గ్యాస్ సరఫరా కోసం
సంప్రదింపులు కొనసాగిస్తాం
ముకేశ్, అనిల్ వర్గాల సామరస్య ప్రకటనలు

గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి
దూరంగా ఉంటాం: ఆర్‌ఐఎల్
తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో తగవులకు ఎలాంటి ఆస్కారం ఉండబోదని అన్నదమ్ములకు చెందిన గ్రూపులు వేరువేరుగా ప్రకటనలు చేశాయి. దీంతో తమ్ముడు అనిల్ నేతృత్వంలోని ఏడీఏ గ్రూపు (అడాగ్) చమురు, గ్యాస్, రిటైల్, పెట్రోరసాయనాల వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి వీలు ఏర్పడనుంది. అలాగే, అన్నయ్య ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) టెలికం, విద్యుత్తు, ఫైనాన్షియల్ రంగాలలోకి ప్రవేశించగలుగుతుంది. అయితే, సౌహార్దపూర్వక చొరవలో భాగంగా 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఒక్క తమ సంస్థ (రిలయన్స్)కే చెందిన కేప్టివ్ గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల వ్యాపారం మినహా గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టబోనని ఆర్‌ఐఎల్ ప్రకటించడం విశేషం. తూర్పు కోస్తా తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) డీ6 క్షేత్రం నుంచి ఆర్‌ఐఎల్ వెలికితీస్తున్న సహజవాయువును అడాగ్ కంపెనీ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు సరఫరా చేసే అంశంపై ''సంప్రదింపులను సత్వరమే ముగించగలమని ఆశిస్తున్న''ట్లు కూడా ప్రకటనలలో తెలిపాయి.
తండ్రి కలలు పండించేందుకు ప్రతిన
సోదరులిరువురూ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను, కేంద్ర మంత్రులను కలుసుకొన్న కొద్ది రోజుల వ్యవధిలో ఈ మేరకు ప్రకటనలు వెలువరించడం విశేషం. వీటిని ఆర్‌ఐఎల్, అడాగ్ గ్రూపు కంపెనీల బోర్డులు ఆమోదించాయి. ముకేశ్, అనిల్‌లు చర్చించుకొన్న పర్యవసానంగానే ఈ ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు వ్యాపించినా ఒప్పందం ఎలా కుదిరిందనే దానిపై ఏ పక్షం నుంచి కూడా ఎటువంటి వివరణ రాలేదు. కేజీ బేసిన్‌లోని డీ6 క్షేత్రం నుంచి గ్యాస్‌ను అడాగ్ కంపెనీ ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు సరఫరా చేయాలన్న అంశంలో దీర్ఘ కాలం పాటు కొనసాగిన న్యాయ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అంబానీలు ముంబయిలో ఇష్టాగోష్టిగా చర్చలు సాగించినట్లు సమాచారం. ఆరు వారాలలోగా గ్యాస్ విక్రయానికి సంబంధించి మళ్లీ సంప్రదింపులు మొదలుపెట్టేందుకు ఇరు పక్షాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. తమ తాజా ప్రయత్నం రెండు గ్రూపుల మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరచగలదని, తత్ఫలితంగా ఉభయ గ్రూపు కంపెనీల వాటాదారుల పెట్టుబడికి విలువను ఇనుమడింపచేసేందుకు దారి ఏర్పడుతుందని ఈ గ్రూపులు విడుదల చేసిన ప్రకటనల్లో పేర్కొన్నాయి. తండ్రి ధీరుభాయ్ అంబానీ కలలను సాకారం చేయడానికి ప్రతిన బూనినట్లు ముకేశ్, అనిల్ సారథ్యాలలోని గ్రూపులు స్పష్టం చేశాయి.