Monday, May 10, 2010

నివురు గప్పిన నిప్పు

నివురు గప్పిన నిప్పు
గ్రీస్ వేడితో కథ మొదటికి
ఈ వారంలోనే బెయిల్ ఔట్!

ఆర్థిక సంక్షోభానికి కాలం చెల్లిందని ఉవ్వెత్తిన ఎగసిన స్టాక్ మార్కెట్లు.. కొత్త పెట్టుబడులతో మరోమారు జూలు విదిల్చిన ఇన్వెస్టర్లు.. అంతటా పండుగ వాతావరణం.. ఇక ఫర్వాలేదు అనుకుంటున్న దశలోనే మరో ఉపద్రవం. యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన గ్రీస్ దివాలా స్థాయికి చేరుకుందనే వార్తలు గత కొద్ది వారాలుగా ప్రపంచ మార్కెట్లను కుదిపివేస్తున్నాయి.

ఇన్వెస్టర్ల లోకానికి ఆశనిపాతంగా పరిణమించాయి. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు క్షణక్షణం అనూహ్యంగా కదులుతూ ఇన్వెస్టర్ల గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ సంక్షోభం గ్రీస్‌కు మాత్రమే పరిమితమా.. లేదా యావత్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందా.. అన్న భయాలు సర్వత్రా ఆవరించాయి. ఆర్థిక మాంద్యానికి అడ్డుకట్ట పడిందని, ప్రపంచ దేశాలు పునరుజ్జీవన పథంలో పడ్డాయన్న మాటలు ఎంతవరకు నిజం అన్న భయాలు కూడా విస్తరించాయి.

ప్రస్తుతం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల తీరే ఇందుకు సాక్ష్యం. ఇయు దేశాల్లో సంక్షోభం నివురుగప్పిన నిప్పులా ఉందని, ఇందుకు గ్రీస్ సంక్షోభాన్ని మచ్చు తునకగా భావించవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. గ్రీస్ సంక్షోభం ఇలాగే మరి కొంత కాలం కొనసాగితే మార్కెట్లు మరోసారి తిరోగమించక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

గ్రీస్ సంక్షోభం అంటే..?
ప్రపంచ ఆర్థిక శక్తిలో 27వ స్థానం, కొనుగోలు శక్తిలో 33వ స్థానం, తలసరి ఆదాయంలో 25వస్థానం.. ఇదీ యూరోపియన్ యూనియన్ (ఇయు) దేశమైన గ్రీస్ ప్రత్యేకత. నౌకాశక్తిలో ఈ దేశానికి ఎదురే లేదు. ప్రపంచ నౌకల్లో 18 శాతం వాటా గ్రీస్ సొంతం. ప్రపంచంలోనే అత్యధిక ట్యాం కర్లు, బల్క్ క్యారియర్లు ఈ దేశంలోనే ఉన్నాయి. పర్యాటక పరిశ్రమ కూడా బలీయమైనదే.. ఇంత పెద్ద దేశం రెండేళ్లుగా కొనసాగుతున్న మాం ద్యంతో నీరసించిపోయింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.

గ్రీస్ జిడిపిలో అప్పులు 12 శాతానికి చేరాయి. ఈ పరిస్థితి నుంచి గ్రీస్‌ను గట్టెక్కించడానికి యూరోపియన్ యూనియన్, ఐఎంఎఫ్ ఒక ప్యాకేజీని ప్రకటించాయి. భారీ వడ్డీరేట్లు, ఉద్యోగుల జీతాల బిల్లును తగ్గించుకోవాలంటూ షరతులతో ఈ ప్యాకేజీ అమలుకు గ్రీస్ వెనకడుగు వేసింది. ప్రముఖ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ గ్రీస్ రేటింగ్‌ను అట్టడుగుకు తగ్గించడంతో కథ మొదలైంది.

అంతటా భయం.. భయం..
ఇయులో గ్రీస్ ఒక సభ్య దేశం కావడమే ఈ సంక్షోభానికి కారణం. ఇయు దేశాలన్నింటికీ ఉమ్మడి కరెన్సీ యూరో. ఈ దేశాల్లో బాండ్ల మార్కెట్‌తో పాటు స్టాక్ మార్కెట్లూ విడదీయరాని సంబంధం కలిగివుంటాయి. ఈ కారణాలతో గ్రీస్ సమస్య ఇయు సమస్యగా మారిపోయింది. రేటింగ్ తగ్గడంతో గ్రీస్‌కు అప్పులు పుట్టడం కష్టమైపోయింది. కూపన్ రేటును పెంచి మరీ బాండ్లను విక్రయించడం ప్రారంభించింది. ఈ ప్రభావం అంతిమంగా ఇయు ఉమ్మడి కరెన్సీ యూరోపై పడి దాని విలువ తగ్గిపోయింది.

