ఇక సర్‌ఛార్జ్ షాక్!
వినియోగదారులపై రూ.వెయ్యి కోట్ల భారం
కసరత్తు చేస్తున్న విద్యుత్తు సంస్థలు
హైదరాబాద్, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులపై మరో రూపంలో ఛార్జీల భారాన్ని మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. 2009-10కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీ విధించేందుకు విద్యుత్తు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఇంధనం (బొగ్గు, గ్యాస్, ఇతరాలు) ధరల్లో పెరుగుదల ఉంటే, వాటిపై అదనంగా వెచ్చించిన మొత్తాన్ని సర్‌ఛార్జీ రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2009-10 ఏడాదిలో వెచ్చించిన అదనపు వ్యయం వివరాలను విద్యుత్తు సంస్థలు సేకరిస్తున్నాయి. ఆ మొత్తం రూ.వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇందులో పరిశ్రమలు, వాణిజ్యవర్గాల వాటానే అధికంగా ఉంటుంది. అంచనాలు పూర్తయ్యాక అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నాయి. 2008-09లో దాదాపు రూ.1600 కోట్ల మేర ఇంధన సర్‌ఛార్జీ ప్రతిపాదించగా, సాధారణ గృహ వినియోగదారుల్ని మినహాయించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారుల నుంచి సర్‌ఛార్జీ వసూలు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఏడాదిన్నర క్రితమే విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)ని సంప్రదించాయి. దీనిపై ఇంకా ఈఆర్‌సీ నిర్ణయం వెలువడలేదు. ఈలోగా 2009-10కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీ వివరాలు సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిసింది. నెలరోజుల క్రితమే పరిశ్రమలు, వాణిజ్య వర్గాలకు విద్యుత్తు ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీన్ని ఈఆర్‌సీ ఆమోదించాల్సి ఉంది. ఈ రెండు నిర్ణయాలు కొద్దిరోజుల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. మరోవైపు సర్‌ఛార్జీ, విద్యుత్తు ఛార్జీల పెంపుతో పరిశ్రమలు, వాణిజ్యవర్గాలు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.