Monday, May 31, 2010

త్వరలో పరిష్కారం! ...న్యాయస్థానం వెలుపలే ..

సెబీ-ఐఆర్‌డీఏల ఆధిపత్య పోరుపై హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అభిప్రాయం
ముంబయి: భారత సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజి బోర్డు (సెబీ), బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ)ల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుకు ప్రభుత్వం త్వరలోనే న్యాయస్థానాల పరిధికి వెలుపల ఒక పరిష్కారాన్ని (ఔటాఫ్‌ కోర్ట్‌ సొల్యూషన్‌) కనుగొనే అవకాశం ఉంది. ప్రముఖ బ్యాంకర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ ఈ విషయం వెల్లడించారు. యూనిట్‌ లింక్డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌)ల న్యాయనిర్వహణ (జ్యూరిస్‌డిక్షన్‌) నాదంటే నాదని ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న ఘర్షణపై పునరాలోచనే రాగల కొద్ది రోజులలో దీనిని ఒక కొలిక్కి తీసుకురానుందని ఆయన ఆదివారమిక్కడ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేపిటల్‌ మార్కెట్‌, బీమా వ్యాపారాల నియంత్రణ సంస్థలు న్యాయస్థానం గడప తొక్కేటట్లు చేసినందుకు ప్రభుత్వాన్ని పరేఖ్‌ విమర్శించారు. ఫైనాన్షియల్‌ సేవలు సహా పలు విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి ఆయన కీలకమైన సలహాదారుగా పనిచేసిన సంగతి తెలిసిందే. 'రెండు నియంత్రణ సంస్థలు కత్తులు దూసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా, చెప్పండి.. భారత్‌ నగుబాటు పాలైంది..' అని పరేఖ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో దీనిని పరిష్కరిస్తుందని, కోర్టు కేసులు ఉపసంహరించుకొంటారన్నారు.

పరేఖ్‌ ఆధ్వర్యంలోని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు అటు బీమా, ఇటు మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాలు రెంటినీ నిర్వహిస్తోంది. 'మాకు రెండు విభాగాలలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి' అని పరేఖ్‌ చెప్పారు. కోర్టులు ఎక్కువ సమయం తీసుకొంటాయన్న అభిప్రాయం ప్రభుత్వానికి కలిగినట్లు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ అంశం కోర్టుకు వెళ్లి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. తగాదా వెంటనే సమసిపోవాలని ఆకాంక్షించారు.

'సత్యం బోర్డులో నా నియామకం వివాదాస్పదం కానే కాదు'
సత్యం కంప్యూటర్‌ కుంభకోణం దరిమిలా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో తనను సభ్యుడిగా నియమించడంపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) చేసిన విమర్శను దీపక్‌ పరేఖ్‌ తోసిపుచ్చారు. ఆ నియామకంలో సత్యం బోర్డుకు, హెచ్‌డీఎఫ్‌సీకి మధ్య ఎటువంటి వ్యాపార ప్రయోజనాల అంశమూ ముడిపడి లేదు అని ఆయన స్పష్టం చేశారు. సత్యం ప్రహసనంలో ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఛైర్మన్‌ను ఎందుకు నియమించారో ఐసీఏఐ కమిటీ అర్థం చేసుకోలేకపోయింది అని ఐసీఏఐ గత నెల తన తుది నివేదికలో పేర్కొనడంపై అడిగిన ఒక ప్రశ్నకు పరేఖ్‌ జవాబిస్తూ, 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డులో నేను సభ్యుడిని కాదు. మేం ఆ కంపెనీకి (సత్యంకు) అప్పు ఇవ్వలేదు. బ్యాంకులో వారి కల్పిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండేవి. నిజానికి వాటి ఉనికే లేదు. మేం అప్పు ఇచ్చింది మేటాస్‌కు (ఈ కంపెనీని 'సత్యం' రామలింగ రాజు కుమారుడు ప్రమోట్‌ చేశారు)' అన్నారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొంత విదేశీ మారక ద్రవ్య పెట్టుబడి ఉండేదని పరేఖ్‌ వివరణ ఇచ్చారు. 'వారు (సత్యం) ఫారిన్‌ ఎక్స్ఛేంజి రక్షణ తీసుకున్నారు. ఆమేరకు కొంత కవర్‌ ఉండింది..' అని ఆయన అన్నారు.