ఏ మూలకూ చాలని రాబడి
పెరిగిన ఆదాయమూ అంతంతే
భవిష్యత్తు మరింత ఘోరం
ఆందోళనలో ఆర్థికశాఖ
దిక్కుతోచని ఖజానా విభాగం

రాబడితో నిమిత్తం లేకుండా బడ్జెట్లలో చూపించిన కేటాయింపులు ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకున్నాయి. దీనికి బడ్జెట్ బయటి బాధ్యతలు తోడవటంతో రాష్ట్రం ప్రస్తుతం వూపిరి సలపనంతగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఏ పథకానికీ సరిపడా నిధులను ఇవ్వలేని పరిస్థితిని చవిచూస్తోంది. రాబడి కంటే ఖర్చుల వేగం ఎక్కువగా ఉన్నందున గడ్డు పరిస్థితుల నుంచి ఇప్పట్లో బయటపడలేమన్న దిగులు ఆర్థికశాఖ వర్గాల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ 2004లో అధికార పగ్గాలను చేపట్టింది మొదలు భారీ బడ్జెట్ల బడాయిలకు పోతూ వచ్చింది. మరోవైపు కేంద్రం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం అమలులోకి తెచ్చింది. దీంతో వివిధ పథకాలకు రెవెన్యూ నిధులను కేటాయించడం... ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించి రెవెన్యూ మిగులును చూపించడం కోసం పథకాల్లో కోతలు వేయడం పరిపాటైంది.
సొంత పన్నులు, కేంద్ర పన్నుల్లోని వాటాలు, గ్రాంట్లు కలిపి రెవెన్యూ రాబడిగా వ్యవహరిస్తారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలు, రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు వంటివన్నీ ఈ రెవెన్యూ రాబడి నుంచే ఖర్చు పెట్టాలి. అప్పుల రూపేణా తెచ్చే మొత్తాన్ని నీటిపారుదల ప్రాజెక్టుల వంటి ఆస్తుల కల్పనకు వినియోగించాలి. రెవెన్యూ రాబడికి దీటుగా వివిధ ఖర్చులను అంచనా వేయగలిగితే ఎటువంటి కోతలు లేకుండా బడ్జెట్ ముందుకు సాగుతుంది. అలాకాకుండా రాబడికి మించి పథకాలను ప్రకటిస్తే నిధులు సరిపోక బడ్జెట్ కోతలు వేయాల్సి వస్తుంది. కొన్ని తప్పనిసరి బకాయిలను ఆ తర్వాత బడ్జెట్ నుంచీ చెల్లించక తప్పదు. ప్రస్తుతం జరుగుతున్నదిదే. గత ఆరేళ్ల బడ్జెట్ల ప్రభావం ప్రస్తుత బడ్జెట్‌పై పడింది. ఆ భారం క్రమేణా పెరుగుతూ భవిష్యత్తుపైనా ప్రభావం చూపనుంది.

* డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలు క్రమేణా పెరుగుతున్నందున పావలా వడ్డీ కోసం ఇవ్వాల్సిన నిధులనూ పెంచక తప్పదు. ఇటువంటివే మరెన్నో బాధ్యతలు ఉన్నాయి.
* 2010-11లో రెవెన్యూ రాబడి రూపేణా వచ్చే రూ.90,648 కోట్లలో రూ.31,202 కోట్లు ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు పోతుంది. బియ్యం, విద్యుత్తు సబ్సిడీలకు రూ.9,688 కోట్లు ఖర్చవుతుంది. మిగతా మొత్తాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలి.
వివిధ ఆదాయార్జనశాఖల వృద్ధిరేటు గత ఏడాది కంటే ఆశాజనకంగానే ఉన్నట్లు ఏప్రిల్ నెల రాబడి ద్వారా ఆర్థికశాఖ అంచనావేసింది. అయినప్పటికీ బడ్జెట్‌లోని కేటాయింపులకు దీటుగా నిధులను ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకు ప్రస్తుత వ్యయ పెరుగుదలతోపాటు పాత బకాయిలు పేరుకు పోవడమే కారణం.
బకాయిల భారం
బడ్జెట్లను వదలకుండా బకాయిలు వెంటాడుతున్నాయి. ఒక ఏడాది బకాయిలను తదుపరి ఏడాది బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నారు. దీంతో ఆ ఏడాది ఇవ్వాల్సిన మొత్తంలో మళ్లీ బకాయి ఏర్పడుతోంది. ఉదాహరణకు ఇంజినీరింగ్ విద్యార్థుల పాత బకాయిలను ఈ ఏడాది బడ్జెట్ నుంచి చెల్లిస్తే ఈ ఏడాది ఇవ్వాల్సినవి వచ్చే ఏడాది బడ్జెట్‌కు బకాయిగా మారతాయి. 2004-05 నుంచి ఇవి ఒక చక్రంగా మారాయి. కొన్ని బకాయిలనైతే తదుపరి బడ్జెట్ నుంచీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడి వాటిని ఎలా వదిలించుకోవాలో ఆర్థికశాఖకు దిక్కుతోచటంలేదు. కొన్ని కార్పొరేషన్లు ప్రజలకు ఇచ్చిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడంతో ఇప్పుడు వాటికి చెల్లించాల్సినవి ప్రభుత్వానికి బకాయిలుగా మారాయి. విద్యుత్తు కొనుగోలుకు చెల్లించాల్సిన మొత్తాలు భారీగా పేరుకుపోయాయి. ఇటువంటివన్నీ కలిపే ఇప్పుడు రూ.18వేల కోట్లకు చేరాయి. ఇవి 2010 మార్చి నెలాఖరువరకూ ఉన్నవే. ఏప్రిల్ నుంచి ఇవి మరింతగా పెరుగుతున్నాయి.

