Saturday, May 8, 2010

అంబానీ సోదరుల వివాదం ఇదీ నేపథ్యం...

కేజీ గ్యాస్‌లో వాటాకు సంబంధించి అంబానీ సోదరుల మధ్య నాలుగేళ్ళుగా వివాదం సాగుతున్నది. ఈ న్యాయపోరాటం సందర్భంగా అన్నదమ్ములు పలుసార్లు బహిరంగ సవాళ్లతో, మాటల యుద్ధంతో సీన్ రక్తికట్టించారు. వివాదానికి మూలంగా ఉన్న గ్యాస్ పంపిణీ ఒప్పందం అంబానీ సోదరుల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించిన ఒప్పందాల్లో భాగం.

రిలయన్స్ సామ్రాజ్య సృష్టికర్త ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రెండేళ్లకు అన్నదమ్ముల మధ్య 2005 జూన్ 18న ఆస్తుల విభజన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం చమురు, సహజవాయువు, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు అన్న ముకేశ్ అంబానీ చేతుల్లోకి వెళ్ళగా, విద్యుత్, టెలికామ్, ఫైనాన్స్ సర్వీసెస్ వ్యాపారాలు తమ్ముడి చేతుల్లోకి వచ్చాయి.

కేజీ బేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను ప్రభుత్వం మిలియన్ థర్మల్ యూనిట్‌కు 4.2 డాలర్లుగా నిర్ణయించింది. అయితే కుటుంబ అంతర్గత ఒప్పంద ప్రకారం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమకు మిలియన్ థర్మల్ యూనిట్ గ్యాస్‌ను 2.34 డాలర్లకే సప్లయ్ చేయాలని ఆర్ఎన్ఆర్ఎల్ డిమాండ్ చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి పవర్ ప్లాంట్ (7800మెగావాట్లు) కోసం కేజీ గ్యాస్‌ను అనిల్ గ్రూప్ కోరింది. కుటుంబ ఒప్పంద ప్రకారం రోజుకు మొత్తం 28 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను (2.34 డాలర్ల రేటుతో) తమకు సప్లయ్ చేయాలన్నది అనిల్ గ్రూప్ వాదన.

అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువ ధరకు గ్యాస్ సప్లయ్ చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించకపోవడంతో అనిల్ గ్రూప్ మొదట బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. వ్యవహారం సామరస్యంగా పరిష్కరించుకోవల్సిందిగా బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

గ్యాస్ సప్లయ్ ఒప్పందంపై కోర్టు వివాదాలు సాగుతుండగానే అన్నదమ్ముల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు భగ్గుమన్నాయి. ముకేష్ అంబానీకి వ్యతిరేకంగా భారీ ప్రచార యుద్ధాన్నే అనిల్ అంబానీ ఎక్కుపెట్టారు. పరువునష్టం దావా కూడా వేశారు. తమ్ముని గ్రూప్ సంస్థ ఆర్‌కామ్ దక్షిణాఫ్రికా సంస్థ ఎంటిఎన్‌తో విలీనమై అతి పెద్ద అంతర్జాతీయ టెలికామ్ కంపెనీగా అవతరించేందుకు చేసిన ప్రయత్నాలకు మోకాలడ్డారు.

కేజీ గ్యాస్ ధరను నిర్ణయించడంతో పాటు వినియోగదారులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 90 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగానికి సంబంధించి కేటాయింపులు జరిపింది. ప్రస్తుతం రిలయన్స్ కేజీ బేసిన్‌లో 62-63 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది.