Thursday, May 13, 2010

వారెవ్వా.. మొబైల్‌ మమకారం

రోడ్డు దాటేవేళా వదలట్లేదు
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు
సర్వే చెప్పిన సత్యాలివి
లండన్‌: రోడ్డు మీద వెళుతున్నామనుకోండి.. మన పక్కనతను తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. పాపం పిచ్చేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అతను సెల్‌ మాట్లాడుతూ ఉంటాడన్న మాట. కానీ.. రోడ్డు దాటుతున్నపుడు కూడా మొబైల్‌లో తలదూర్చే వాళ్లూ ఉన్నారు. సంక్షిప్త సమాచారాలు చూసుకుని ఆనందించేవారూ ఉంటారు. లేదా నెట్‌ విహారం చేసేవారూ ఉంటారు. వీళ్లు పక్కనుంచి కారు వెళ్తోందా?బైక్‌ వెళ్తోందా? అన్న విషయాన్ని గమనించడం లేదట. ఇలాంటి జాఢ్యం మన ఇండియన్లకే కాదు..బ్రిటన్‌నూ పట్టి పీడిస్తోంది. డైలీ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ఓ సర్వేలో తేలిన నిజాలివి.

* దాదాపు 67 శాతం పాదచారులు రోడ్లు దాటేటపుడు మొబైల్‌లో ఊసులు చెప్పుకుంటూ బైక్‌లో వెళ్లేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారట.
* సర్వేలో పాల్గొన్న 60 శాతానికి పైగా బ్రిటిషర్లు రోడ్లు దాటేటపుడు కాల్స్‌ చేస్తామని స్వయానా ఒప్పుకున్నారు.
* దాదాపు 40 శాతం మంది సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎమ్‌ఎస్‌) ఇస్తూనే లేదో చదువుతూనో రోడ్లు దాటుతూ ఉంటామని చెప్పారు.
* 16 శాతం మంది అయితే మరీ ఘోరం. వీరు ఏకంగా ట్రాఫిక్‌లో ఇమెయిల్‌లు చదవడానికీ సిద్ధపడుతుంటారట.
* భీకర ట్రాఫిక్‌లో సైతం మూడింట ఒక వంతు మంది వెబ్‌సైట్లపై కన్నేయడమో లేదా ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారట.
* మరి కొంతమందయితే మీదకొస్తున్న కార్లను చూడకుండా.. మొబైల్‌లో వచ్చే సినిమానో, టీవీ షోలోనూ తలదూరుస్తున్నారట.
* దాదాపు 15 శాతం బ్రిటిషర్లు ప్రమాదం పాలు కావడమో.. లేదా త్రుటిలో తప్పించుకోవడమో జరిగిందంటే వినోదం ఎంత విషాదాన్ని తెచ్చిపెడుతోందో అర్థమవుతుంది. మరో 8 శాతం మంది ఆయా డ్రైవర్ల చేతిలో దెబ్బలు తినడమో.. లేదా తిట్లు తినడమో జరుగుతోంది.