Tuesday, May 11, 2010

సుబాబుల్‌ రైతు విలవిల

సగం కూడా దక్కని మద్దతు ధర
కొల్లగొడుతున్న దళారీలు, ఆర్‌సీ వ్యాపారులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాగితపు పరిశ్రమ నిలదొక్కుకునేందుకు తోడ్పడిన సుబాబుల్‌ రైతులు నేడు గిట్టుబాటు ధర లభించక విలవిలలాడుతున్నారు. దళారులు, ఆర్‌సీ వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు కుమ్మక్కై వారిని అడుగడుగునా దోచుకుంటున్నారు. మార్కెటింగ్‌ శాఖ గతేడాది సెప్టెంబరు 24న టన్నుకు రూ.1750 మద్దతు ధర ప్రకటించింది. వాణిజ్యపన్నుల శాఖ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల (ఆర్‌సీ) ద్వారా సుబాబుల్‌ రవాణా చేయకూడదని, నిర్దేశించిన 35 డంపింగ్‌ యార్డుల్లో కొనుగోళ్లు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. కొనుగోళ్లను ఆన్‌లైన్‌లో నమోదుచేసి వారం రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయాలని స్పష్టంచేసింది. ఈ ఆదేశాలు జారీచేసి ఏడు నెలలు గడుస్తున్నా, ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో సుబాబుల్‌ సాగులో ఉంది. ముఖ్యంగా ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దీన్ని సాగుచేస్తున్నారు. తొలినాళ్లలో గిట్టుబాటు ధరలు లభించగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ధరలో సగం కూడా లభించక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. డంపింగ్‌ యార్డులుగా నిర్దేశించిన వెయింగ్‌ కేంద్రాలు దళారులతోపాటు కాగితం కంపెనీలు, మార్కెట్‌ యార్డు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. రైతులు సుబాబుల్‌ కర్ర తీసుకొస్తే నాణ్యత లేదని, సన్న కర్ర ఉందని, ఆశించిన సైజు రాలేదని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అదే దళారులు తీసుకొచ్చిన కర్రను ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. దళారులు మాత్రం రూ.700 మాత్రమే రైతుల చేతిలోపెట్టి, మిగిలిన సొమ్ము జేబులో వేసుకుంటున్నారు. ఇందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు తమవంతుగా దళారీలకు సహకారం అందిస్తున్నారు. ఇలా సుబాబుల్‌ దళారీ నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తుండగా, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శుల సంపాదన నెలకు రూ.లక్ష వరకు ఉన్నట్లు సమాచారం. కాగితం కంపెనీలు సుబాబుల్‌ కర్రను నేరుగా రైతు నుంచి కొనుగోలు చేస్తే, టన్నుకు రూ.1750 మద్దతు ధరతోపాటు రవాణా ఛార్జీల రూపేణా మరో రూ.650 నుంచి రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే టన్ను కర్రకు దాదాపు రూ.2400 నుంచి రూ.2550 వరకు వెచ్చించాలి. అదే దళారుల నుంచి కొంటే రూ.2 వేలకే టన్ను సుబాబుల్‌ లభిస్తోంది. ఈ కారణంగా రైతు నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా దళారీలు, ఆర్‌సీ ఉన్న వ్యాపారుల రాజ్యం కొనసాగుతోంది.