Saturday, May 8, 2010

సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు

ఇటు కార్పొరేట్‌ రంగం.. అటు మదుపర్లు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రిలయన్స్‌ గ్యాస్‌ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) - రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌) గ్యాస్‌ వివాదంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. భారత కార్పొరేట్‌ చరిత్రలోనే ఈ కేసుకు ఒక ప్రత్యేకత ఉంది. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలకు అధిపతులైన అంబానీ సోదరుల మధ్య రగుల్కొన్న ఈవివాదం కొన్ని సందర్భాల్లో కోర్టు వెలుపలే పరిష్కారమయ్యేలా చూసేందుకు యత్నించినా.. చివరకు అవి ఫలించక కోర్టు గడప ఎక్కక తప్పలేదు.

కోర్టు విచారణ డిసెంబరు 18నే పూర్తయింది. ఈ విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్‌ వచ్చే మంగళవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈలోగానే తీర్పు వెలువడనుంది. అంబానీ సోదరుల గ్యాస్‌ వివాదం కేవలం వారు ఉభయులకు సంబంధించిన వ్యవహారమే కాదు.. స్టాక్‌ మార్కెట్‌తోను, రిలయన్స్‌ గ్యాస్‌తో ముడిపడిన కంపెనీల పనితీరునూ ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో దేశ ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేయనుండటంతో ప్రపంచ దేశాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.


వివాదం సాగిందిలా..
అక్టోబరు 2004 : రిలయన్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌) ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న విద్యుత్తు ప్రాజెక్టుకు కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 క్షేత్రం నుంచి గ్యాస్‌ సరఫరా చేయాలన్న తీర్మానాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) బోర్డు ఆమోదించింది.

డిసెంబరు 2005: రిలయన్స్‌ గ్రూపు విభజన.

జనవరి 2006: 2004లో ఒక ప్రత్యేక ఒప్పందంలో ఎన్‌టీపీసీతో కుదుర్చుకున్న ధర మేరకు గ్యాస్‌ సరఫరా చేసేటట్లు ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌తో ఆర్‌ఐఎల్‌ ఒక ఒప్పందం కుదుర్చుకొంది.

మార్చి 2006: ఎంత ధరకు గ్యాస్‌ను విక్రయించాలన్నదానికి ప్రభుత్వ ఆమోదం అవసరమని కాంట్రాక్టులో పేర్కొన్నారు. ఆర్‌ఐఎల్‌ చేసిన గ్యాస్‌ ధర నిర్ణయాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ధర నిర్ణయం స్వతంత్ర పద్ధతిలో (ఆర్మ్‌స్‌ లెన్త్‌ సూత్రం ప్రకారం) జరగాలని తేల్చి చెప్పింది.

జులై 2006: ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో జనవరి 2006లో కుదిరిన ఒప్పందం చెల్లకుండా పోయింది. కానీ ఆర్‌ఐఎల్‌ ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు (పీఎస్‌సీ) ప్రకారం తమకు గ్యాస్‌ సరఫరా చేయాలని, 2004 బోర్డు తీర్మానాన్ని గౌరవించాలని అనిల్‌ అంబానీ కోరారు.

డిసెంబరు 2006: ముంబయి హైకోర్టులో ఆర్‌ఐఎల్‌పై ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ కేసు నమోదు చేసింది.

జూన్‌ 2007: గ్యాస్‌ విక్రయాలకు సంబంధించి మూడో పక్షంతో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోకుండా ఆర్‌ఐఎల్‌ను కోర్టు నిలువరించింది.

అక్టోబరు 2007: వివాదాన్ని నాలుగు నెలలలోపుస్నేహపూర్వకంగా పరిష్కరించుకోవలసిందిగా కోర్టు ఇరు పక్షాలకు సూచించింది.

జనవరి 2008: ఈ ఉత్తర్వుపై ఉభయ పక్షాలు తిరిగి కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాయి.

ఫిబ్రవరి 2008: ఈ కేసులో ప్రభుత్వం మరో పక్షంగా చేరింది.

జనవరి 2009: స్టేను వెకేట్‌ చేయాలంటూ ప్రభుత్వం కోర్టుకు దరఖాస్తు పెట్టుకొంది. తుది తీర్పునకు వీలు కల్పిస్తూ స్టేను కోర్టు వెకేట్‌ చేసింది.

