Saturday, May 8, 2010

మళ్లీ 18 వేలు దాటిన పసిడి

ఒక్కరోజులో 495 రూపాయిలు పెరుగుదల

న్యూఢిల్లీ : బంగారం ధరలు భగ్గుమన్నాయి. శుక్రవారం నాడు ఒక్కసారిగా పసిడి ధర 495 రూపాయలు పెరిగి మళ్లీ 18,000 రూపాయల స్థాయిని అధిగమించింది. ఇక్కడి బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 495 రూపాయలు పెరిగి 18,110 రూపాయలకు చేరింది.

గత సంవత్సరం నవంబర్ 26న బంగారం ధర ఇదే స్థాయిలో ఉంది. పారిశ్రామిక సంస్థలతోపాటు నాణాల తయారీ కంపెనీల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో వెండి ధరలు కూడా మండిపోయాయి.

శుక్రవారం నాడు కిలో వెండి ధర 565 రూపాయలు ఎగబాకి 28,165 రూపాయలకు చేరుకుంది. వెండి నాణాల ధర (100 నాణాలు) కూడా 100 రూపాయలు పెరిగి 34,000 రూపాయలకు చేరుకుంది. ముంబై బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9) ధర 17,930 రూపాయలకు, 10 గ్రాముల నాణ్యమైన బంగారం (99.5) ధర 17,845 రూపాయలకు పెరిగింది.

కిలో వెండి ధర 28,400 రూపాయల స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఎగబాకుతుండటంతో దేశీయ బులియన్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

కరెన్సీల విలువ పతనం అవుతుండటంతోపాటు షేర్ల ధరలు కుంగటం మూలాన ఈ విభాగాల నుంచి పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతున్నాయని, ఫలితంగా బంగారం ధరలు మళ్లీ కొత్త రెక్కలు కట్టుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. గురువారంనాడు బులియన్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. దీంతో బంగారం ధర 33.20 డాలర్లు పెరిగి 1,208.80 డాలర్లకు దూసుకుపోయింది.

ఈక్విటీల విలువ రోజురోజుకు కరిగిపోతుందడంతో తొందరగా లాభాలను తెచ్చిపెట్టే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోనే బంగారం ధరల్లో మళ్లీ అప్‌ట్రెండ్ స్థితి నెలకొందని వారు అంటున్నారు.