ఏటీఎంల సృష్టికర్త కన్నుమూత
లండన్: ఆటొమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎమ్)లను కనుగొన్న జాన్ షెఫర్డ్-బారన్ తన 84వ ఏట స్వల్ప అస్వస్థతకు లోనై, మరణించారు. ఉత్తర స్కాట్‌లాండ్‌లోని రైగ్‌మోర్ ఆసుపత్రిలో ఆయన శనివారం తుది శ్వాస వదిలారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమారులకు ఆరుగురు సంతానం ఉన్నారు. జాన్ బారన్ పుట్టింది భారత దేశంలోనే. ఆయన 1925లో స్కాటిష్ దంపతులకు జన్మించారు. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ పూర్వ ఛైర్మన్ సర్ కెన్నెత్ కుమార్తె అయిన కెరొలిన్ ముర్రేను పెళ్లాడారు. ముద్రణ సంస్థ డి లా ర్యూ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పనిచేసేవారు. బారన్ 2007లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం.. 1965లో డబ్బును విత్‌డ్రా చేసేందుకు ఆయన బ్యాంకుకు వెళ్లేసరికి కాలాతీతం అయిపోయి బ్యాంకును ఆరోజుకు కట్టేశారు. దీంతో నగదును అందజేసే యంత్రం వంటిది ఉంటేనో అన్న ఆలోచన బారన్‌కు వచ్చింది. డబ్బులు వేస్తే చాకొలెట్లు అందించే యంత్రం మాదిరిగానే, చాకొలెట్లకు బదులు అందులో నుంచి నగదు లభించేటట్లు చూడాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఇది జరిగిన రెండేళ్లకు అంటే 1967లో ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎమ్‌ను 1967లో లండన్‌లోని ఒక బ్యాంకు వద్ద ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక చెక్కును ఆ యంత్రంలో ఉంచితే, దాని పిన్‌ను సరిపోల్చుకొని అది డబ్బును ఇచ్చేది. తరువాత చెక్కుకు బదులు ప్లాస్టిక్ కార్డులు రంగప్రవేశం చేశాయి. ప్రస్తుతం వివిధ దేశాలలో సుమారు 20 లక్షల ఏటీఎంలు ఉన్నాయి.