ఈ సంక్షోభం వేడి క్రమంగా ఇయు సభ్య దేశాలకు పాకడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇయు మార్కెట్ దెబ్బతినడం మొదలుపెట్టిందో అప్పుడే ప్రపంచ మార్కెట్లలో భయం మొదలైంది. ఈ సమస్య కేవలం గ్రీస్‌లోనే ఉందా.. లేదా ఇయు సభ్య దేశాల్లో కనపడని మరిన్ని సమస్యలు ఉన్నాయా.. అనే ఆందోళన మొదలైంది. ఇదే క్రమంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కరెక్షన్‌కు దారితీస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలనూ భయపెడుతోంది.

ఏం జరుగుతోంది..?
కనీవినీ ఎరుగని బెయిల్ ఔట్ ప్యాకేజీతో గ్రీస్ సంక్షోభానికి తాత్కాలికంగా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ వారం ఆఖర్లో ప్రపంచ దేశాల నాయకులందరు సమావేశమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అవసరమైతే.. అమెరికా సైతం ఓ చెయ్యి వేయడానికి సిద్ధమైంది. రెండు, మూడు రోజులుగా యూరోపియన్ కమిషన్‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముమ్మరంగా చర్చలు జరిపారు. ఇవన్నీ ఫలించి ప్యాకేజీ స్పష్టమైన రూపం దాల్చితే గ్రీస్ తాత్కాలికంగా గట్టెక్కినట్లే..

మనకు ఇబ్బందేమీ లేదు..
యూరోపియన్ మార్కెట్‌లో రుణాల సంక్షోభం ఓమాదిరిగా ఉంటే ఇండియాకు సమస్యే ఉండదు. నిజానికి భారతీయ స్టాక్ మార్కెట్లకు ఈ వార్తలు ఎంతో అనుకూలం. రిస్కు ఎక్కువగా ఉండే పశ్చిమ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం మాని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్ఐఐలు క్యూ కడతారు. డాలర్లు తరలిరావడంతో సెన్సెక్స్ భారీగా పెరుగుతుందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా.. మరో పారిశ్రామిక దేశంపై ప్రభావం తప్పనిసరి. ఇండియాకు మాత్రం నష్టం కంటే లాభాలే ఎక్కువని ఆయన అంటున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. ఇయు సంక్షోభం సాధారణ స్థాయిలో ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చి ప్రపంచ సంక్షోభంగా మారితే గ్రీస్ ఉచ్చు నుంచి ఇండియన్లు సైతం తప్పించుకోలేరు అన్నది బసు అభిప్రాయం.

క్రూడ్ ధర భారీగా పడదు...
గ్రీక్ సంక్షోభం ప్రపంచ దేశాల పునరుజ్జీవానికి సవాలు విసురుతున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధర మరోసారి పతనం దిశగా పయనిస్తోంది. అయితే క్రూడాయిల్ ఉత్పత్తిని నియంత్రించవలసిన స్థాయి బ్యారెల్ 65 డాలర్ల వరకు ధర దిగజారుతుందని తాను భావించడంలేదని కతార్ ఆయిల్ మంత్రి అబ్దుల్లా అల్ అతియా ఆదివారం దోహాలో వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సంక్షోభానికి తెర పడుతుందన్న ఆశాభావం ఆయన ప్రకటించారు.

శుక్రవారం అమెరికాలో క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్ 75.11 డాలర్ల స్థాయిలో ఉంది. ఫిబ్రవరి 16న నమోదైన కనిష్ఠ స్థాయి 74.51 డాలర్ల తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిని నమోదు చేయడం ఇదే ప్రథమం. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే పరిస్థితిని సమీక్షించడానికి ఒపెక్ అక్టోబర్‌లో సమావేశం కావలసి ఉండగా గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడంలేదని కువైట్ ఆయిల్ మంత్రి అన్నారు.