Wednesday, May 12, 2010

చమురు గప్పిన ముప్పు!

మూలిగే నక్కపై తాటికాయ! వాతావరణ మార్పులు, ఆర్థిక మాంద్యం, ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటం కారణంగా ఏర్పడ్డ బూడిద మేఘాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఏప్రిల్‌ 20న అమెరికాకు సమీపంలో.. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఉన్న 'డీప్‌ వాటర్‌ హొరైజాన్‌ రిగ్‌'లో విస్ఫోటం కారణంగా పెల్లుబికిన చమురుధార.. ఎడతెరపి లేకుండా ప్రవహిస్తూ అమెరికా, దాని చుట్టుపక్కల దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ సప్తవర్ణాల తెట్టు.. సముద్ర జీవులను అష్టకష్టాల పాల్జేస్తోంది.
బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ)కి చెందిన ఈ సముద్రతల చమురు క్షేత్రంలో గత నెల 20న ఒక విస్ఫోటం ఏర్పడి అగ్నికీలలు ఎగిశాయి. ఈ ప్రమాదంలో 11 మంది ఉద్యోగులు మరణించారు. సముద్ర ఉపరితలంపై ఉన్న రిగ్‌ మునిగిపోయింది. సముద్రగర్భంలో ఉన్న పైపునకు మూడు చోట్ల రంధ్రాలు ఏర్పడి.. నిరంతరాయంగా ముడి చమురు బయటకు లీకవుతోంది. దీని పరిమాణం రోజుకు 7.95లక్షల లీటర్లు. ఫలితంగా దాదాపు 5200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు తెట్టు ఏర్పడింది. రిగ్‌కు ఉన్న బ్లోఅవుట్‌ నిరోధకం (బీఓపీ) పాక్షికంగానైనా పనిచేసి ఉంటుందని భావిస్తున్నారు. లేకుంటే చమురు లీకేజీ భారీ స్థాయిలో ఉండేదని చెబుతున్నారు. ఈ చమురు తెట్టు అమెరికాలోని లూసియానా, అలబామా రాష్ట్రాల తీరాలను తాకుతోంది.

తెట్టు తొలిగిపోదే!
ముద్రంలో వ్యాపించిన చమురు తెట్టును తొలగించేందుకు సహాయ సిబ్బంది విపరీతంగా శ్రమిస్తున్నారు. 'నియంత్రిత ప్రజ్వలన' కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తెట్టును మండిస్తున్నారు.
* చమురు తెర మరింతగా వ్యాపించకుండా.. మైళ్ల కొద్దీ రక్షణాత్మక 'బూమ్‌'లను పెడుతున్నారు. నీటిపై తేలియాడే ఈ బూమ్‌లు.. చమురు వ్యాప్తిని అడ్డుకుంటాయి. వీటిని సముద్రంపై పరవడానికి 275 బోట్లను ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది సైనిక, పౌర సిబ్బంది పాలుపంచుకున్నారు.
* దళసరిగా ఉన్న చమురు తెట్టును విచ్ఛిన్నం చేసేందుకు సబ్బు, వంటి రసాయనాలను నౌకలు, విమానాల ద్వారా సముద్రంపై చల్లుతున్నారు.
* ప్రత్యేక బూమ్‌లను తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా వెంట్రుకలను భారీ స్థాయిలో అమెరికాకు విరాళంగా పంపుతున్నారు.

