Saturday, May 29, 2010

గూగుల్‌ ఇంటర్నెట్‌ టీవీ

న్యూయార్క్‌: మానవాళి అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటైన టెలివిజన్‌ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులకు లోనవుతోంది.. నలుపు-తెలుపు టీవీలతో ప్రారంభమైన టీవీల శకం.. రంగుల టీవీ, హెచ్‌డీ టీవీ, నుంచి త్రీడీ, ఇంటర్నెట్‌ టీవీలకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఇంటర్‌నెట్‌ సెర్చి ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ ఓ ఇంటర్నెట్‌ టీవీని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విడుదల చేసింది. సోనీ, లాగిటెక్‌, ఇంటెల్‌, అడోబ్‌, బెస్ట్‌ బై వంటి సాంకేతిక దిగ్గజాల భాగస్వామ్యంతోదీన్ని రూపొందించింది. ఇంటెల్‌ కంపెనీకి చెందిన ఆటమ్‌ ప్రాసెసర్‌, అడోబ్‌ సంస్థ ఫ్లాష్‌ సాంకేతిక పరిజ్ఞానాలు దీని సేవలను మరింత సౌకర్యవంతం చేయనున్నాయి. అయితే సోనీ, గూగుల్‌ సంస్థలు తయారుచేసిన ఇంటర్నెట్‌ ఆధారిత టెలివిజన్ల ద్వారా ఇది యాక్సెస్‌ అవుతుంది. అందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌నూ ఆయా సంస్థలే సమకూరుస్తాయి. వచ్చే సెప్టెంబరు, అక్టోబరు నాటికి ఇది అమెరికా వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చనేది అభిజ్ఞవర్గాల సమాచారం.

విశిష్ఠతలు: ఈ గూగుల్‌ టెలివిజన్‌ను టీవీగా, ఇంటర్‌నెట్‌ వెబ్‌గానూ వాడుకునే సౌలభ్యం ఉంది. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ఆధారంగా రూపొందించారు. గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌ మాధ్యమం ద్వారా పనిచేస్తుంది.