
10 గ్రాములు రూ.18,620
పెళ్లిళ్ల సీజన్ తోడై మరింత పైపైకి
రూ.20 వేలకు చేరొచ్చన్న అంచనాలు
హైదరాబాద్ - న్యూస్‌టుడే

ధరలు ఎందుకు పెరిగాయంటే...
గ్రీస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం బంగారు ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. గ్రీస్ సంక్షోభం క్రమంగాభారత్, చైనాల పైనా ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. కొద్ది రోజులుగా రూపాయి బలహీనపడటం, డాలర్ బలపడటం దీనికి మరింత ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి మరింత మిడిసిపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌ను గట్టెక్కించడానికి యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లు కలసి లక్ష కోట్ల డాలర్ల విలువైన బెయిల్-అవుట్ ప్యాకేజీని ఈ నెల 10న ప్రకటించిన విషయం విదితమే. ఈ సహాయాన్ని అందుకోవాలంటే గ్రీస్ ద్రవ్యలోటును గణనీయంగా కుదించుకోవాలని, అందుకు మిత వ్యయ చర్యలు చేపట్టాలని షరతులు విధించారు. దీనిని గ్రీస్ తలొగ్గింది కూడా. ఏతావతా యూరో జోన్‌లో కరెన్సీల విలువ పడిపోవచ్చన్న భయాలు మదుపరులలో గూడు కట్టుకొన్నాయి. వారు తమ వద్ద ఉన్న నిధుల్ని బులియన్ వైపు మళ్లిస్తుండటంతో... కాంచనం ధరలు అమాంతం పెరిగిపోయాయి.
పాత బంగారం అమ్మకాల జోరు
మంచి ధర వస్తుండడంతో... బీరువాల్లో దాచిన పాత బంగారాన్ని బయటికి తీసి అమ్మేస్తున్నారు. వీరి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బంగారం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును భూముల కొనుగోలు, ఇతరత్రా వాటికి వెచ్చిస్తున్నారు.
ఢిల్లీ, ముంబయిల్లోనూ...
దేశరాజధాని ఢిల్లీలో,ఆర్థికరాజధాని ముంబయిలో కూడా బంగారం ధర ఉన్న పళంగా పెరిగిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో మంగళవారం పదిగ్రాముల ధర రూ.18,660 పలికింది. అంతక్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ.260 ఎక్కువ. ముంబయిలో 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం రూ.18,475, 99.9స్వచ్ఛత కలిగిన బంగారం రూ.18,560 పలికింది.
అంతర్జాతీయంగా భారీ డిమాండు
అంతర్జాతీయంగా వ్యాపారులు, వినియోగదారులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం కొనుగోళ్లలో ప్రముఖులైన కోటీశ్వరుడు జార్జి సోరస్, మరో కోట్లాధిపతి న్యూయార్క్‌కు చెందిన జాన్ పాల్సన్ సారథ్యంలోని పాల్సన్‌లు ఈ నెల 21 నాటికి రికార్డు స్థాయిలో మదుపు చేశారని తెలుస్తోంది.
ఈ నెల మొదటి నుంచీ పెరుగుదల
*ఏప్రిల్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.16,262- రూ.17,140 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే, కనిష్ఠంగా ఔన్సు పుత్తడి(28.34 గ్రాములు) 1,111 డాలర్లు, గరిష్ఠం 1,182 డాలర్లు పలికింది.
*ఈ నెల 2వారంలో పసిడి ధరలు అమాంతంగా ఎగబాకాయి. మే12న దేశీయ విపణిలో 10గ్రాములు రూ.18,550పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఒక ఔన్సు 1,245డాలర్లు అమ్మింది. అదే అత్యధిక ధర కావడం విశేషం.
*మల్టి కమోడిటీ ఎక్స్ఛేంజి(ఎంసీఎక్స్)లో జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులలో సువర్ణం ధర 10 గ్రాములకు రూ.18,390కి చేరుకొంది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్సు 1,189 డాలర్లను తాకింది.
*ఎంసీఎక్స్‌లోనే ఆగస్టు కాంట్రాక్టు ధర 0.27% అధికంగా పది గ్రాములకు రూ.18,125 పలికింది.
జులై వరకు భారత్‌లో అధిక గిరాకీ
*భారతదేశంలో ఏప్రిల్-జులై మధ్య బంగారానికి గిరాకీ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్ల కాలం కావడమే ఇందుకు కారణం. ఈ కాలంలో విక్రయాల కోసం వ్యాపారులు తమ వద్ద బంగారు నిల్వలను అధికంగా ఉంచుకోవాలని చూస్తారు.
*మన దేశంలోకి పసిడి దిగుమతులు గత నెల 71 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్‌లో 34.2 టన్నుల స్వర్ణం దిగుమతి అయింది. మార్చిలో 27.8 టన్నులు, ఫిబ్రవరిలో 28.8 టన్నులు, జనవరిలో 34 టన్నుల పుత్తడిని భారత్ దిగుమతి చేసుకొంది.
మున్ముందు మరింత ప్రియం
బంగారం ధరలు మున్ముందు మరింతగా భగ్గుమనే అవకాశాలున్నాయని ఓ వార్తాసంస్థ ఈ నెల మొదట్లో జరిపిన అభిప్రాయ సేకరణలో వెల్లడయింది. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో నాలుగింట మూడొంతుల మందికి పైగా బంగారం ఈ సంవత్సరం ఆఖరుకల్లా రికార్డు స్థాయిలో ఔన్సుకు 1,250 డాలర్లను తాకవచ్చని అంచనావేశారు. మరొక అభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారు ఈ ఏడాది చివరికి బంగారం 1,500 డాలర్ల స్థాయిని అందుకొంటుందని చెప్పడానికీ వెనుకాడలేదు!
*అమెరికాలో రెండు ప్రధాన బ్యాంకులు గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్‌లు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తంచేశాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ అయితే 1,300 స్థాయిని కూడా అందుకోగలదని ఊహించాయి.
*బ్రిటన్‌కు చెందిన ఆర్‌బీఎస్ మాత్రం జూన్ నెలాఖరుకు కనకం 1,100- 1,150 డాలర్ల మధ్య కదలాడుతుందని భావిస్తోంది.
*ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు సడలిపోయేవిగా కనపడడం లేదని, అదే బంగారం ధరలకు ఊతం అందిస్తోందని విశ్లేషిస్తున్నారు.
తరణోపాయం లేదా!
వడ్డీరేట్ల పెరుగుదల బంగారం పట్ల ఆకర్షణను కొంత తగ్గించగలదంటున్నారు. అదే సమయంలో సమీప భవిష్యత్తులో ఇటువంటి వడ్డీరేట్ల పెంపును ఊహించజాలమని కూడా చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఆర్‌బీఐ లాగే ఇది అమెరికాలో కేంద్ర బ్యాంకు) వచ్చే సంవత్సరం వరకు వడ్డీ రేట్లను పెంచే ఆలోచన చేయకపోవచ్చని పరిశ్రమ ప్రముఖుడు ఒకరు అంచనావేశారు.
- రామారావు, చందన బ్రదర్స్ |
- ప్రవీణ్‌కుమార్, శ్రీ బాలాజీ జ్యుయలరీస్ |