పర్యావరణానికి హాని
మెరికాలోని జనసమ్మర్థం, పర్యాటకులు రద్దీ ఎక్కువగా ఉన్న బీచ్‌లవైపు చమురు ప్రయాణిస్తుండడంతో ఇది పర్యావరణపరమైన సంక్షోభానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
* నీటి మీది తేలియాడుతున్న చమురు.. సమస్యలో కొంత భాగమేనని అమెరికా జాతీయ వన్యప్రాణి సమాఖ్య అధ్యక్షుడు లారీ స్క్వీగర్‌ తెలిపారు. తెట్టును చెల్లాచెదురు చేయడానికి వాడిన రసాయనాల కారణంగా కొంత చమురు నీట మునిగిందని, దీనివల్ల మత్స్య, ఇతర సముద్రజీవులకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
* నాచు వంటివి కూడా దెబ్బతింటాయి. దీనివల్ల ఆహారగొలుసుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కొన్ని రకాల జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమో.. అంతర్థానం కావడమో జరుగుతుంది.
* సముద్ర జీవుల పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.
* గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో తీరం వెంబడి అనేక రకాల వన్యప్రాణులు ఆవాసాలు ఏర్పర్చుకుంటున్నాయి. వీటిలో గోధుమ రంగు పెలికాన్‌లు, అనేక రకాల బాతు జాతులు, తాబేళ్లు ఉన్నాయి. ఇప్పటికే.. మృతి చెందిన పక్షులు, చమురుతో తడిచి ముద్దయిన పక్షులు దర్శనమిస్తున్నట్లు కోస్టుగార్డుకు సమాచారం అందింది.
* చమురు తెట్టును మండించడం వల్ల వాతావరణంలోకి విషవాయువులు విడుదలవుతున్నాయి.
* దీర్ఘకాలంలో వాతావరణ మార్పులకు కూడా చమురు లీకేజీ కారణమవుతుంది. సముద్రంలో చమురు ఎక్కువ కావడం వల్ల వాతావరణం, రుతుసంబంధమైన మార్పులు వేగవంతం కావడమో జాప్యం జరగడమో జరుగుతుంది.
* పర్యాటక రంగానికి బాగా నష్టం వాటిల్లుతుంది. చేపలవేట, బోటింగ్‌, ఈత కొట్టడం, స్కూబా డైవింగ్‌ వంటి కార్యక్రమాలు నిలిచిపోతాయి. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. చిరువ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

'బీపీ' పెరిగిపోతుంది..
ల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో చమురు లీకేజీని ఆపడంతోనే బీపీ సంస్థ కష్టాలు తొలగిపోతాయనుకుంటే పొరపాటే. సముద్ర జలాల శుద్ధికయ్యే ఖర్చు, న్యాయ వివాదాలు ఈ కంపెనీకి భారీగా చేతి చమురు వదిలించనున్నాయి.
* డీప్‌వాటర్‌ హొరైజాన్‌ రిగ్‌లో విస్ఫోటం కారణంగా 11 మంది చనిపోయారు. వీరి తరఫున ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. లూసియానాకు చెందిన ఇద్దరు రొయ్యల వేటగాళ్లు కూడా నష్టపరిహారం కోసం దావాలు వేశారు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది.
* మొత్తం బీపీపై మీద 100 కోట్ల డాలర్ల పైబడి వ్యయం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే బీపీ షేరు నేల చూపులు చూస్తోంది.

మూత పడేదెప్పుడు?
డలిలో రగిలిన చమురు చిచ్చును ఆపేందుకు బ్రిటిష్‌ పెట్రోలియం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదు. చమురు బావిలో ఏర్పడ్డ మూడు లీకేజీలను అదుపు చేసేందుకు బీపీ.. రిమోట్‌ సాయంతో నడిచే జలాంతర్గాములను వాడింది. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలూ కలగలేదు.
* లీకేజీపైన మూత పెట్టేందుకు 98 టన్నుల భారీ డోమ్‌ను అమర్చడానికి బీపీ ఏర్పాట్లు చేసింది. సముద్ర అంతర్భాగంలో దీన్ని దించింది. ఈ డోమ్‌ ద్వారా.. లీకవుతున్న చమురును సేకరించి నిల్వ చేసేందుకు ఒక డ్రిల్‌షిప్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే మీథేన్‌.. చల్లటి నీటితో కలవడం వల్ల ఏర్పడ్డ వాయు హైడ్రేట్లు డోమ్‌ను అడ్డుకుంటున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై బీపీ దృష్టిసారించింది.
* లీకేజీ ఏర్పడ్డ చమురు బావికి సమాంతరంగా మరో బావి (రిలీఫ్‌ వెల్‌)ను కూడా తవ్వుతోంది. అయితే ఇది పూర్తికావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇది పూర్తయితే పేలిపోయిన పైపు నుంచి చమురును దీనిలోకి మళ్లించవచ్చు.
* లీకేజీని అదుపు చేసేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు విఫలమైతే రోజుకు 95 లక్షల లీటర్ల వరకూ చమురు సముద్రంలో కలుస్తుందని బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ) చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి డగ్‌ సటుల్స్‌ హెచ్చరించారు.
వాతావరణ మార్పుల బిల్లుకు రిపబ్లికన్‌ పార్టీ మద్దతు కూడగట్టేందుకు అధ్యక్షుడు ఒబామా గత నెలలో ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ను విస్తృతపరుస్తున్నట్లు ప్రకటించారు. అయితే చమురు లీకేజీ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.