Friday, May 21, 2010

గ్రీస్‌కు రూ.81,000 కోట్లు

తొలి విడత విడుదల చేసిన యూరోపియన్‌ యూనియన్‌
బ్రస్సెల్స్‌: గ్రీస్‌ను అప్పుల బారినుంచి తప్పిస్తామన్న యూరోజోన్‌లోని సాటి 15 దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నాయి.. అవి 14.5 బిలియన్‌ యూరోలకు పైగా (18 బిలియన్‌ డాలర్లు.. అంటే సుమారుగా రూ.81,000 కోట్లు) బదిలీ చేసినట్లు యూరోపియన్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. ఈయూ ఆర్థిక వ్యవహారాల కమిషనర్‌ ఓలి రెన్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ యూరోపియన్‌ కమిషన్‌ ప్రతినిధి నగదు బదిలీని ధ్రువీకరించారు. బుధవారం గ్రీస్‌ 10 సంవత్సరాల కాలపరిమితి గల బాండ్లను తిరిగి చెల్లించవలసి ఉంది. అందుకు 9 బిలియన్‌ యూరోలు ఆ దేశ ప్రభుత్వానికి అవసరం. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గత వారం గ్రీస్‌కు తన వంతుగా 5.5 బి. యూరోలను ఇచ్చింది. ఈ రుణాలు అటు ఈయూ, ఇటు ఐఎంఎఫ్‌లు రానున్న మూడేళ్లలో గ్రీస్‌కు అందజేస్తామని చెప్పిన 110 బిలియన్‌ యూరోల రుణ పథకంలో భాగమే. తమకు సెప్టెంబరులో యూరోజోన్‌ సభ్యత్వ దేశాల నుంచి మరో 9 బి.యూరోలు, ఐఎంఎఫ్‌ నుంచి 2.5 బి.యూరోలు అందనున్నట్లు గ్రీక్‌ ఆర్థిక శాఖ వెల్లడించింది.