

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న వాహన ప్రదర్శన 'ఆటో షో సౌత్'కు మంచి స్పందన వస్తోంది. సందర్శకుల రద్దీతో శనివారం ప్రదర్శన కిటకిటలాడింది. టయోటా కంపెనీ వచ్చే మార్చిలో విడుదల చేయబోయే ఇతియోస్ కార్లు ఈ ప్రదర్శనకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే టాటా మోటార్స్ స్టార్‌బస్, వింగర్ మోడళ్లూ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షలు ఖరీదు చేసే వాణిజ్య వాహనాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు టాటా మోటర్స్ ఏరియా మేనేజర్ ఎ.జి.ప్రసాద్ తెలిపారు.
హోండా: హోండా కంపెనీ మూడు రకాల కార్లను ప్రదర్శనకు ఉంచింది. అవి: జాజ్, హోండా సిటీ సివిక్, అకార్డ్ మోడళ్లు. సివిక్ కారుపై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. క్రూస్ కంట్రోల్ వ్యవస్థ ఈ కారు ప్రత్యేకత. వాహనం వేగాన్ని సెట్ చేసుకునే అవకాశం ఉంది. దీని ధర రూ.14.5 లక్షల నుంచి రూ.16.5 లక్షలు.


విభిన్న ద్విచక్రవాహనాలు: యమహా, టీవీస్, హోండా కంపెనీలు కొత్తగా తయారు చేసిన ద్విచక్రవాహనాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యమహా కంపెనీకి చెందిన ఆర్‌ఐ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైకు విలువ రూ.14 లక్షలు! అలాగే 1670 సీసీల ఎంటీ 01 బైకు రూ. 10 లక్షలు. టీవీఎస్ సంస్థ వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్న టీవీఎస్ వీగో బైకు ప్రదర్శనకు ఉంచారు. మహిళలకూ ఇది అనువుగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. అలాగే హోండా కంపెనీ వారి డేజ్లర్ 150సీసీ బైక్, సీబీ 1000ఆర్ బైకులు వాహనప్రియులను ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ భారతాన తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నేటితో ముగియనుంది. ప్రవేశ రుసుం రూ.99.