Friday, May 21, 2010

స్టాక్‌ మార్కెట్లలో 'లైలా'

దెబ్బతీసిన జర్మనీ ప్రభుత్వ నిర్ణయం
కుదేలైన అంతర్జాతీయ సూచీలు
2 శాతం కుంగిన ఆసియా, ఐరోపా మార్కెట్లు
మన ఇండెక్స్‌లదీ పతనబాటే
467 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
5000 కీలక స్థాయి దిగువన నిఫ్టీ
యూరోజోన్‌లో భయాలు వీడలేదని తేలిపోయింది. గ్రీసుకు ప్యాకేజీ తొలి విడతను విడుదల చేసినా అవి తొలిగిపోలేదు. తాజాగా జర్మనీ ప్రభుత్వం బాండ్ల షార్ట్‌ సెల్లింగ్‌పై నిషేధం విధించడంతో సంక్షోభ తుపాను మరో సారి విశ్వరూపం చూపింది. యూరోజోన్‌ వృద్ధి కుంటుబడి మొత్తం మీద అంతర్జాతీయ రికవరీకి అడ్డుకట్ట పడుతుందన్న భయాలు తలెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. ఆ తుపాను గాలి మన మార్కెట్లనూ తాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 467 పాయింట్ల మేర; ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 146 పాయింట్ల మేర భారీగా కుప్పకూలాయి.

మార్కెట్‌ ఊగిసలాటను అరికట్టడానికి జర్మనీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. బాండ్ల షార్ట్‌ సెల్లింగ్‌పై నిషేధం విధించడం అన్ని మార్కెట్లను కూల్చింది. మరో పక్క యూరో మారక విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పతనం కావడం.. ప్రపంచ వ్యాప్త కమోడిటీ మార్కెట్లు కుప్పకూలడం.. మదుపర్ల సెంటిమెంటును మరింత దెబ్బతీసింది. దీంతో దేశీయ మార్కెట్లలో ఫండ్లు భారీ స్థాయిలో విక్రయాలకు పాల్పడ్డారు. ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్‌ ప్రతికూలంగానే మొదలైంది. ఊగిసలాటలో మధ్యాహ్నం సమయానికల్లా భారీ నష్టాన్ని నమోదు చేసుకుంది. 16,373.32 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. అప్పటికి 500 పాయింట్లకు పైగా నష్టం వచ్చింది. ఐరోపా మార్కెట్ల పతనం ఇందుకు కారణమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్‌ కోలుకోలేదు. తక్కువ స్థాయుల వద్దకొన్ని కొనుగోళ్లు కనిపించడంతో కాస్త ఊగిసలాడింది తప్ప పుంజుకుంటుందన్న ఆశ ఎక్కడా కనిపించలేదు. చివరకు 16,408.49 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీకూడా ఒకదశలో 4,908.15 వద్ద కనిష్ఠ స్థాయిని చవిచూసి తుదకు 5000 స్థాయి దిగువగా 4,919.65 వద్ద ముగిసింది.

ఏ ఒక్క సూచీ లాభపడలేదు
* ఇంతటి భారీ నష్టం నేపథ్యంలో ఏ ఒక్క సూచీ కూడా లాభాన్ని కళ్లజూడలేకపోయింది.
* లోహ సూచీ అత్యధికంగా 4.19% కుంగింది. స్థిరాస్తి(3.95%), బ్యాంకింగ్‌(3.85%), వాహన(3.85%), ఎఫ్‌ఎమ్‌సీజీ(2.79%)లకూ గట్టి దెబ్బే తగిలింది.
* 2246 స్క్రిప్‌లు కుదేలవగా.. కేవలం 601 స్క్రిప్‌లు స్వల్ప లాభాలతో బయటపడ్డాయి.
* బీఎస్‌ఈలో టర్నోవరు రూ.4532 కోట్లుగా నమోదైంది.
* బీఎస్‌ఈ-30 షేర్లలో 27 పతనమయ్యాయి.
* టాటా మోటార్స్‌ అధికంగా 7.39% నష్టపోయి రూ.714.50 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.19% కోల్పోయి రూ.998.30 వద్ద నిలిచింది.
* స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌(7.33%), ఎం&ఎం (7.24%), రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(5.66%), జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ (5.52%), హిందాల్కో ఇండస్ట్రీస్‌(3.93%), టాటా స్టీల్‌(3.59%), డీఎల్‌ఎఫ్‌(3.58%), ఐటీసీ(3.48%), రిలయన్స్‌ ఇన్‌ఫ్రా(3.32%), భారతీ ఎయిర్‌టెల్‌(3.08%) మేరకుదేలయ్యాయి.
* ఇంకా హిందుస్థాన్‌ యునిలీవర్‌, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఏసీసీ, ఓఎన్‌జీసీ, భెల్‌, ఎన్‌టీపీసీలు 1.69-2.97% మేర కుంగాయి.
* హీరో హోండా, సిప్లా, టాటాపవర్‌లు స్వల్పంగా లాభపడ్డాయి.

