Saturday, May 29, 2010

68,000 కోట్లు.. తెచ్చేదెలా ...టెలికం కంపెనీలను వేధిస్తున్న ప్రశ్న ఇదే!

3జీ స్పెక్ట్రమ్‌ వేలం
3జీ వాయుతరంగాల (స్పెక్ట్రమ్‌)కు వేలం ముగిసి నేటికి మూడో రోజు. మొత్తం 22 టెలికాం సర్కిళ్లలో ఈ తరహా సేవలను అందించడానికి ప్రయివేటు రంగంలోని 9 కంపెనీలు పోటీపడ్డాయి. వాటిలో రెండు సంస్థలు మినహా మిగతా సంస్థలు కలసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.67,719 కోట్లు. ఇవి కాకుండా ఒక ఏడాది క్రితమే 3జీ స్పెక్ట్రమ్‌ను పొందిన ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లు వాటి వంతుగా చెల్లించవలసిన రుసుం మరో రూ.16,750.58 కోట్లు ఉంటుందని లెక్క తేలుతోంది. ఎంటిఎన్‌ఎల్‌ ఢిల్లీ, ముంబయిలలో 3జీ సేవలను అందిస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ మిగతా సర్కిళ్లన్నిటిలో ఈ సేవలను అందిస్తుండటం తెలిసిందే. కాగా వేలం విజేతలు ఈనెల 31 కల్లా మొత్తం ఫీజు చెల్లించాలని టెలికాం విభాగం (డాట్‌) సూచించింది. అంతభారీ సొమ్ములు ఉన్న ఫలంగా ఎక్కడినుంచి వస్తాయనేది పెద్ద ప్రశ్న.

బీఎస్‌ఎన్‌ఎల్‌: 3జీ తాజా వేలం తుది బిడ్‌ ప్రకారం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తనకు మంజూరైన స్పెక్ట్రమ్‌కు రూ.10,186.58 కోట్లను కేంద్రానికి చెల్లించవలసి రావచ్చని అభిజ్ఞ వర్గాల కథనం. దీనిపై సంస్థ సీఎండీ కుల్‌దీప్‌ గోయల్‌ను ఒక వార్తాసంస్థ ప్రతినిధి సంప్రదించగా 'డాట్‌ నుంచి లాంఛనపూర్వక సమాచారం అందగానే అంతర్గతంగా చర్చించుకొని, తగిన సమయంలో ఒక నిర్ణయం తీసుకొంటామ'ని ఆయన జవాబిచ్చారు. స్పెక్ట్రమ్‌ ఫీజు చెల్లింపుపై ఎటువంటి మినహాయింపును తమ సంస్థ కోరనేలేదని గోయల్‌ స్పష్టం చేశారు.

ఎంటీిఎన్‌ఎల్‌: కేంద్రానికి మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ స్పెక్ట్రమ్‌ ఫీజు రూపంలో రూ.6,564 కోట్లు చెల్లించవలసి ఉంటుందని ఒక అంచనా. ''ఈ ఫీజు చెల్లింపును గురించి డాట్‌ మమ్మల్ని అడిగిన తరువాత మేం తగిన నిర్ణయం తీసుకొంటామ''ని ఎంటీిఎన్‌ఎల్‌ అధికారి ఒకరు సమాధానమిచ్చారు.

ఇతర ప్రయివేట్‌ కంపెనీల మాటో..
తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడం భారత టెలికాం కంపెనీలకు ఆర్థికంగా ఒత్తిడులు కలిగించేదేనని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రుణం రూపంలో నిధులను పోగుచేసుకోవలసి వస్తే అది ఆయా కంపెనీల మూలధన- రుణ నిష్పత్తిపై ప్రభావం చూపడం ఖాయమని చెప్తున్నారు. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు మినహా ఇతర పలు టెలికాం కంపెనీల రుణ స్థాయిలు అధికంగా ఉన్నాయి. పైపెచ్చు మొబైల్‌ టారిఫ్‌లు అత్యంత పోటీతత్వంతో కూడుకొని ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. కాగా పలు టెల్కోలు ఇటీవల స్వల్పకాల రుణపత్రాలను (సీపీ) విక్రయించి రూ.8,000కోట్లను సమీకరించాయని తెలిసింది.

