాన్ని చూపించి కొన్ని కంపెనీలు తాము తీసుకున్న రుణాలను చాలా తక్కువ మొత్తాల చెల్లింపు జరిపి సెటిల్‌మెంట్లు చేసుకున్న దృష్టాంతాలు ఉన్నాయని ఈ మొత్తం వ్యవహారంపై కూపీ లాగుతున్న సిబిఐ అధికారులు పేర్కొంటున్నారు.

బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల డైరెక్టర్లు, పార్టనర్ల జాబితాలను ఎప్పటికప్పుడు తమకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించింది. రుణాల జారీ విషయంలో నియంత్రణ జాబితాలో ఉన్న వ్యక్తులకు, సంస్థలకు రుణా లు ఇచ్చారా, ఇస్తే ఆ వివరాలను తమకు అందించాలని కూడా ఆర్‌బిఐ ప్రభుత్వరంగ బ్యాంకులను కోరింది. ఈ విధమైన సమాచారాన్ని అన్ని శాఖల నుంచి సమీకరించి వీలైనంత తర్వలో తమకు సమర్పించాలని ఆర్‌బిఐ ఆదేశించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అసలుకే మోసం రావచ్చు...
రుణాల వసూలు, ఈ క్రమంలో కొన్ని రాయితీలు కల్పించే విషయంలో బ్యాంకులపై అనవసర దుష్ప్రచారం జరగుతోందని కొందరు బ్యాంకర్లు వాపోతున్నారు. కొన్ని సంద ర్భాల్లో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా రుణాలను వసూలు చేసుకోవటం అవసరంమవుతుంది, రుణాలు రాబట్టడం కోసం కోర్టుల్లో వ్యాజ్యాలు వేస్తే ఏళ్లు గడిచిపోయి, ఖర్చు తడిసిమోపడయ్యే ప్రమాదం ఉందని, దీంతో రుణ వసూలు లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన కొందరు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.