ఏడాది గరిష్ఠానికి బీఓఆర్‌
భారీ మొత్తాన్ని వెచ్చించి బ్యాంక్‌ ఆఫ్‌ రాజస్థాన్‌(బీఓఆర్‌)ను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు ధర బీఎస్‌ఈలో 7.24% నష్టపోయింది. రూ.825 వద్ద ముగిసింది. మరో పక్క బీఓఆర్‌కు ఈ ఒప్పందం కలిసివచ్చినట్లే కనిపించింది. అది షేర్ల విలువలో ప్రతిఫలించింది. మంగళవారం 20 శాతం పెరిగిన బీఓఆర్‌ షేరు ధర బుధవారం మరో 20 శాతం పెరిగి రూ.119.40కు చేరడం విశేషం. బీఓఆర్‌ వాటాదార్లకు (ప్రధాన ప్రమోటరు తాయల్‌ కుటుంబం) ప్రతీ 118 బీఓఆర్‌ షేర్లకు 25 ఐసీఐసీఐ బ్యాంకు షేర్లను ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు బ్యాంకు మార్కెట్‌ విలువకు దాదాపు రెట్టింపు విలువను ఐసీఐసీఐ బ్యాంకు చెల్లించడానికి సిద్ధపడడం బీఓఆర్‌ వాటాదార్లకు ఆనందాన్నే కలిగించింది.
అంతర్జాతీయ కష్ట కనిష్ఠాలివీ
ర్మనీ దెబ్బతో అటు ఐరోపా మార్కెట్లతో పాటు ఇటు ఆసియా మార్కెట్లకూ పతనం తప్పలేదు. హాంగ్‌కాంగ్‌ నుంచి లండన్‌ అటు నుంచి న్యూయార్క్‌ వరకూ ఆ పతనం కొనసాగింది. బుధవారం ఐరోపా మార్కెట్లు 2% దాకా పడ్డాయి. లండన్‌ ప్రామాణిక సూచీ ఎఫ్‌టీఎస్‌ఈ-100 2%పైగా; డీఏఎక్స్‌ 2%, సీఏసీ-40 2.37% మేర కిందకు జారాయి. మరో పక్క జపాన్‌ నిక్కీ 1.65% పడిపోయి మూడు నెలల కనిష్ఠానికి చేరింది. ఆస్ట్రేలియా డాలరు ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది. అక్కడి మార్కెట్లు 8 నెలల కనిష్ఠానికి పడిపోయాయ్‌. అంతక్రితం రోజు డోజోన్స్‌, ఎస్‌&పీ 500 సూచీలు 1 శాతం మేర కుంగి మరింత బలహీనతను పంచాయి. మరో పక్క మార్కెట్లతో పాటు ముడి చమురు ధర కూడా ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బారెల్‌ ధర దాదాపు 68 డాలర్లుగా పలికింది. డాలరుతో పోలిస్తే యెన్‌, పౌండ్‌, యూరో మారక విలువలూ నెలల కనిష్ఠ స్థాయులకు పడిపోయాయి. యూరో ప్రమాదంలో పడిందంటూ జర్మనీ ఛాన్సలర్‌ యాంజెలా మెర్కెల్‌ తక్షణ చర్యలకు పిలుపునివ్వడం మరింత ఆందోళనలను కలిగించింది.