Friday, May 21, 2010

ఎగుమతులు ఎగశాయ్‌ కానీ..

ఏప్రిల్‌లో 36.2 శాతం వృద్ధి
ఈ అంకెలు పట్టించుకోనక్కర్లేదు
ప్రాతిపదిక తక్కువ కావడమే ఇందుకు కారణం
ప్రభుత్వ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో ఎగుమతులు 36.2 శాతం వృద్ధిని సాధించాయి. 16.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే గతేడాది చాలా తక్కువ వృద్ధి నమోదైన కారణంగా ఈ ఏడాది గణాంకాలు భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి తప్ప నిజంగా అంత వృద్ధి లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో మాంద్యం కారణంగా 30 శాతం క్షీణతతో 12.4 బిలియన్‌ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. అపుడు అంతర్జాతీయ వాణిజ్యం 9 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలోనూ ఎగుమతులు 54.1% పెరిగాయి కానీ అది కూడా తక్కువ ప్రాతిపదిక ప్రభావమేనని తెలుస్తోంది.

ఆహార ధాన్యాలు, చేతివృత్తులు తప్ప జౌళి, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తులు వంటి అన్ని రంగాలు ఏప్రిల్‌లో మంచి పనితీరునే కనబరచాయి. కాగా, ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేం. ఎందుకంటే ప్రాతిపదిక(గతేడాది) తక్కువగా ఉండడం వల్ల శాతంలో చూస్తే ఎక్కువ వృద్ధి సాధించినట్లు కనిపిస్తుంది. మనం ఇంకా 2008-09 ఏప్రిల్‌ స్థాయి(18.5 బి. డాలర్లు) కంటే దిగువనే ఉన్నామ'ని వాణిజ్య కార్యదర్శి రాహుల్‌ ఖుల్లార్‌ బుధవారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు.

మరో పక్క దిగుమతులు 43.3 శాతం వృద్ధితో 27.3 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఇదే సమయానికి అవికేవలం 19.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 6.7 బిలియన్‌ డాలర్లనుంచి 10.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. చమురు దిగుమతలు 4.7 బి. డాలర్ల నుంచి 8.1 బి. డాలర్లకు పెరిగాయి.