బ్యాంకు రుణాలు అన్ని కంపెనీలకూ భారీగా దక్కవేమో: ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి తగినంత ఉంది. ఇది ఒక అనుకూలాంశమే. టెలికం కంపెనీలకు స్వల్ప కాలిక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా సిద్ధపడ్డట్లు సమాచారం. కొన్ని ప్రముఖ జాతీయ బ్యాంకులు, మరికొన్ని ప్రయివేటు బ్యాంకులకు టెలికం కంపెనీలకు ఇపుడు అవసరమైన డబ్బులో నాలుగింట ఒకటో వంతు నిధులను సమకూర్చే స్తోమత ఉందంటున్నారు. బ్యాంకులు తాము ఇవ్వదల్చుకొనే రుణాలకు పీఎల్‌ఆర్‌ కన్నా తక్కువ వడ్డీ రేటును వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ఆయా కంపెనీల పరపతి స్థాయిలను నిశితంగా పరిశీలించాకే బ్యాంకులు ముందంజ వేయొచ్చని బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం. ఒకట్రెండు బ్యాంకులు ఇప్పటికే రూ.40,000 కోట్లకు పైగా రుణాలను టెలికాం కంపెనీలకు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నాయి. బ్యాంకులు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఉంచిన నగదును వెలికితీసి టెలికాం కంపెనీలకు ఇస్తే మంచి ప్రతిఫలాన్ని పొందవచ్చని యోచిస్తున్నాయి. టెలికాం కంపెనీలు విదేశీ వాణిజ్య అప్పుల రూపంలో నిధులను సమీకరించుకోవాలని ఆలోచిస్తున్నాయి.

ముందుంది ముసళ్ల పండుగ: టెలికాం కంపెనీల మెడ మీద వేలాడుతోంది 3జీ స్పెక్ట్రమ్‌ రుసుము చెల్లింపు కత్తి ఒక్కటే కాదని, వాటి వద్ద ఉన్న 2జీ స్పెక్ట్రమ్‌కు వన్‌-టైమ్‌ ఫీజు చెల్లించవలసి వస్తే అది, ఇంకా బ్రాడ్‌బ్యాండ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ వేలంలోనూ పోటీ పడేటట్లయితే దానికి చెల్లించవలసిన ఫీజు.. ఇవి టెలికాం కంపెనీలకు ముందుముందు ఎదురయ్యే పరీక్షలని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి.

పెట్టుబడులు ఎప్పటికి తిరిగి వచ్చేనో
ధైర్యంతో టెలికాం కంపెనీలు రూ. 68,000 కోట్లను ప్రభుత్వానికి చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు అనే ప్రశ్న తలెత్తక మానదు. 3జీ సేవలు అపారమైన వ్యాపారావకాశాలను కల్పించనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో ప్రతి నెలా ఇంచుమించు కోటీ నలభై లక్షల నుంచి కోటిన్నర మంది కొత్త వారు మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులుగా (సీడీఎంఎ, జీఎస్‌ఎమ్‌లు కలిపి) తయారవుతున్నారు. 6 కోట్ల మంది వరకు 3జీ ఫోన్‌లను వాడుతున్నారు. సమాచారాన్ని అత్యంత వేగంతో బదిలీ చేసుకోవడంతో పాటు టెలివిజన్‌ కార్యక్రమాల్ని మొబైల్‌ తెర పైన సైతం చూసే, నచ్చిన వీడియోలను కోరి మరీ తిలకించే అవకాశాలు 3జీతో సులభసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించాయి కాబట్టే టెలికాం కంపెనీలు 3జీ స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకోవడానికి పోటాపోటీలు పడ్డాయి. దేశంలో దాదాపు 58 కోట్ల మంది 2జీ వినియోగదారులలో ఏ కొద్ది శాతం మంది ఆధునిక 3జీ సేవల వైపునకు మొగ్గినా, 3జీ వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగిపోగలదు! నాలుగో సంవత్సరం తరువాత నుంచి 3జీ పెట్టుబడులతో పోలిస్తే 3జీ ఆదాయాలు అధికంగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.