Monday, May 10, 2010

నా వారసుడు ఆదిత్య: ఎల్ఎన్ మిట్టల్

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ పగ్గాలను ఆదిత్య మిట్టల్‌కు అప్పగించటానికి లక్ష్మీ నివాస్ మిట్టల్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 15 వ తేదీతో ఎల్ఎన్ మిట్టల్‌కు 60 ఏళ్లు రానుండటంతో ఆర్సెలార్ గ్రూప్‌కు చైర్మన్ ఎవరేనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన వారసునిగా కుమారుడు బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన ప్రకటించటం విశేషం. అయితే కంపెనీకి తన వారసునిగా ఎవరిని నియమించాలనే దానిపై బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ఆర్సెలార్ గ్రూప్‌కు భవిష్యత్తులో సిఇఒ, చైర్మన్‌గా ఆదిత్య మిట్టల్ తన పాత్రను సమర్థవంతంగా పోషించటమే కాకుండా కంపెనీని మరింత వృద్ధి పథంలోకి తీసుకువస్తాడని గ్రూప్ ప్రస్తుత చైర్మన్ ఎల్ఎన్ మిట్టల్ పేర్కొన్నారు. యుఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, వార్టన్ స్కూల్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆదిత్య మిట్టల్ నియామకంపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అది ఎప్పుడనేది తనకు తెలియదని ఆయన తెలిపారు.

ఆదిత్య మిట్టల్ ప్రస్తుతం ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 2006లో ఆర్సెలార్ కొనుగోలు ఒప్పందంలో ఈయన కీలక పాత్ర పోషించటమే కాకుండా కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాలలో పాలు పంచుకున్నారు.