Wednesday, May 12, 2010

సెకనుకు అరపైసా

రాష్ట్ర టెలికాం విపణిలో మరింత పోటీ
సేవలు ప్రారంభించిన ఎంటీఎస్‌
సొంత నెట్‌వర్క్‌లో స్థానిక కాల్స్‌కు పావు పైసానే
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర టెలికామ్‌ విపణిలో పోటీ మరింత తీవ్రం కానుంది. సెకనుకు అర పైసా పథకంతో రాష్ట్ర విపణిలోకి సిస్టెమా శ్యామ్‌ టెలిసర్వీసెస్‌ అడుగు పెట్టింది. ఎంటీఎస్‌ బ్రాండ్‌తో సీడీఎంఏ ఆధారిత మొబైల్‌ సేవలందిస్తున్న కంపెనీ మంగళవారం రాష్ట్రంలో లాంఛనంగా సేవలను ప్రారంభించింది. 'ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు ఫోన్‌ చేసినా.. సెకనుకు అరపైసా ఛార్జీ వసూలు చేస్తాం. ఎంటీఎస్‌ నుంచి ఎంటీఎస్‌ మొబైల్‌కు కేవలం సెకనుకు పావు పైసానే' అని సిస్టెమా శ్యామ్‌ టెలి సర్వీసెస్‌ అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సెవలోద్‌ రోజనవ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సేవలను విస్తరించినట్లవుతుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రం 12వ సర్కిల్‌. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్ని సర్కిళ్లలో సేవలను ప్రారంభిస్తాం అని రోజనవ్‌ తెలిపారు. తొలి రోజు నుంచే 557 పట్టణాల్లో ఎంటీఎస్‌ మొబైల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సదుపాయం ఉంటుంది.

పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు
సిస్టెమా శ్యామ్‌ టెలిసర్వీసెస్‌ (ఎస్‌ఎస్‌టీఎల్‌)లో రష్యాకు చెందిన సిస్టెమాకు 74 శాతం, శ్యామ్‌ గ్రూప్‌నకు 23.5 శాతం వాటా ఉండగా.. శ్యామ్‌ గ్రూప్‌నకు చెందిన వాటాదారుల చేతిలో 2.5 శాతం ఉంది. నిబంధనల ప్రకారం కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. వచ్చే ఏడాది ఏడాదిన్నరలో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 10 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఎస్‌ఎస్‌టీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌ టాండన్‌ తెలిపారు. 2013 నాటికి లాభనష్టాలు లేని స్థితి (బ్రేక్‌ ఈవెన్‌) రాగలదని కంపెనీ అంచనా వేస్తోంది. నెట్‌వర్క్‌ తదితరాలపై 200 కోట్ల డాలర్ల (దాదాపు రూ.9,200 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. అవకాశాలు లభిస్తే కంపెనీల కొనుగోలుకు ఎస్‌ఎస్‌టీఎల్‌ ఆసక్తిగానే ఉందని తెలిపారు.

నావిగేషన్‌ సేవల్లోకి సిస్టెమా విస్తరణ
దేశీయ ఔషధ, నావిగేషన్‌ సాంకేతిక పరిజ్ఞాన విభాగాల్లోకి విస్తరించాలని రష్యా టెలికాం దిగ్గజం సిస్టెమా భావిస్తోంది. గ్లోబల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ (గ్లోనాస్‌)కు అవసరమైన నావిగేషనల్‌ రిసీవర్ల తయారీని భారత్‌లో చేపట్టనున్నట్లు జేఎస్‌ఎఫ్‌సీ సిస్టెమా ఇండియా ముఖ్య ప్రతినిధి అలెగ్జాండర్‌ చినేవ్‌ తెలిపారు. గ్లోనాస్‌ రిసీవర్ల తయారీకి ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), గ్లోనాస్‌ ఆపరేటర్‌ ఎన్‌ఐఎస్‌ మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏర్పాటయ్యే సంయుక్త సంస్థ భారత్‌లో గ్లోనాస్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవలు అందిస్తుంది. ఔషధ రంగంలో సహకార అవకాశాలను పరిశీలించడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని సిస్టెమా గ్రూప్‌ ప్రతినిధులు కలిసినట్లు చెప్పారు.