Monday, May 10, 2010

కోల్‌ ఇండియా ఐపీఓకు సర్వం సిద్ధం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపివో)కు రావడానికి రంగం సిద్ధమైంది. ఐపివో కోసం ప్రభుత్వం ఆరు మర్చెంట్‌ బ్యాంకర్లను నియమించే పనిలో ఉంది. ఇందులో తక్కువ ధరకు బిడ్డింగ్‌ వేసిన సిటీ గ్రూప్‌ కూడా ఉంది. మిగిలిన వాటిలో డచ్సే బ్యాంక్‌, మోర్గాన్‌ స్టాన్లీ, ఈనాం, కోటక్‌ మహేంద్ర, డిఎస్‌పి మెరిల్‌ రిచ్‌ సంస్థలు ఉన్నాయి. కోల్‌ ఇండియా ఐపివోకు ఉన్న ప్రాధాన్యత, పరిమాణం బట్టి సిటీ గ్రూప్‌ దాదాపు జీరో ఫీజు బిడ్‌ దాఖలు చేసింది. అంతర్జాతీయ నియమాల ప్రకారం సాధారణంగా ఐపివో నిర్వహించే మర్చంట్‌ మేనేజర్లకు దాని పరిణామంలో 3-5 శాతం కమీషన్‌ చెల్లిస్తారు.

ఆలెక్కన కోల్‌ ఇండియా ఐపివో ద్వారా ప్రభుత్వం రూ.12,000 కోట్ల సేకరిం చాలని భావిస్తోంది. కాగా వాణిజ్య కాంట్రాక్టు పత్రాలపై ఒప్పందాలు, సంతకాలు చేయవలసి ఉన్నందున జీరో ఫీజు బిడ్లను ప్రభుత్వం తిరస్కరించవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఐపివో వ్యవహారం పూర్తి కావడానికి న్యాయపరమై ఖర్చులు దాదాపు రూ. 50 లక్షలు అవుతాయని అంచనా. దేశంలో ఇలాంటి బిడ్‌ దాఖ లు చేయడం ఇదే ప్రధమమెనా, దీని వెనుక వ్యూహాలు దాగిఉన్నా య ని, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం ఈ ఏడాది రూ.40,000 కోట్లను సేకరించాలని భావిస్తుం డడంతో సిటీ గ్రూప్‌ మిగిలిన ఐపివోలను దక్కించుకోవడానికి ఈవిధంగా చేసిందని భావిస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ రెండు రోజులలో మర్చంట్‌ బ్యాంకర్లను నియమించిన పక్షంలో ఇష్యూ పూర్తి కావడానికి కనీసం మూడు, నాలుగు నెలల కాలం పడుతుంది.

పైగా ఇప్పుడు మార్కెట్లపై యూరోపియన్‌ సంక్షోభం ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. వచ్చే జూలై, ఆగస్టు మాసంలో కోల్‌ ఇండియా ఐపివో బైటకు రావచ్చు. కోల్‌ ఇండియాలో పది శాతం పెట్టుబడులను ఉపసంహరించడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఈక్విటీలో ఈ సంస్థకు చెందిన 4.16 లక్షల మంది ఉద్యోగులకు కూడా భాగం కల్పించాలని నిర్ణయించారు. కోల్‌ ఇండియాకు చెందిన 63.13 కోట్ల షేర్లను విక్రయించబోతున్నారు. ఉపసంహరణ ముసాయిదా త్వరలో కేబినెట్‌కు రానుంది. గత వారం పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కోల్‌ ఇండియా ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడింది.

అయితే పాక్షికంగానే ఉపసంహరణ ఉంటుందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణమ్‌ ముఖర్జీ హామీ ఇవ్వడంతో మిగిలిన కార్మిక సంఘాలు సమ్మె నుండి వెనక్కు తగ్గాయి. 2008లో కోల్‌ ఇండియా కు ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఆ క్రమంలోనే రానున్న మూడు సంవత్సరాల లోపు సంస్థను స్టాక్‌ మార్కెట్లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఎన్‌టిపిసి, ఆర్‌ఇసికి చెందిన షేర్లను వేలం ప్రాతిపదికన నిర్వహించడంతో ప్రజల నుండి స్పందన అంతగా లభించకపోవడంతో కోల్‌ ఇండియా ఐపివోను పూర్తి బుక్‌ బిల్డింగ్‌ ప్రాతిపదికన నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ సిబ్బందికి షేర్ల ధరలో 5 శాతం రాయితీ ఇస్తారు. కోల్‌ ఇండి యా షేర్లను సిబ్బందితో పాటు, అనుబంధ కంపెనీలకు కేటాయిం చడానికి సెబీ ప్రత్యేకంగా అనుమతించింది.