
సట్లజ్ జలవిద్యుత్ నిగమ్ షేర్లు గురువారం స్టాక్ మార్కెట్లో నమోదయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో రూ.27.10 వద్ద, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో రూ.28 ధర వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. విశేషమేమిటంటే.. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ ప్రారంభ ధరలే గరిష్ఠ ధరలు కావడం. కొద్దిపాటి ఒడుదొడుకుల మధ్య సాగిన మార్కెట్లో సట్లజ్ షేర్లు నమోదిత ధర కంటే తక్కువ ధర వద్దే ఎక్కువ శాతం ట్రేడవుతూ వచ్చాయి. ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ. 24.15, బీఎస్‌ఈలో రూ.24 వద్ద కనిష్ఠ స్థాయిని చేరాయి. ఆ తర్వాత కొద్దిపాటి మార్పులతో బీఎస్‌ఈలో రూ.25.05, ఎన్‌ఎస్‌ఈలో రూ.25 వద్ద ముగిశాయి.
రూ.23-26 ధరల శ్రేణితో సట్లజ్ జలవిద్యుత్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకొచ్చింది. రూ.26 గరిష్ఠ ధరపై 5 శాతం డిస్కౌంట్‌తో అంటే రూ.1.30 తక్కువగా రూ.24.70 ధరకు చిన్న మదుపర్లకు కంపెనీ షేర్లు కేటాయించారు. అంటే ఈ ఇష్యూ ద్వారా ఇన్వెస్టరుకు గిట్టుబాటు అయింది (ముగింపు ధర రూ.25తో పోలిస్తే) కేవలం 30 పైసలేనన్న మాట.
ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం రంగ సంస్థ ఇష్యూ సట్లజ్‌దే. రాబోయే రోజుల్లో కోల్ ఇండియా, సెయిల్ వంటి కంపెనీలు సైతం మదుపర్ల ముంగిట్లోకి రాబోతున్నాయి. గతంలో ఆడంబరంగా ఇష్యూకొచ్చిన ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎండీసీలు ప్రస్తుతం నిట్టూర్పులు విడుస్తున్నాయి. సట్లజ్ కూడా ఇదే బాటలో నడస్తుందా? అన్నదే మార్కెట్ వర్గాల ప్రధాన సందేహం.