Saturday, May 29, 2010

అబాట్‌.. నంబర్‌ వన్‌ ...భారత ఫార్మా రంగంలో పైచేయి

రూ.18,000 కోట్లతో
పిరమాల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ కొనగోలు

ఏమిటి: పిరమాల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ వ్యాపారం.
ఏంజరిగింది: అబాట్‌ కొనుగోలు చేసింది.
ఎంతకు: 3.72 బిలియన్‌డాలర్లు(రూ.18,000 కోట్లు)
మొత్తం ఇప్పుడే ఇస్తారా: ప్రస్తుతానికి 2.12 బి. డాలర్లు చెల్లించి మిగతా నాలుగు వార్షిక వాయిదాల్లో చెల్లిస్తారు
దీని వల్ల అబాట్‌కు ఏమిటి: భారత్‌లో అతిపెద్ద మందుల తయారీ కంపెనీగా మారుతుంది

న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం అబాట్‌ భారత ఫార్మా కంపెనీ పిరమాల్‌కు చెందిన దేశీయ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ 3.72 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.18,000 కోట్లు) కావడం గమనార్హం. ఈ కొనుగోలుతో అబాట్‌ భారత్‌లో అతిపెద్ద మందుల తయారీ కంపెనీగా అవతరించనుంది.

ఇదీ ఒప్పందం: 'పిరమాల్‌ హెల్త్‌కేర్‌తో కుదర్చుకున్న నిర్ణయాత్మక ఒప్పందం ప్రకారం పిరమాల్‌కు చెందిన హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌(దేశీయ ఫార్ములేషన్స్‌)ను పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు.. ఇందుకోసం ప్రస్తుతం 2.12 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు.. మిగతా మొత్తాన్ని నాలుగు వార్షిక వాయిదాల్లో 400 మిలియన్‌ డాలర్ల చొప్పున ఇవ్వనున్న'ట్లు అబాట్‌ ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కొనుగోలుకు సంబంధించిన నిధులను అంతర్గత సమీకరణల ద్వారా చేపట్టనున్నట్లు అబాట్‌ పేర్కొంది.

* ఒప్పందం ప్రకారం పిరమాల్‌కు చెందిన తయారీ ప్లాంట్లు, దేశీయ వ్యాపారంలోని 350 బ్రాండ్ల మార్కెట్‌పై హక్కులు అబాట్‌ చేతికి వస్తాయి.
* అంతే కాదు ఒప్పంద నిబంధనల ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో భారత్‌లో జనరిక్‌ ఫార్మా వ్యాపారంలో పిరమాల్‌ పాలు పంచుకోదు.
* దేశీయ ఫార్ములేషన్‌ వ్యాపారానికి చెందిన 5000 మందికిపైగా ఉద్యోగులు కూడా అబాట్‌కి బదిలీ అవుతారు.

* కొనుగోలు తర్వాత అబాట్‌ కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్డ్‌ ప్రోడక్ట్స్‌ డివిజన్‌లో పిరమాల్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ వ్యాపారం ఒక భాగంగా మారుతుంది.

* అయితే పిరమాల్‌కు చెందిన పరిశోధన, అభివృద్ధి, విదేశీ, యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియంట్స్‌(మందుల ముడిపదార్థాలు) వ్యాపారాలు మాత్రం కంపెనీయే అట్టిపెట్టికుంటుంది.

అబాట్‌కు మంచిదే!
రూ.55,000 కోట్ల విలువ చేసే భారత మందుల మార్కెట్లో అబాట్‌ 7 శాతం వాటాను చేజిక్కించుకోవడానికి తాజా కొనుగోలు ఉపయోగపడగలదని అంచనా. ఈ విషయాన్ని స్వయనా పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ పేర్కొనడం విశేషం. ఇక అబాట్‌ అంచనాల ప్రకారం పిరమాల్‌ ఏటా 20 శాతం వృద్ధితో 2020 కల్లా 2.5 బిలియన్‌ డాలర్ల విక్రయాలను సాధిస్తుంది.

దూసుకెళ్లిన షేర్ల ధరలు
విక్రయ ప్రకటన వెల్లడి అయిన వెంటనే అబాట్‌ ఇండియా షేర్లు 15 శాతం ఎగసి రూ.1,210 గరిష్ఠ స్థాయికి చేరాయి. చివరకు 3.71 శాతం లాభంతో రూ.1096.90 వద్ద స్థిరపడ్డాయి. ఇక పిరమాల్‌ హెల్త్‌కేర్‌ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.599.90కి చేరాయి. ఒక దశలో రూ.488కీ కుంగాయి. చివరకు 11.81 శాతం నష్టంతో రూ.502.35 వద్ద ముగిశాయి. అయితే అంతక్రితం రోజైన గురువారం కంపెనీ షేర్లు 8.5 శాతం లాభంతో రూ.569.65 వద్ద స్థిరపడడం విశేషం.
కొనుగోలుకు మంచి సమయమే
ప్రస్తుత ధరల వద్ద పిరమాల్‌ హెల్త్‌కేర్‌ షేర్లను కొనుగోలు చేయవచ్చంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఆ షేరు ధర అధికంగా ఉన్నప్పటికీ రూ.500-550 మధ్యలో ఉంది కాబట్టి కొనుగోలుకు మంచి అవకాశమేనంటున్నారు.
ఓపెన్‌ ఆఫర్‌ ఉండకపోవచ్చు
హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ను విక్రయించిన తర్వాత ఓపెన్‌ ఆఫర్‌కు అబాట్‌ వెళ్లకపోవచ్చని కంపెనీ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ అంటున్నారు. అయితే తమ వాటాదార్లకు ప్రత్యేక (ఒన్‌టైమ్‌) డివిడెండును ప్రకటించే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. నాన్‌-కంపీట్‌ ఫీజుల కింద అబాట్‌ నుంచి రూ.350 కోట్లు పొందినట్లు వీటిని రుణాలను తీర్చుకోవడానికి, విస్తరణలకు ఉపయోగించుకుంటామని పేర్కొంది.
పిరమాల్‌ గ్రూప్‌
ఏర్పాటు : 1988
ప్రధాన కార్యాలయం : ముంబయి
ఛైర్మన్‌ : అజయ్‌ డి. పిరమాల్‌
ఏ రంగాల్లో : ఆరోగ్య సంరక్షణ, డయోగ్నస్టిక్స్‌, గాజు, స్థిరాస్తి, ఆర్థిక సేవలు
ఏకీకృత ఆదాయం : రూ.3670 కోట్లు(2009-10)
నికరలాభం : రూ.480 కోట్లు
అబాట్‌
ఏర్పాటు : 1888
ప్రధాన కార్యాలయం : చికాగో, అమెరికా
ఛైర్మన్‌, సీఈఓ : మైల్స్‌ డి. వైట్‌
ఏ రంగాల్లో : ఫార్మా, మెడికల్‌, పోషకాహార ఉత్పత్తులు
ఉద్యోగులు : 83,000 మంది
ఆదాయం : రూ.1.40 లక్షల కోట్లు (2009)
ఉత్పత్తుల విక్రయం : 130 దేశాల్లో పైగా