Monday, May 10, 2010

బిజినెస్ గైడ్: ప్రింటింగ్ పరిశ్రమ

వ్యాపార, పారిశ్రామిక, వ్యక్తిగత అవసరాలు పెరగడంతో ముద్రణ పరిశ్రమ విస్తృతి పెరుగుతోంది. ఈ తరుణంలో ముద్రణ రం గంలో నూతన వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముద్రణ రంగంలోని కొన్ని పారిశ్రామిక అవకాశాలు మీకోసం..

కంప్యూటర్ స్టేషనరీ తయారీ పరిశ్రమ
అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో వివిధ సంస్థలు రూపొందించుకున్న నమూనా ముద్రణ కాగితాల అవసరం ఉంటుంది. వీటి ముద్రణకు కంప్యూటర్ కంటిన్యూయస్ స్టేషనరీ (ముద్రణ కాగితాలు) లేదా ఫారాలను వినియోగిస్తారు. ఈ స్టేషనరీ పరిశ్రమకు మంచి మార్కెట్ ఉంది.

సంవత్సరానికి 260 లక్షల ఫారాలు ఉత్పత్తి చేసే పరిశ్రమ అంచనా వ్యయం 30 లక్షల రూపాయలు.

పాలీ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ప్రెస్
ఈ ప్రింటింగ్ యంత్రం ద్వారా కాగితం, ప్లాస్టిక్ షీట్లపై ప్రింటింగ్ చేస్తారు. క్యారీ బ్యాగులు, కాగితం కప్పుల షీట్లు, ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ ప్యాకింగ్ మెటీరియల్స్‌పై ఈ యంత్రం ద్వారా ముద్రణ చేయవచ్చు.

రోజుకు 5 వేల షీట్లపై ముద్రించే సామర్థ్యం కలిగిన పరిశ్రమ అంచనా వ్యయం 12 లక్షల రూపాయలు.

బ్యానర్ ప్రింటింగ్ పరిశ్రమ
ఇటీవలి కాలంలో బ్యానర్ ప్రింటింగ్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఎన్నికలు, పండగల సందర్భాల్లో ఈ తరహా ప్రింటింగ్‌లకు మంచి గిరాకీ ఉంటుంది. రబ్బర్ షీట్లు, పివిసి షీట్లు, క్లాత్‌లపై ముద్రణకు వీలైన యంత్రాలను తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు.

గంటకు 200 నుంచి 300 బ్యానర్లు ముద్రించే సెమీ ఆటోమేటెడ్ బ్యానర్ ప్రింటింగ్ పరిశ్రమ అంచనా వ్యయం 10 లక్షల రూపాయలు.