ప్రతిభావంతులకు కంపెనీల పెద్దపీట
ఈ ఏడాది బోలెడు ఉద్యోగావకాశాలు

'భూమ్' సమయంలో సంభవించిన కప్పదాట్లు మళ్లీ తప్పవని.. ప్రతిభావంతుల కోసం పోటీ కంపెనీలు డేగకళ్లతో అన్వేషణ సాగిస్తాయని నిశ్చయానికి వచ్చిన యాజమాన్యాలు తగిన వ్యూహాలు రూపొందిస్తున్నాయి.తమ ఉద్యోగుల్లో సమర్థులు, ఉత్తమ పనితీరు కనబరచినవారు చేజారకుండా చూసుకునేందుకు పదోన్నతులు, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో విశ్వాసపాత్రతకూ పెద్దపీట వేస్తున్నాయ్!
వ్యక్తిగత పనితీరు, వ్యాపార లక్ష్యాలను ఏకీకరించిన స్థితిలో తమ సిబ్బందిలో సత్తా గల వారిని పోటీ కంపెనీలు ఎగరేసుకు పోకుండా చూసుకోవడంలో వివిధ సంస్థల యాజమానులు, మానవ వనరుల విభాగాధిపతులు తలమునకలవుతున్నారు. కంపెనీ వ్యాపార లావాదేవీలు ఇనుమడించడంలో పాత్ర ఉన్న వారికి పెద్దపీట వేయడంలో సందేహించడం లేదు. ప్రతిభ చాటుతున్న వారిని కాపాడుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మానవ వనరుల విభాగానికి అధిక కేటాయింపులు జరుపుతున్నారు. వేతనాల్లో పెంపుదల, ఆకర్షణీయ బోనస్‌లు చెల్లిస్తున్నారు. ప్రతిభావంతులైన సిబ్బందితో నేరుగా సంభాషించి, వారితో అన్యోన్యత పెంపొందించుకోవడంపైనా శ్రద్ధ వహిస్తున్నారు. వస్తు తయారీ, ఐటీ, ఆతిథ్యరంగం, బీపీఓ.. వృద్ధిపథంలోకి వచ్చిన ప్రతి రంగంలోనూ ఇదే స్థితి. అయితే అదనపు చెల్లింపులతోనే 'ప్రతిభ'ను కాపాడుకోలేమన్నది మరికొందరి వాదన.
'ఆరోగ్యవంతమైన పని వాతావరణం, వ్యక్తిగత - కంపెనీ ప్రదర్శనకు అనుగుణమైన ప్రోత్సాహకాలివ్వడం, నైపుణ్యం అభివృద్ధికి చొరవ తీసుకోవడం వంటి ప్రక్రియలు' పాటిస్తే ఉద్యోగులు కంపెనీని వీడరన్నది హెవిట్ అసోసియేట్స్ ఆగ్నేయాసియా ప్రాక్టీస్ లీడర్ సందీప్ చౌధరి మాట. ప్రతిభావంతుల కోసం అన్వేషణ ఈ ఏడాది అంతా కొనసాగుతుంది కనుక, రిటైల్ రంగంలోనూ ఒడిదొడుకులు తప్పవన్న భావనను వ్యక్తపరిచారు రూ.4600 కోట్ల విలువైన గీతాంజలి గ్రూప్‌నకు చెందిన గీతాంజలి లైఫ్‌స్త్టెల్ సీఈఓ దేవాశిష్ దత్తా. వేతనాల పెంపు ఉన్నా, ఉద్యోగుల్లో అనుచిత ఆకాంక్షలు ప్రబలకుండా చూసుకుంటామంటున్నారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ వైవి వర్మ. యాజమాన్య బాధ్యతలు నిర్వర్తించేవారికి అయిదేళ్ల ప్రణాళిక రూపొందించి, అత్యధిక భాగస్వామ్యం కలిగేలా చూస్తామన్నారు.

చౌకధర విమానయానికి పేరుగాంచిన ఇండిగో సంస్థనే తీసుకుంటే ఆర్థికమాంద్యం సమయంలో ప్రతిశాఖకు మూడునెలల కాలానికి తగిన దృక్పథాన్ని ఏర్పరుస్తూ, మూడేళ్ల వ్యాపార ప్రణాళికను నిర్దేశించింది. ఈ సమయంలో ప్రతిభ చాటిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు, విశ్వాసపాత్రతకు అదనపు చెల్లింపులు జరిపింది.
* హ్యూలెట్ ప్యాకార్డ్‌కు చెంది, బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎంఫసిస్ ఐటీ సంస్థ తన 34,000 మంది సిబ్బందితో సంబంధాలు నెరపేందుకు ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోంది. సమర్థులైన నాయకత్వశ్రేణిని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. 2009 ఆఖరులో 25% వరకు బోనస్ చెల్లించారు.
* మాంద్యం సమయంలోనూ తమ సిబ్బంది సంక్షేమంపై తాము చూపిన శ్రద్ధ ఇప్పుడు ఉపకరిస్తుందని ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ సేవల వరకు విస్తరించిన మ్యాక్స్ ఇండియా పేర్కొంటోంది.
* నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేసిన తన సిబ్బంది 35 మందిని ఉత్సాహపరిచేలా అమెరికాలోని తమ రిటైల్ స్టోర్లకు పంపింది గీతాంజలి గ్రూప్.
* హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ మానవ వనరుల విభాగ బడ్జెట్ గత మూడేళ్లుగా 25% చొప్పున పెరుగుతోంది. సీనియర్ జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ పోస్టుల సంఖ్యను ఇతోధికం చేసింది.

- ఇంటర్‌గ్లోబ్ * ఆర్థిక సంక్షోభం సమయంలో తమ ఉద్యోగుల సంక్షేమాన్ని మరువని యాజమాన్యాలకు ఇబ్బందులు రావు... - మ్యాక్స్ ఇండియా * అత్యుత్తమ ప్రతిభావంతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. ముందుండి నడిపించే సమర్థ నాయకత్వమే మా లక్ష్యం... - ఎంఫసిస్ * మరింత వేతనం కోసం ఉద్యోగులు బయటకు వెళ్లేలా చేయం. అయితే విధేయతకూ ప్రోత్సాహాన్నిస్తాం... - రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ * అన్ని స్థాయిల్లో మేనేజర్లకు సాధికారత కల్పించి, మెరుగైన ఫలితాలు సాధిస్తాం... - జెన్‌పాక్ట్ |
కొసమెరుపు: ప్రపంచాన్ని ఆర్థికసంక్షోభం చుట్టుముట్టిన సమయంలో తమ సిబ్బందితో సానుకూలంగా వ్యవహరించిన కంపెనీలకు ప్రస్తుత పరిణామాల్లోనూ ఇబ్బంది ఉండదని మానవ వనరుల విభాగాధిపతులు, కంపెనీల సెక్రటరీలు ఏకగ్రీవంగా తేల్చి చెబుతున్నారు.