జూన్‌ 2009: ఒక్కో ఎంబీటీయూకు 2.34 డాలర్ల చొప్పున రోజుకు 28 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను 17 ఏళ్ల పాటు ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు ఆర్‌ఐఎల్‌ సరఫరా చేయాలని ముంబయి హైకోర్టు తీర్పునిచ్చింది.

జులై 2009: ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌, ఆర్‌ఐఎల్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేజీ గ్యాస్‌ జాతీయ సంపద అంటూ ప్రభుత్వం కూడా ఈ వివాదంలో అడుగుపెట్టింది.

ఆర్‌ఐఎల్‌ ఆదాయాలపై..
* ఒక్కో ఎంబీటీయూ గ్యాస్‌ను 2.34 డాలర్ల(దాదాపు రూ.105.30) చొప్పున 28 ఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌కు సరఫరా చేయడం వల్ల ఆర్‌ఐఎల్‌ సుమారు రూ.32,900 కోట్ల ఆదాయాన్ని కోల్పోవచ్చు.

* ఏప్రిల్‌ 2009లో ఉత్పత్తి ప్రారంభించే నాటికి ఒక్కో ఎంబీటీయూ గ్యాస్‌ ఉత్పత్తి వ్యయం 2.9 డాలర్లు(దాదాపు రూ.130.50). ఒక్కో ఎంబీటీయూ విక్రయ ధర 2.34 డాలర్లు(దాదాపు రూ.105.30). కేజీ డీ-6లో ఉన్న 10 టీసీఎఫ్‌ల గ్యాస్‌ నిక్షేపాల వల్ల 21 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.18,900 కోట్లు) ఆదాయం వస్తుందన్నది పరిశ్రమ వర్గాల అంచనా.

* ఇందుకు మొత్తం మూలధన వ్యయం 10 బిలియన్‌ డాలర్లు( దాదాపు రూ.45,000 కోట్లు) కాగా, నిర్వహణ వ్యయం, రాయల్టీ దాదాపు 5 బిలియన్‌ డాలర్లు(రూ.22,500 కోట్లు).

* 6 బిలియన్‌ డాలర్ల (రూ.27,000 కోట్లు)ను లాభాల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవచ్చు. మిగిలిన వాటా కాంట్రాక్టర్ల (ఆర్‌ఐఎల్‌, నికో రిసోర్సెస్‌) పరం అవుతుంది.

ఆర్‌ఐఎల్‌/ఎన్‌టీపీసీ కేసు
* ఒక్కో ఎంటీబీయూకు 2.34 డాలర్ల చొప్పున 17 ఏళ్లపాటు 12 ఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సంబంధించి ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌ల ఒక అవగాహన ఉంది. ఈ కేసు కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ ఒప్పందం ఆధారంగానే ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ గ్యాస్‌ ధరను నిర్ణయించారు.

* ఒకవేళ కేసులో తీర్పు ఆర్‌ఐఎల్‌కు వ్యతిరేకంగా వెలువడేటట్లయితే కేజీ బేసిన్‌ నుంచి ఒక్కో ఎంబీటీయూకు 2.34 డాలర్ల వంతున 49 ఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది.

* గ్యాస్‌ లభ్యతలో ఇబ్బందులు ఏర్పడి ఎన్‌టీపీసీ పెట్టుబడులు ప్రభావితం అయ్యాయి.

జాతీయ స్థాయిలో ప్రభావం
* కేజీ-డీ6 నుంచి గ్యాస్‌ కేటాయింపులు పొందిన ఎరువుల కంపెనీలు, విద్యుత్తు కంపెనీల భవిష్యత్‌పై ప్రభావం ఉండవచ్చు.అంతే కాకుండా తీర్పు ప్రభుత్వానికి, గ్యాస్‌ సరఫరాదారులకు మధ్య ఉత్పత్తిని పంపకానికి ఒక కొలమానం కాగలదు.

ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌
ప్రతిపాదిత 7000 మె.వా. సామర్థ్యం ఉన్న దాద్రి విద్యుత్తు ప్రాజెక్టు ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఇతర ప్రాజెక్టులకు ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ ఈ గ్యాస్‌ వాటాను వాడుకొనే అవకాశం లేదు.